మనిషిని జూదం ఎంతటి పతనావస్థకు దిగజార్చగలదో, ఎన్ని కడగండ్లపాలు చేయగలదో, అయినవారికీ ఏ స్థాయిలో వినాశం తెచ్చిపెట్టగలదో... మహాభారత గాథ సోదాహరణంగా తెలియజెబుతూనే ఉంది. అయినా ఇప్పటికీ ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తాలన్న దురాశను అధిగమించలేని మానవ బలహీనత దేశంలో పలుచోట్ల బెట్టింగ్ దందాకు గట్టి పెట్టుబడిగా వర్ధిల్లుతోంది. అలా పందాలు కాయడాన్ని చట్టబద్ధం చేయాలన్న వాదనలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకుర్ తాజాగా వత్తాసు పలకడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన ప్రస్తుత హోదా కంటే ముందు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడిగానూ చక్రం తిప్పిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది.
గళం మారిపోయింది..
ఏడేళ్లక్రితం ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతం అసంఖ్యాక క్రికెట్ అభిమానులతోపాటు ఆయననూ నొప్పించింది. నాలుగేళ్లనాడు భాజపా ఎంపీ హోదాలో- క్రికెట్ పాలిట వేరుపురుగులా దాపురించిన ఫిక్సింగ్ జాడ్యాన్ని అరికట్టేందుకంటూ ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమే అందుకు రుజువు. అప్పట్లో అనురాగ్ ఠాకుర్ ఆ బిల్లు తేవడానికి సహేతుక కారణాలే ఉన్నాయి. ఫిక్సింగ్ నిందితులు మోసానికి వంచనకు పాల్పడ్డారనో వారిలో నిజాయతీ లోపించిందనో ఐపీసీ (భారతీయ శిక్షా స్మృతి) కిందనో, అవినీతి నిరోధక చట్టం ప్రకారమో ఆరోపణలు నమోదయ్యేవి. ఆయా చట్ట నిబంధనలు క్రీడలకు వర్తించని కారణంగా, నిందారోపణలకు గురైనవారు తేలిగ్గా బయటపడటం పరిపాటిగా మారింది. అలా సందివ్వకుండా, అనైతిక చర్యలకు ఒడిగట్టిన వాళ్లపై జీవితకాల నిషేధాన్ని, పదేళ్ల జైలుశిక్ష విధింపును తన ప్రైవేటు బిల్లులో ఠాకుర్ ప్రతిపాదించడం ఆనాటి ముచ్చట. ఇప్పుడాయన గళం మారిపోయింది. దేశంలో బెట్టింగ్‌ను చట్టబద్ధం గావించాలన్న విడ్డూరవాదనలు వినిపించే వర్గాలకిప్పుడు అమాత్యవర్యులు 'అధికార ప్రతినిధి'లా గోచరిస్తున్నారు!
అక్కడ అవినీతి రూపుమాసిపోలేదు..
స్వీయ సరికొత్త బాణీకి సమర్థనగా- ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్రభృత దేశాల్లో బెట్టింగ్ చట్టబద్ధమని, మ్యాచ్ ఫిక్సింగ్ తరహా అవలక్షణాల కట్టడికి అది పటుతర సాధనం కాగలదని అనురాగ్ ఠాకుర్ సెలవిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ను చట్టబద్ధీకరించిన దేశాల్లో అవినీతి రూపుమాసి పోనేలేదన్న విశ్లేషణలు సచివుల చెవిన పడ్డాయో లేదో మరి! బెట్టింగ్ కట్టడికి దేశంలో కట్టుదిట్టమైన చట్టం కొరవడిందని లోగడ సర్వోన్నత న్యాయస్థానమే తప్పుపట్టింది. ఆపై జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులతో వివాదాల తేనెతుట్టెను కదిపినట్లయింది.
విధాన నిర్ణయం వెలువడకముందే..
చాటుమాటుగా వేలకోట్ల రూపాయల మేర జరుగుతున్న బెట్టింగ్‌ను చట్టబద్ధం చేసేయాలన్న సూచన అమలు సాధ్యాసాధ్యాలపై న్యాయ సంఘం (లా కమిషన్) పరిశీలనను సుప్రీంకోర్టు కోరింది. చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సాగకుండా నిషేధం విధించాలని, లేదంటే లైసెన్సులు పొందినవారి పర్యవేక్షణలోనే అనుమతించాలన్న కమిషన్ నివేదికను ఇప్పుడు కేంద్ర క్రీడలూ యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, క్రీడా విభాగం లోతుగా అధ్యయనం చేస్తున్నాయంటున్నారు. విధాన నిర్ణయం వెలువడకముందే అమాత్యుల అభీష్టమేమిటో బహిర్గతమై కలకలం రేగుతోంది. చూడబోతే- ఆటగాళ్లను, అధికారుల్ని మినహాయించి సామాన్య ప్రజానీకానికి వెబ్‌సైట్ల ద్వారా పందాలు కాసే అవకాశం కల్పిస్తే క్రికెట్లో అనైతికత మటుమాయమవుతుందన్న మునుపటి కమిటీల స్పందనే మంత్రి సత్తములకు ముద్దొచ్చినట్లు ప్రస్ఫుటమవుతోంది!
జూదం వల్ల నష్టపోయినవారెందరో..