Election Results Today Congress Situation : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కలిసి అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. బీజేపీ దెబ్బకు రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మరో రాష్ట్రంలోనూ విజయతీరాలకు చేరలేకపోయింది. ఫలితంగా మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో అధికారం పీఠం దక్కించుకున్నప్పటికీ ఉత్తరాదిలో పట్టు కోల్పోయినట్లైంది.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, ప్రచారాలు నిర్వహించినా.. గ్యారెంటీల పేరుతో హామీలు కురిపించినా అనుకున్నది సాధించలేకపోయింది. రాజస్థాన్‌లో మార్పు సంప్రదాయం పునరావృతం కాగా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో కమలం పార్టీ మరోసారి గెలిచింది. అయితే స్వీయ తప్పిదాలే కాంగ్రెస్‌కు షాక్ తగిలేలా చేశాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? భవిష్యత్తులో హస్తం పార్టీకి కష్టమేనా?
- రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నేతల్లో కుమ్ములాటలే ప్రధాన కారణం. సీఎం అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కలహాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వీరి మధ్య ఉన్న విబేధాలను తొలగించేందుకు అధిష్ఠానం ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
- పరీక్షా ప్రతాల లీకులు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓడిపోయేలా చేశాయి. నాలుగేళ్లలో 18 సార్లు పేపర్లు లీక్‌లు కావడం వల్ల యువతలో భారీ వ్యతిరేకత కనిపించింది. రెడ్ డైరీ వ్యవహారం కూడా కాంగ్రెస్‌ను దెబ్బతీసింది.
- రాష్ట్ర ప్రజలకు హామీలు కురిపించినా వాటిని ప్రచారం చేసుకోలేకపోయారు కాంగ్రెస్ నేతలు. వంట గ్యాస్‌పై సబ్సిడీ వంటి స్కీమ్‌లతో ప్రభుత్వ వ్యతిరేకతను గహ్లోత్ తగ్గించుకునే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.
- ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అనూహ్యంగా అధికార పీఠం కోల్పోయింది. అయితే ఎన్నికలకు 10 రోజుల ముందు వెలుగులోకి వచ్చినా మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం హస్తం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది!
- 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని బీజేపీ విస్త్రత ప్రచారం చేసింది. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని బఘేల్ ప్రభుత్వాన్ని మరిచిందని విమర్శలు గుప్పిస్తూ బీజేపీ సానుకూలత మూటగట్టింది. ఇది కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమే.
- మధ్యప్రదేశ్‌లో హిందూ ఓట్లను సమీకరించేందుకు తన వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అనుసరించిన సాఫ్ట్ హిందుత్వ వైఖరి బెడిసికొట్టింది. హిందుత్వ కార్డును బీజేపీ పక్కాగా ప్రయోగించింది. ఎన్నికలకు నెలల ముందు నుంచే హిందూ ఆలయాల అభివృద్ధిపై శివరాజ్ సర్కారు దృష్టిసారించింది.
- రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. మరోవైపు శివరాజ్‌కు ఉన్నంత కరిష్మా ఏ కాంగ్రెస్ నాయకుడికి లేకపోవడం పార్టీకి ఎదురుదెబ్బే!
- పైవన్నీ రాష్ట్రాల వారీగా కారణాలు అయినప్పటికీ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచార పర్వంలో వెనకపడిందని చెప్పొచ్చు. కమల దళ అగ్రనేతలంతా ఆయా రాష్ట్రాల్లో భారీగా ప్రచార సభలు, ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్ నుంచి పలువురు మాత్రమే రంగంలోకి దిగారు.
- కర్ణాటకలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అదనంగా జోడించి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు కురిపించినా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. వివిధ కారణాలతో బీజేపీకే అధికార పీఠాలను అప్పజెప్పారు ఓటర్లు. కులగణన పక్కాగా చేపడతామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు ఆదరించలేదు.