తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొవిడ్‌పై సాగాలి సమష్టి పోరు

భారత్​లో కరోనా పరిస్థితులు దారుణంగా మారాయి. ఇందుకు సాక్ష్యంగా రోజు ఆక్సిజన్​ లేక ఎంతో మంది చనిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే కచ్చితంగా లాక్​డౌన్​ విధించి తీరాలి అని అమెరికన్ వైద్యుడు ఆంథొని ఫౌచీ సూచించారు. కానీ కేంద్రం మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి అందరం సమష్టిగా పోరాడాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చేయి చేయి కలిపి మహమ్మారిని అంతం చేయాలని అంటున్నారు.

corona
కొవిడ్‌పై సాగాలి సమష్టి పోరు

By

Published : May 12, 2021, 9:13 AM IST

గంగానదిలో కొట్టుకొస్తున్న శవాలు, విఖ్యాత ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ అందక అభాగ్యుల మరణాలు- కొవిడ్‌ సృష్టిస్తున్న ఘోరకలికి ఆనవాళ్లు. తక్షణం జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించి, టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టినప్పుడే ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ఇండియా బయటపడగలుగుతుందని అమెరికన్‌ వైద్య శిఖామణి ఆంథొనీ పౌచీ సూచిస్తున్నారు. ఏ రాష్ట్రానికారాష్ట్రం కర్ఫ్యూలు, లాక్‌డౌన్లతో కుస్తీలు పడుతున్నా మహమ్మారి అదుపులోకొస్తున్న జాడలేదు. డబ్బులేనివాడు ముందు పడవెక్కిన చందంగా- టీకాల అందుబాటుపై స్పష్టత లేకుండానే 18-45 ఏళ్ల మధ్య వయస్కులందరికీ టీకాలు వేస్తామని కేంద్రం ప్రకటించేయడంతో, క్రమపద్ధతిలో సాగాల్సిన ప్రాణాధార కార్యక్రమం దైవాధీనం సర్వీసులా మారిపోయింది. ఇప్పటి మాదిరి నత్తనడకన సాగితే దేశ ప్రజలందరికీ టీకాలు వెయ్యడానికి మూడేళ్లు పడుతుందన్న అంచనాలు, ఆ లోగా వ్యాక్సిన్లను తట్టుకొనే కొత్త ఉత్పరివర్తనాలు వెల్లువెత్తే అవకాశంపై అధ్యయనాలు భీతిల్లజేస్తున్నాయి.

అమెరికా ముందుచూపు..

అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్‌ ఎంత తింగరిగా వ్యవహరించినా వ్యాక్సిన్ల పరిశోధన, ఉత్పత్తి, సేకరణ నిమిత్తం నిరుడే రెండు వేల కోట్ల డాలర్లు కేటాయించడం వల్ల అగ్రరాజ్యం నేడు ధీమాగా ఉండగలుగుతోంది. ప్రస్తుత బడ్జెట్‌లో టీకాల కార్యక్రమానికి రూ.35 వేల కోట్లు కేటాయించి, అందులో ఇప్పటికి 14 శాతం లోపే వ్యయీకరించి, 'సమాఖ్య స్ఫూర్తి' పేరిట సగం వ్యాక్సిన్ల కొనుగోలు భారాన్ని రాష్ట్రాలపై మోపిన కేంద్రం.. నేడు మూడుశాతం లోపు జనావళికే రెండో డోసు టీకాను అందించగలిగింది. మెజారిటీ దేశాలు సార్వత్రిక ఉచిత టీకా కార్యక్రమం అమలు చేస్తుంటే అందుకు భిన్నంగా ప్రైవేటు వ్యాక్సిన్లను ఒక్కో డోసు రూ.700 - 1500 ధరతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మార్చేసింది. టీకా విధానం ఇంత అసంబద్ధంగా ఉన్నా 'సుప్రీం' జోక్యానికి ఆస్కారమే లేదనడం- అహేతుకం!

కొత్త ఉత్పరివర్తనాలతో ప్రమాదం..

అవసరానికి తగ్గట్లు అత్యావశ్యక ఔషధాల ఉత్పత్తిని పెంచేందుకు పేటెంట్స్‌ చట్టంలోని 92, 100 లేదా 102 సెక్షన్ల కింద కేంద్రం తన అధికారాల వినియోగాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 30న సూచించింది. పేటెంట్స్‌ చట్టం, ట్రిప్స్‌ ఒప్పందం, దోహా ప్రకటనల కింద అధికారం ఉందికదా అని ముందడుగేస్తే ఎదురు తన్నే అవకాశం ఉందంటూ.. దౌత్యమార్గంలో పరిష్కారాన్ని అన్వేషిస్తున్నామని కేంద్రం 'సుప్రీం'కు తాజాగా నివేదించింది. విశేషం ఏమిటంటే.. పేటెంట్లను పక్కనపెట్టాలంటూ నిరుడు అక్టోబరులోనే దక్షిణాఫ్రికాతో కలిసి ప్రతిపాదించింది ఇండియాయే! 'అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికే ఆ నిబంధనలున్నప్పుడు- ఇప్పుడు కాకుంటే మరెప్పుడు?' అని ప్రశ్నించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ- ఇండియాలోని కొవిడ్‌ ఉత్పరివర్తనం ప్రపంచానికే ప్రమాదకారిగా మారుతోందని తాజాగా హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్న వేళ పేటెంట్ల మినహాయింపు ప్రతిపాదనకు అమెరికా సైతం ఓటేస్తున్నా- సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అదొక్కటే సరిపోదన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.

సంక్షోభానికి తెరపడేదెప్పుడు..

వ్యాక్సిన్లకు నెలకొన్న భారీ గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పుంజుకోవాలంటే- భాగస్వామ్యాలు, సాంకేతికత బదిలీ, కీలక యంత్రాలు, ముడిపదార్థాలు, నిపుణ మానవ వనరులు అందుబాటులోకి రావాలి. మేధాసంబంధ ఆస్తిహక్కుల్ని సడలించినంత మాత్రాన- ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత లేకుండా మోడెర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్లను ఇండియా ఉత్పత్తి చేయలేదన్నది నిజం. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ టీకాలు, ఔషధాలు సత్వరం మెజారిటీ ప్రజానీకానికి చేరువ అయ్యేలా పదునైన వ్యూహాల్ని రూపొందించడంతోపాటు, అవసరాన్ని మించి నిల్వ చేసిన వ్యాక్సిన్ల పంపిణీకి పెద్ద దేశాలు కూడి రావడం నేటి అవసరం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న ధోరణి విడనాడి రాష్ట్రాల అభిప్రాయాల్ని కేంద్రం మన్నించినప్పుడే పెను సంక్షోభం నుంచి సత్వరం తెరిపిన పడగలం!

ఇదీ చూడండి:'టీకాలే ఆ వేరియంట్​ను సమర్థంగా ఎదుర్కొంటాయి'

ABOUT THE AUTHOR

...view details