తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఉపాధి కల్పనే మాంద్యానికి మందు - ఆర్థిక మాంద్యం

ఉరుములేని పిడుగులా మానవాళిపై కరోనా వైరస్‌ విజృంభణ దరిమిలా దేశీయంగా ఉపాధి రంగం పెద్ద కుదుపునకు లోనయింది. అసంఖ్యాక వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. కోట్లమంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. ఏదో ఒక రూపేణా కొవిడ్‌ సంక్షోభం తాలూకు కష్టనష్టాలకు గురైన అపార జనావళి తేరుకుని సాధారణ స్థితికి చేరాలంటే- వారి చేతిలో కాసులు గలగలలాడాలి. ఉపాధి కల్పనే అజెండాగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చురుగ్గా ఖర్చు చేస్తే, ఎన్నో క్లిష్ట సమస్యలకది ఉమ్మడి పరిష్కారమవుతుంది.

recession
ఉపాధి కల్పనే మాంద్యానికి మందు

By

Published : Dec 1, 2020, 8:53 AM IST

ఈ సంవత్సరం వరసగా రెండో త్రైమాసికంలోనూ వృద్ధిరేటు కుంగుదల, దేశం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నట్లు సాంకేతికంగా నిర్ధారిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి కోరసాచిన నేపథ్యంలో 2020 ఏప్రిల్‌-జూన్‌ నడుమ (తొలి త్రైమాసికంలో) నమోదైన వృద్ధిరేటు క్షీణత ఎకాయెకి 23.9 శాతం. దానితో పోలిస్తే- లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులు, పండుగల సందర్భంగా కొనుగోళ్ల మూలాన పరిస్థితి కొంత మెరుగుపడినట్లనిపించింది. అందుకు తగ్గట్లే వృద్ధిరేటులో తగ్గుదల 9.8శాతానికి పరిమితం కానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ మదింపు వేసింది. యథార్థానికి, అది 7.5 శాతం వద్ద నిలవడం గుడ్డిలో మెల్ల.

దీటైన కార్యాచరణే అసలైన ఉద్దీపన..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చిలీ, యూకే, కొలంబియా, స్పెయిన్‌, మెక్సికోలకన్నా ఇండియా మెరుగ్గా రాణించిందన్నది నాణేనికి ఒక పార్శ్వమే. విశ్వవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, ఇజ్రాయెల్‌, స్వీడన్‌, జర్మనీ, జపాన్‌ సహా 26 దేశాలు భారత్‌ కన్నా వేగిరం కోలుకుంటున్న తరుణంలో మన వ్యూహాల్ని సత్వరం సమీక్షించుకోవాల్సిందే. ఆత్మనిర్భరతను నినదిస్తూ కేంద్రం వెలువరించిన వివిధ ప్యాకేజీల అంతస్సారం- సరఫరా పరంగా ప్రతిబంధకాలను, ఇక్కట్లను తొలగిస్తే ప్రైవేటు పెట్టుబడులు జోరెత్తి పరిస్థితి కుదుటపడుతుందని. నాయకగణం ఎవరేం చెప్పినా, రెండో త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయీకరణ తగ్గిందన్నది చేదునిజం. గిరాకీ తగినంతగా పుంజుకొంటేనే వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందన్న ఆర్థిక నిపుణుల సూచనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెవొగ్గాలి. అందుకు దీటైన కార్యాచరణే- కొవిడ్‌ ధాటికి కదలబారిన దేశార్థికానికి అసలైన ఉద్దీపన కాగలిగేది!

ఉపాధి కల్పనే అజెండాగా..

దేశంలో ఆర్థికమాంద్యం లక్షణాలు తొంగిచూస్తున్నాయని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక గత సంవత్సరం జులైలోనే హెచ్చరించింది. ఉరుములేని పిడుగులా మానవాళిపై కరోనా వైరస్‌ విజృంభణ దరిమిలా దేశీయంగా ఉపాధి రంగం ఒక్కుదుటున పెద్ద కుదుపునకు లోనయింది. అసంఖ్యాక వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. కొన్ని కోట్లమంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. ఏదో ఒక రూపేణా కొవిడ్‌ సంక్షోభం తాలూకు కష్టనష్టాలకు గురైన అపార జనావళి తేరుకుని సాధారణ స్థితికి చేరాలంటే- వారి చేతిలో కాసులు గలగలలాడాలి. ఉపాధి కల్పనే అజెండాగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చురుగ్గా ఖర్చు చేస్తే, ఎన్నో క్లిష్ట సమస్యలకది ఉమ్మడి పరిష్కారమవుతుంది.

మాంద్యం పీడకు అదే సరైన మందు

దేశంలో ఏకంగా 210 జాతీయ రహదారి ప్రాజెక్టులు నత్తలకే నడకలు నేర్పుతున్న దురవస్థ నెలకొందని మొన్నీమధ్య కేంద్రమంత్రి గడ్కరీ వాపోయారు. 18 రాష్ట్రాల్లో విద్యుత్‌, ఇంధన, పట్టణాభివృద్ధి, రహదారి, రైల్వేలు తదితర మౌలిక ప్రాజెక్టుల నిమిత్తం సుమారు రూ.100లక్షలకోట్ల భూరి ప్రణాళికను ఈ ఏడాది మొదట్లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. వాటి అమలును ఉరకలెత్తించడం తక్షణావసరం. గ్రామీణ పరిశ్రమలు, ముఖ్యంగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థ)లు, స్వయం సహాయక బృందాలకు స్వల్ప వడ్డీరేటుపై ఉదారంగా రుణాలందించి- ఉపాధి కల్పనకు విశేష ప్రాధాన్యమివ్వాలి. దేశవ్యాప్తంగా 7.38లక్షల యూనిట్లు అమ్ముడుపోకుండా పేరుకుపోయి కుంగుతున్న స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా స్టాంప్‌డ్యూటీ తగ్గించాలని తాజాగా కేంద్రం రాష్ట్రాలకు పిలుపిచ్చింది. భిన్నాంశాల్ని పరిగణించి బహుముఖ సంస్కరణల్ని ఉపాధి అవకాశాల పెంపుదలతో ముడిపెడితే, ప్రజల ఖర్చుచేసే సామర్థ్యం ఇనుమడించి గిరాకీ ఊపందుకుంటుంది. మాంద్యం పీడకు అదే సరైన విరుగుడు అవుతుంది!

ఇదీ చూడండి: కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు ముప్పు

ABOUT THE AUTHOR

...view details