అంతర్జాతీయ సమాజంలో ఒక దేశంగా పాకిస్థాన్ భవిష్యత్తు ఏంటో తేల్చేందుకు.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఈ నెల చివరివారంలో సమావేశం కానుంది. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న పాక్.. గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతుందా ? లేదంటే నిర్దేశిత లక్ష్యాలను అందుకోవటం విఫలమైన కారణంగా బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లి 'ఉగ్రదేశం' ముద్ర వేయించుకుంటుందా అనేది త్వరలో తేలనుంది.
పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్లో 2018 నుంచి పాక్ గ్రే జాబితాలోనే కొనసాగుతోంది. ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలని పాకిస్థాన్‌ను అదేశిస్తే.. తానే స్వయంగా హవాలా చేస్తూ.. వారికి సాయపడుతోంది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ తమ గడ్డపై నుంచే స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగించుకునే విధంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
బ్లాక్ లిస్ట్‌లో ప్రస్తుతం ఉత్తర కొరియా, ఇరాన్ మాత్రమే ఉన్నాయి. వాటి సరసన పాక్ చేరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎఫ్ఏటీఎఫ్ అసంతృప్తి..
నిజానికి ఈ అంశంలో ప్రకటన గతేడాది చివర్లోనే వెలువడాల్సి ఉంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. జూన్‌లో జరగాల్సిన భేటీ మరోసారి తేదీ మార్చుకుని... అక్టోబర్ 21-23 మధ్య వర్చువల్ సమావేశంగా మారింది. అంతకుముందు ఫిబ్రవరిలో.. నాలుగు నెలల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం 14 విషయాల్లోనే కొంతమేర అడుగులు ముందుకు పడ్డాయని, 13 అంశాల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదని పాక్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్ఏటీఎఫ్. ఉగ్రవాద నిర్మూలనకు, వారికి అందుతున్న నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.
ఎఫ్ఏటీఎఫ్ కథేంటి..?
1989లో జీ-7 దేశాల చొరవతో పారిస్ వేదికగా ఎఫ్ఏటీఎఫ్ ఏర్పాటుచేశారు. మనీలాండరింగ్ కట్టడి సహా అందులో భాగస్వాములయ్యే దేశాలు, సంస్థలపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడం ఎఫ్ఏటీఎఫ్ ప్రధాన విధి. ఇందులో భారత్ సహా మొత్తం 39 సభ్యదేశాలు ఉన్నాయి. ఆసియా పసిఫిక్ గ్రూప్ వంటి 9 ప్రాంతీయ సంస్థలు అనుబంధ సభ్యులుగా ఉన్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఇంటర్‌పోల్, ఐడీబీ, ఓఈసీడీ వంటి 23 సంస్థలు 'పరిశీలకులు'గా ఉన్నాయి. ఎఫ్ఏటీఎఫ్ చేసే సిఫార్సులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
ఏం చేస్తుంది..?
అక్రమ నగదు బదిలీ, ఉగ్ర నిధుల ప్రవాహం కట్టడి కోసం మొత్తం 50-లక్ష్యాలు నిర్దేశించింది ఎఫ్ఏటీఎఫ్. ఇందులో 40 'టెక్నికల్ కాంప్లయన్స్ రేటింగ్'కు సంబంధించినవి. మిగిలిన 10 మనీలాండరింగ్, ఉగ్రనిధుల ప్రవాహం నియంత్రణకు ఆ దేశం ఎంత సమర్థంగా కృషిచేస్తుందో తెలిపేవి.
ఈ అంశాల ఆధారంగా పాకిస్థాన్ పనితీరును 2018 అక్టోబర్ వరకు ఆసియా పసిఫిక్ గ్రూప్(ఏపీజీ) మదింపు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఎఫ్ఏటీఎఫ్కు అందించింది. ఈ నివేదిక ఆధారంగా.. కొన్ని సూచనలు చేసి, మరికొన్ని లక్ష్యాలను నిర్దేశించింది.
