తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చకచకా అందరికీ అందాలి కరోనా టీకా! - కొవిడ్​ టీకా

ప్రపంచ దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారికి టీకా రావడం వల్ల.. ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే.. అమెరికా, ఐరోపాల్లో మళ్లీ మరణ మృదంగం మోగిస్తోంగి కొవిడ్​. దీనిపై ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించినా పెను ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తోంది. కాబట్టి.. భారత్​లో గతనెల ప్రారంభమైన వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా సాగించాలి. పెద్ద సంఖ్యలో జనం టీకాలకు సిద్ధపడేలా వ్యాక్సిన్‌ విముఖతను దూరం చేస్తే- కొవిడ్‌పై జాతి విజయానికి కీలకం కాగలుగుతుంది!

India Vaccination
చకచకా అందరికీ టీకా!

By

Published : Feb 8, 2021, 6:28 AM IST

సామూహిక జనహననానికి కారణమయ్యే మహమ్మారి రోగాల మూలాల్ని పసిగట్టడానికి 114 దేశాల్లో 153 సంస్థల్ని నిర్వహిస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ- ఎబోలా, జికా, నిపా, మెర్స్‌, సార్స్‌ వరసలో మరో భయానక పాథొజెన్‌ ఏదో పొంచి ఉందని 2019లోనే హెచ్చరించింది. ఆ జోస్యాన్ని నిజం చేస్తూ విరుచుకుపడిన కొవిడ్‌-19 గత ఏడాదంతా ప్రపంచ సామాజిక ఆర్థిక రంగాల్ని అతలాకుతలం చేసి ఇప్పటిదాకా 23 లక్షల 22 వేల మంది అభాగ్యుల్ని కబళించింది. ఇండియాలోనూ కోటీ ఎనిమిది లక్షల మందికి సోకి, లక్షా 55వేల మంది ఉసురు తీసిన కరోనా మహమ్మారి- ఇప్పుడిప్పుడే కాస్తంత నెమ్మదిస్తోంది. తొమ్మిది నెలల కాలావధిలో అత్యల్పంగా నమోదవుతున్న మరణాలు కొద్దిపాటి ఊరట కలిగించేవే అయినా- అమెరికా, ఐరోపాల్లో మళ్ళీ కొవిడ్‌ మోగిస్తున్న మరణ మృదంగం ఏ మాత్రం ఉదాసీనత అయినా పెను ప్రమాదహేతువేనని హెచ్చరిస్తోంది. కాబట్టే, జనవరి 16న శ్రీకారం చుట్టిన టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా సాగించగల వీలుందంటూ కేంద్రం రాష్ట్రాలన్నింటికీ 'పారాహుషార్‌' పలుకుతోంది.

56 లక్షల మందికి..

మొట్టమొదటిగా ఆరోగ్య కార్యకర్తలు, కొవిడ్‌పై ముందు వరస పోరాట యోధులకే టీకా కార్యక్రమాన్ని పరిమితం చేసిన కేంద్రం- 22 రోజుల వ్యవధిలో 56 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించగలిగింది. ఆరోగ్య కార్యకర్తల్లో 55శాతం టీకాలు వేయించుకొన్నా- పోలీసులు, పారిశుద్ధ్య శ్రామికుల్లో వ్యాక్సిన్‌ తీసుకొన్నవారు 4.5 శాతమే! ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న పది పెను సవాళ్లలో వ్యాక్సిన్లపట్ల వైముఖ్యం లేదా సంకోచం ఒకటని డబ్ల్యూహెచ్‌ఓ మొత్తుకోవడం తెలిసిందే! ప్రతి ఒక్కరూ సురక్షితం కానిదే ఏ ఒక్కరూ ధీమాగా ఉండే వీల్లేదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో- వ్యాక్సిన్లపట్ల సంకోచాల్ని పటాపంచలు చేసేలా కేంద్ర సర్కారు కార్యాచరణ పదునుతేలాలి.

మరో 7 వ్యాక్సిన్​లు..

ప్రస్తుతం వినియోగిస్తున్నవి కాక దేశీయంగా మరో ఏడు వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయంటున్న కేంద్ర ప్రభుత్వం- వచ్చే నెలనుంచి 50 ఏళ్ల పైబడ్డవారికి టీకా కార్యక్రమం ప్రారంభించబోతోంది. టీకాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.35వేల కోట్లు విత్తమంత్రి ప్రత్యేకించగా, ఆ నిధులతో 50 కోట్లమందికి వ్యాక్సిన్లు అందించగల వీలుందని కేంద్ర కార్యదర్శి చెబుతున్నారు. ఇప్పటికే 17 దేశాలకు 56 లక్షల డోసుల టీకాల్ని అందించి ఔదార్యం చాటుకొన్న భారతావని- వ్యాక్సిన్ల తయారీలో స్వయం సమృద్ధి సాధించిన భాగ్యశాలి. 138 కోట్ల జనరాశికి ఒక్క విడతలోనే టీకాలందించడం అసాధ్యం కాబట్టే ప్రాధాన్య ప్రాతిపదికన అంచెలవారీగా వ్యాక్సిన్లు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. టీకాపట్ల సంకోచం తొలి విడత లబ్ధిదారుల్నే వెనక్కి లాగుతున్న తరుణంలో- తయారీదారుల చెంత ప్రాణాధార వ్యాక్సిన్లు భారీగా పోగుపడి, వాటికోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూసే కోట్ల మందికి అవి అందుబాటులోకి రాని వైపరీత్యం పొడగడుతోంది.

అందరికీ అందుబాటులో ఉండేలా..

వ్యాక్సిన్ల ఉత్పత్తిని పూర్తిస్థాయి సామర్థ్యంతో సాగేలా ప్రోత్సహించి, ప్రైవేటు ఆసుపత్రుల్నీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాముల్ని చేసి, టీకా కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేసేలా కేంద్ర సర్కారు పూనిక వహించాలి. కొవిడ్‌ టీకాలు ప్రతి పౌరుడికీ అందుబాటులోకి రావాల్సిందే. సర్కారీ వ్యాక్సినేషన్‌లో 85శాతం వాటా 12 రాష్ట్రాలదేనంటే, తక్కిన వాటి పరిస్థితి ఎందుకంత అధ్వానంగా ఉందో ఆరా తీయాల్సిందే! ప్రాణాధార వ్యాక్సిన్లు నల్లబజారుకు తరలిపోకుండా పటిష్ఠ విధి నిషేధాలతో మార్గదర్శకాల్ని రూపొందించి, జీపీఎస్‌ సాంకేతికతతో టీకాల రవాణాను పర్యవేక్షించి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కేంద్రం, రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన కదలాలి. వ్యాక్సిన్‌ సంకోచాల్ని చెదరగొట్టడానికి తీరైన ప్రచారం చేపట్టడం ఒక పద్ధతి. పెద్ద సంఖ్యలో జనం టీకాలకు సిద్ధపడటమే వ్యాక్సిన్‌ విముఖతను దూరం చేసి- కొవిడ్‌పై జాతి విజయానికి కీలకం కాగలుగుతుంది!

ఇదీ చదవండి: కరోనా టీకా పంపిణీలో భారత్​ మరో ఘనత

ABOUT THE AUTHOR

...view details