తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చేతుల్లోనే ఆరోగ్యం.. పరిశుభ్రతే దివ్య ఔషధం - పరిశుభ్రత కొవిడ్​

షిగెలోసిస్‌, సార్స్‌, హెపటైటిస్‌-ఇ వంటి వాటిని నివారించడంలో చేతుల పరిశుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. చేతుల శుభ్రత అతిసారాన్ని 30శాతం, శ్వాసకోశ వ్యాధులను 20శాతం తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోవడం- అల్ప, మధ్య ఆదాయ దేశాల అభివృద్ధికి విఘాతంగా నిలుస్తోందంటున్నారు నిపుణులు.

cleanliness
మీ చేతుల్లోనే ఆరోగ్యం.. పరిశుభ్రతే దివ్య ఔషధం

By

Published : Oct 14, 2021, 6:30 AM IST

మనిషి దైనందిన జీవితంలో చేతుల పరిశుభ్రత చాలా ప్రధానం. దీని పట్ల నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారుతోంది. మురికిగా ఉన్న చేతుల్లో దాదాపు 150 రకాల రోగకారక క్రిములు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అందుకే సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అతిసారం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దేశంలో ఏటా అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాల్లో 13-14శాతానికి అతిసారమే కారణం. పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పిస్తే దేశంలో మూడింట ఒక వంతు పిల్లలను అతిసారం, శ్వాసకోశ వ్యాధుల బారి నుంచి కాపాడవచ్చు. చేతుల పరిశుభ్రత అతిసారాన్ని 30శాతం, శ్వాసకోశ వ్యాధులను 20శాతం తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. షిగెలోసిస్‌, సార్స్‌, హెపటైటిస్‌-ఇ వంటి వాటిని నివారించడంలో చేతుల పరిశుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్నందువల్లే యునిసెఫ్‌ ఏటా అక్టోబర్‌ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'మన భవిష్యత్తు చేతిలోనే ఉంది... కలిసికట్టుగా ముందుకు సాగుదాం' అన్న నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దేశంలో కొవిడ్‌ మహమ్మారి పంజా విప్పిన సమయంలో 61శాతమే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తరవాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకున్నట్లు వాటర్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యయనం వెల్లడించింది. 34శాతమే తుమ్ము, దగ్గు తరవాత చేతులు కడుక్కున్నట్లు పేర్కొంది. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా భూతాన్ని 36శాతం మేర నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు, మలవిసర్జన తరవాత చేతులను సబ్బుతో కడుక్కుంటే అతిసారం, న్యూమోనియా, ఇన్‌ఫ్లూయెంజా, ఎబోలా వంటి వ్యాధులకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చు. చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం- అల్ప, మధ్య ఆదాయ దేశాల అభివృద్ధికి విఘాతంగా నిలుస్తోంది. 76వ జాతీయ నమూనా సర్వే ప్రకారం 36శాతం భారతీయులే భోజనానికి ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. అందులో 25శాతం గ్రామీణులు, 56శాతం పట్టణ ప్రాంతవాసులు. మలవిసర్జన తరవాత దేశంలో 74శాతమే సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారు. అందులో గ్రామీణులు 67శాతం, పట్టణాల్లో నివసించేవారు 88శాతం. జాతీయ వార్షిక గ్రామీణ పారిశుద్ధ్య సర్వే 2018-19 ప్రకారం దేశంలో 40శాతం పాఠశాలలు, 42శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చేతుల పరిశుభ్రతకు నీరు, సబ్బు వసతి ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య భవనాల ప్రవేశ ద్వారం దగ్గర, అన్ని ప్రధాన రవాణా కేంద్రాల్లో, మార్కెట్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పాఠశాలల వద్ద చేతుల పరిశుభ్రతకు తగిన సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంటింటికీ తగినంత తాగునీరు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. గ్రామీణుల్లో చేతుల పరిశుభ్రత అలవాటును పెంపొందించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ, మానవ వనరులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల మధ్య సమన్వయం అవసరం.

గ్రామాల్లోని యువజన, మహిళా సంఘాలు, విద్యా కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలను సమావేశపరచి చేతుల పరిశుభ్రత ప్రాధాన్యాన్ని అందరికీ వివరించేలా చూడాలి. పిల్లలు, యుక్తవయసు అమ్మాయిలు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని జాగృతపరచవలసిన అవసరం ఉంది. రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై మహిళలకు సంపూర్ణ అవగాహన కల్పించాలి. విద్యార్థుల్లో చేతుల పరిశుభ్రతను పెంపొందించేలా విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహించడమూ అవసరం. పాఠశాలల్లో వారానికి ఒకసారి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామస్థాయి ఉద్యోగులను సైతం అందులో భాగస్వాములను చేయాలి. చేతుల పరిశుభ్రత ప్రాధాన్యంపై తీసిన లఘు చిత్రాలు, వీడియోలు, రూపొందించిన సందేశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేయాలి. గ్రామాల్లో మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. గ్రామ పంచాయతీల్లోని స్థానిక నాయకత్వం చురుకైన భాగస్వామ్యంతో కనీసం నెలకోసారి చేతుల పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. చేతుల పరిశుభ్రత అందరి జీవన విధానంలో భాగమైతే సాంక్రామిక వ్యాధులకు చాలావరకు అడ్డుకట్ట పడుతుంది.

- ఎ.శ్యామ్‌ కుమార్‌

ఇదీ చూడండి :దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్​ సంక్షోభం

ABOUT THE AUTHOR

...view details