ఎఫ్ఏటీఎఫ్ 40 ప్రమాణాలలో పాకిస్థాన్ కేవలం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నది ఒక్కదానిలోనే. చర్యలు చేపట్టినవి 9, పాక్షికంగా చర్యలు తీసుకున్నవి 26, అసలు చర్యలు తీసుకోనివి 4 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రెండో విభాగంలోని 10 ప్రమాణాలలో పాకిస్థాన్ తొమ్మిదింటిని విస్మరించింది. ఇదే ఇప్పుడు పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని కలవరపెడుతోంది.
పాక్ భవితవ్యం తేలేది ఈ నెలలోనే పాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చితే...?
పాకిస్థాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్‌లో చేర్చితే మరిన్ని ఆర్థిక ఆంక్షలు అమల్లోకి వచ్చి... దాయాది పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాంటి పరిణామాల్లో కొన్ని...
- అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మదుపర్లు పాకిస్థాన్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు.
- విదేశీ కరెన్సీ లావాదేవీలు, ఇతర దేశాల నుంచి పాక్‌కు వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది.
- స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది.
- విదేశీ నిల్వలు వేగంగా తరిగిపోతాయి.
- దేశీయ కరెన్సీ విలువ తగ్గిపోతుంది.
- ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
- పాకిస్థాన్‌తో వాణిజ్యం సాగించే దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది.
- ఇతర దేశాల నుంచి రుణాలు, ఆర్థిక సహాయాలు వంటివి అగిపోయే ప్రమాదం ఉంది.
- పాక్ అంతర్జాతీయ వాణిజ్యం ఒక్కసారిగా పడిపోతుంది.
భారత్ వైఖరి..
పాకిస్థాన్ ప్రభుత్వం 21మంది ఉగ్రవాదులకు వీఐపీ భద్రతతో ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్ ఇప్పటికే ఉగ్రవాదంపై పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు బయటపెట్టింది. భారత్‌లో దాడులకు తెగబడేందుకు ముష్కర మూకలకు శిక్షణనిస్తూ.. వారికి ఆయుధాలు సరఫరా చేస్తుందని స్పష్టం చేస్తోంది.
అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు.. భారత పౌరులు కొంతమందిని అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించాలని మొరపెట్టుకుంటోంది. మొత్తంగా పాక్‌లో నక్కిన ఉగ్రవాదులు, వారి స్థావరాలు, కార్యకలపాలపై.. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్ఐకు పూర్తి అవగాహన ఉందంటున్నారు విశ్లేషకులు.
తప్పించుకునేందుకు పాక్ తంటాలు మరి పాక్ ఏం చేస్తోంది ?
ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు భారీగా క్షీణించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనడానికి నిదర్శనం. ఈ దశలో పాక్ నిషిద్ధ జాబితాలోకి వెళ్లిపోతే చాలా కష్టమైపోతుంది. అందుకే, అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పే చర్యలకు ఉపక్రమించింది.
ఆర్మీ నివేదికల ప్రకారం గత నెలలో పాకిస్థాన్.. మరో 88మంది ఉగ్రసంస్థలకు చెందిన నేతలు, సభ్యులపై కఠిన ఆంక్షలు విధించామని ఐరాస భద్రతామండలికి నివేదించింది. ఈ తరహా ప్రకటనలతో.. ఎఫ్ఏటీఎఫ్ నిషిద్ధ జాబితా నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతోంది. అందుకే ఆంక్షలు అని చెబుతున్నా.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటకు వెల్లడించడం లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బిల్లులు సైతం ప్రవేశపెడుతోంది.
ఆసియాలో ఉగ్రకార్యకలాపాలను పర్యవేక్షించే ఆసియా-పసిఫిక్ గ్రూప్.. ఏపీజీ సైతం సెప్టెంబర్‌లో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఉగ్రవాద నిర్మూలనకు, నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, చైనా.. పాకిస్థాన్‌కు అండగా నిలబడింది. అయితే... ఎఫ్ఏటీఎఫ్ విషయంలో పాకిస్థాన్‌కు ఈసారి చైనా చేయకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో పాక్ భవితవ్యం తేలనుంది.