కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా చితికిపోతున్న అన్నదాతకు ‘రైతు బంధు’ రూపేణా రెండేళ్ల క్రితం ఆపన్నహస్తం అందించి కర్షకలోకం ప్రశంసలందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- ఇప్పుడు, సేద్యంలో సమూల మార్పుల్ని అభిలషిస్తున్నారు. జాతి ఆహార భద్రత బాధ్యతను భుజాలకెత్తుకున్న రైతుల్ని మరింత చైతన్యపరిస్తే, దేశం గర్వించే రీతిలో సస్యవిప్లవం తథ్యమనీ బంగారు కల కంటున్నారు. సాగుదారులకు సరైన నిర్దేశాలందితే పంటల ఎంపిక, సాగుపద్ధతులు, ఎరువుల వినియోగం, మార్కెటింగ్‌లో గుణాత్మక పరివర్తన కష్టతరమేమీ కాదు. దాన్ని సాకారం చేసే క్రమంలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో వేయాలన్నది మొదలు ప్రతి అంశంలోనూ మార్గదర్శకాల్ని పొదిగే నూతన వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ లక్షిస్తున్నారు. అందులో భాగంగానే దేశ విదేశాల్లో చక్కటి గిరాకీ కలిగిన పంటలేమిటన్నదానిపై విస్తృత అధ్యయనానికీ ఆదేశించారు.
మిగులులో నిలిపేందుకు..
దేశం లోపల వెలుపల సన్నరకాల వినియోగం అధికమవుతున్నప్పుడు, పంటకాలం తక్కువన్న కారణంతో దొడ్డుబియ్యం సాగు చేపట్టడం రైతుకు లాభదాయకం కాదు. వేలంవెర్రిగా ఒకే రకం పైర్లపై ఆధారపడేకన్నా విపణిలో గిరాకీ కలిగిన వేరుశనగ, కందులు, పామోలిన్ తదితర రకాలు పండించడంవైపు రైతుల్ని మళ్ళించాలి. కొన్నాళ్లుగా తృణధాన్యాల వినియోగం పెరుగుతోంది. సంప్రదాయ, వాణిజ్య పంటలతో పోలిస్తే పెద్దగా నష్టభయం లేకుండా సాగుదారుల్ని మిగులులో నిలిపే అటువంటి రకాలపై అవగాహన పెంపొందితే- ఏ రైతూ కోరికోరి కడగండ్ల సేద్యంలో బందీ కాబోడు. ఇది జాతీయస్థాయిలో పకడ్బందీగా కార్యరూపం దాల్చాల్సిన మేలిమి యోచన. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను, రైతాంగాన్ని- సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన, అమలు కసరత్తులో భాగస్వాములు చేసేలా కేసీఆరే చొరవ తీసుకోవాలి!
సమగ్ర ప్రణాళిక అవసరం..
దేశీయంగా నూట పాతికకుపైగా వేర్వేరు వాతావరణ జోన్లు వైవిధ్యభరితమైన సేద్య ప్రయోగాలకు సహజ భూమిక ఏర్పరుస్తున్నాయి. భూసారం లెక్కల్నీ పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో దేశవ్యాప్తంగా వ్యవసాయ కమతాల మ్యాపింగ్ చేపట్టాలి. వాతావరణం ఎక్కడ ఏ పంటకు అనుకూలమో ఇదమిత్థంగా నిర్ధరించి ఆ మేరకు యంత్రాంగం సూచించిన రకాలనే రైతాంగం సాగుచేస్తే- ఆనవాయితీగా మారిన జూదంలాంటి పరిస్థితులు దాదాపుగా కనుమరుగవుతాయి. సర్కారీ ప్రణాళికలో పాలుపంచుకునే రైతులకు తగినన్ని ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడంతోపాటు పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలను కూలంకషంగా మదింపువేసి- ముందుగానే కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోగలిగితే, ఏ దశలోనూ ప్రభుత్వం నష్టపోయే ప్రసక్తే తలెత్తదు. సేద్య అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలకు సైతం పన్ను రాయితీలతో ఊతమిస్తే- గ్రామీణ భారత ముఖచిత్రమే మారిపోతుంది.
ప్రక్షాళన తక్షణావసరం..
పంటల ప్రణాళిక ఎంత ముఖ్యమో, మౌలిక సమస్యల పరిహరణా అంతే కీలకం. గోనె సంచులకు కూలీలకు కొరత మొదలు గోదాములూ శీతల గిడ్డంగుల లేమి వరకు ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవ్యవస్థ- రైతుల్ని గుండెకోతకు గురి చేస్తోంది. పంట రుణాలు, ఎరువులు, పురుగు మందులనుంచి అరకొర మద్దతు దాకా భిన్న పార్శ్వాల్లో ప్రక్షాళన తక్షణావసరం. దళారుల చేతివాటం, విపణి శక్తుల గూడుపుఠాణీ- అంతులేని పీడనతో అసంఖ్యాక రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. మొత్తం ఖర్చులకు యాభై శాతం అదనంగా చేర్చి రైతన్నకు అందించాలన్న స్వామినాథన్ సిఫార్సుకు మన్నన దక్కేలా సమగ్ర సంస్కరణలు పదును తేలాలి. ఏ పంటనూ వృథా కానివ్వని సమర్థ కార్యాచరణే- రైతుకు జీవన భద్రతను, జాతికి సువ్యవస్థిత ఆహార భద్రతను ప్రసాదిస్తుంది!