మామూలు రోజుల్లోనే ప్రపంచంలో ఏటా 90 లక్షలమంది ఆకలితో చనిపోతుంటారని, కొవిడ్‌వల్ల ఆకలి చావులు రెట్టింపు కానున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. నిన్నమొన్నటివరకు ఆకలి అనేది పేద దేశాల సమస్య అని భావించినవారూ కరోనా దెబ్బకు ఆ అభిప్రాయం మార్చుకోక తప్పడం లేదు. కొవిడ్ కల్లోలంలో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో వంట సరకుల పొట్లాల కోసం ఎగబడిన ప్రజలు పోలీసులతో పోట్లాటకు దిగారు. నైరోబీలో జనం ఆహారం కోసం ముష్టి యుద్ధాలు చేశారు. ఈ రద్దీ ఆఫ్రికాకే పరిమితం కాలేదు. అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో జనం ఆహార దినుసుల కోసం రెండు గంటలసేపు కార్లలో బారులు తీరారు. ఒహాయోలో 4,000 మంది అన్నార్తులు ఆహార ప్యాకెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నారు. భారతదేశంలో లక్షలాది వలస కార్మికులు తిండీనీరూ లేకుండా కాలి నడకన వందల మైళ్ల దూరంలోని స్వస్థలాలకు తరలివెళ్లడం టీవీల్లో, పత్రికల్లో చూసి అందరి మనసులు కలతచెందాయి. లాక్‌డౌన్ కాలంలో దేశమంతటా వ్యక్తులు, మిత్ర బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, మత అనుబంధ సేవాసంఘాలు, అపార్ట్‌మెంట్ వాసులు, కాలనీవాసుల సంఘాలు విరాళాలు పోగు చేసి వంటావార్పు చేపట్టి వలస కార్మికులకు ఆహార పొట్లాలు అందజేశారు. కేరళ, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలూ సాముదాయిక వంటశాలలు ఏర్పరచి ఆకలిగొన్న పేదలకు, వలస కూలీలకు ఉచితంగా, కొందరికి నామమాత్ర ధరకు భోజన సదుపాయం కల్పించాయి. అసలు కరోనా సంక్షోభానికి ముందే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, దిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు సాముదాయిక వంటశాలలు తెరచి పేదలకు, కూలీలకు చాలా తక్కువ ధరలకు ఆహారం అందించేవి, చాలా రాష్ట్రాలు ఇప్పటికీ అందిస్తున్నాయి. ఆ వంటశాలలు చాలామందికి ఉపాధి సైతం కల్పిస్తున్నాయి. కరోనా సంక్షోభంలో ఈ వంటశాలలు ఎంతో అక్కరకొచ్చి, ఇతర రాష్ట్రాలకూ స్ఫూర్తిదాయకమయ్యాయి.
ఆగ్రహించిన ధర్మపీఠం
భారతదేశంలో పేదరికం ఉన్నంతవరకు సాముదాయిక వంటశాలలను కొనసాగించవలసిందేనని ఆలోచనాపరులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కరోనాకు ముందే ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఎంతో వెసులుబాటుగా ఉండేది. దేశంలో 19 కోట్లమంది ఆకలి కడుపులతో నిద్రిస్తున్నారు. ఈ దుస్థితిని రూపుమాపడానికి దేశమంతటా సాముదాయిక వంటశాలలు అమోఘ సాధనం. అందువల్ల వీటి ఏర్పాటుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ గతేడాది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎన్.వి.రమణ అధ్యక్షతలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభ్యర్థనను మన్నించి, సాముదాయిక వంటశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ గత అక్టోబరులోనే కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు సంబంధించి అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేవలం పంజాబ్, నాగాలాండ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, అండమాన్-నికోబార్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ లు మాత్రమే కోర్టు ఉత్తర్వును పాటించాయి. అయిదు నెలలు గడచిపోయినా మిగతా రాష్ట్రాలు సమాధానమివ్వకపోవడంపై కోర్టు మండిపడింది. 24 గంటల్లో అఫిడవిట్లను సమర్పించకపోతే లక్ష రూపాయల జరిమానా కట్టాలని, ఆ గడువు దాటిపోతే మరో అయిదు లక్షల రూపాయలు కట్టాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆదేశించింది. ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే కరోనా కలవరం దేశాన్ని చుట్టుముట్టింది. దీనివల్ల లక్షలమంది బతుకుతెరువు కోల్పోయి ఆకలి చావుల బారిన పడే ప్రమాదం ముంచుకొచ్చింది. దీన్ని నివారించడానికి దేశమంతటా బ్లాకు స్థాయిలో తాత్కాలిక సాముదాయిక వంటశాలలను ఏర్పరచేట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఏప్రిల్‌లో మరో వ్యాజ్యం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైంది. గతేడాది దేశవ్యాప్త సాముదాయిక వంటశాలల ఏర్పాటును కోరిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఫజైల్ అహ్మద్, ఆశిమా మండ్ల కొత్త పిటిషన్ వేశారు.
రాజ్యాంగ ప్రాతిపదిక