దేశంలో భారీ స్థాయిలో కార్యకలాపాలు సాగించడం... గణనీయంగా ఆదాయం సంపాదించడం... పన్నుల చెల్లింపు విషయానికొస్తే మా ఆఫీస్ పక్క దేశంలో ఉందని చెప్పడం... ఇదీ అంతర్జాతీయ నిబంధనలను ఆసరాగా చేసుకొని దిగ్గజ సంస్థలు పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న తీరు. వీటికి చెక్ పెట్టేందుకే భారత్ నాలుగేళ్ల క్రితమే 'గూగుల్ ట్యాక్స్'ను ప్రవేశపెట్టింది.
గూగుల్ ట్యాక్స్
సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలపై భారత ప్రభుత్వం విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీ(గూగుల్ ట్యాక్స్)పై మరోసారి చర్చ మొదలైంది. డిజిటల్ కార్యకలాపాలపై పన్ను విధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2016లో ఈ విధానాన్ని ప్రారంభించింది. భారత్ నుంచి విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు వచ్చే ఆదాయంపై పన్ను విధించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ విధానాన్ని గూగుల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు.
సాధారణంగా ఈ దిగ్గజ సంస్థలు తాము కార్యకలాపాలు నిర్వహించిన చోట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో వీటికి విస్తృతమైన నెట్వర్క్, భారీ స్థాయిలో వినియోగదారులు ఉన్నారు. దీంతోపాటు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించి గణనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ నిబంధనల కారణంగా వీరంతా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.
మళ్లీ వివాదం!
ఇటీవల జరిగిన రెండు పరిణామాలు ఈ గూగుల్ ట్యాక్స్ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. అందులో మొదటిది.. డిజిటల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తొమ్మిది దేశాలపై అమెరికా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు ప్రారంభించడం. ఇందులో భారత్ సైతం ఉంది. ఈ దేశాలపై ప్రతీకార చర్యగా అమెరికా సైతం వాణిజ్య చర్యలు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండోది... ఈ-కామర్స్ సంస్థలు ఈక్వలైజేషన్ లెవీని చెల్లించడానికి పన్ను విధానం/చలాన్‌ను(ఐటీఎన్ఎస్285) భారత ప్రభుత్వం ఇటీవల సవరించింది. ఈ రెండు విషయాలు గూగుల్ ట్యాక్స్‌పై తాజా చర్చకు దారితీశాయి.
ఏంటీ గూగుల్ ట్యాక్స్?
భారత్ నుంచి ఆదాయాన్ని పొందుతున్న విదేశీ అంతర్జాల, ఈ-కామర్స్ సంస్థల నుంచి పన్ను వసూలు చేయడానికి భారత ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. 2016 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈక్వలైజేషన్ లెవీ విషయాన్ని తొలిసారి ప్రస్తావించారు. ఈ పన్ను ఏడాదిలో లక్ష రూపాయలకు మించిన వ్యాపార లావాదేవీలకే(బిజినెస్ టు బిజినెస్) వర్తిస్తుందని స్పష్టం చేశారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రకారం 2016 జూన్ 1 నుంచి 6 శాతం పన్ను విధించింది భారత ప్రభుత్వం.
జీఎస్టీ లేదా ఇతర సేవా పన్నులు ఉన్న సమయంలో... సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారుడి నుంచి పూర్తి బిల్లు వసూలు చేసేవి. అందులో నుంచి పన్ను రూపంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించేవి. కానీ ఈక్వలైజేషన్ లెవీలో భాగంగా ప్రభుత్వం రివర్స్ ఛార్జ్ మెకానిజం ద్వారా ఈ సంస్థల నుంచి పన్ను వసూళ్లు చేపడుతోంది. అంటే... భారత్‌లోని సంస్థ ఇతర దేశాల నుంచి అడ్వర్టైజ్మెంట్లు పొందితే.. సదరు విదేశీ సంస్థ నుంచి వసూలు చేసిన బిల్లుపై ఆరు శాతం అదనపు మొత్తాన్ని కలపాల్సి ఉంటుంది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను తప్పించుకోవడమే
సాధారణంగా ఈ దిగ్గజ కంపెనీలు భారత్ వెలుపల నుంచే బిల్లును వసూలు చేసుకుంటాయి. పన్ను తక్కువ ఉండే ఐర్లాండ్ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తుంటాయి. తద్వారా భారత్‌లో పన్ను పరిధిలోకి రాకుండా చూసుకుంటాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సంస్థ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న చోటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని ఉపయోగించుకొని చాలా దేశాల్లో పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నాయి.
గూగుల్ ట్యాక్స్ వివాదం