తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మౌలిక అజెండాతోనే శీఘ్ర ప్రగతి సాధ్యం - నిపుణ మానవ వనరుల గనిగా భారత్​

మూడు దశాబ్దాల నాడు ప్రపంచీకరణ గవాక్షాలు తెరిచినా, మౌలిక సదుపాయాల పరంగా భారత్‌ను మందభాగ్యం ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. ఏమాత్రం జవాబుదారీతనం లేని అవినీతి అసమర్థ యంత్రాంగమే అందుకు ప్రబలహేతువని కేంద్ర మంత్రులే ఈసడించడం సమస్య మూలాల్ని పట్టిస్తోంది. 2025నాటికి భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరింపజేసే క్రమంలో ఇలాంటి అడ్డంకులను తొలగించేందుకు పదునైన వ్యూహాలు అవసరం.

eenadu editorial
శీఘ్రప్రగతికి మౌలిక అజెండా

By

Published : Jan 22, 2021, 7:18 AM IST

ఒప్పందాల అమలు వేగాన్ని కుంగదీస్తూ మౌలికరంగ ప్రగతికి, జాతి ప్రతిష్ఠకు తూట్లు పొడుస్తున్న వివాదాల సత్వర పరిష్కరణే ధ్యేయంగా- దేశంలోని 22 హైకోర్టుల పరిధిలో ప్రత్యేక శీఘ్రతర న్యాయస్థానాల ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామం. మౌలిక ప్రాజెక్టులు చేపట్టే సంస్థలకు సాంత్వన ప్రసాదిస్తూ నాలుగు నెలలక్రితం నిబంధనావళిని కేంద్ర విత్తమంత్రిత్వశాఖ ప్రక్షాళించిన దరిమిలా- ఇతరత్రా ప్రతిబంధకాల పరిహరణలో ఇది, నిస్సంశయంగా కీలక ఘట్టం! సులభతర వాణిజ్య నిర్వహణకు దోహదపడటంలో భారత్‌ విశేష పురోగతి సాధిస్తున్నట్లు ఆమధ్య ప్రపంచ బ్యాంకు కితాబిచ్చింది. సుమారు పదిహేనేళ్లపాటు ప్రతిపాదనల దశలోనే ఆగిపోయిన మూడు డజన్ల ముఖ్య సంస్కరణల్లో సగందాకా మోదీ జమానాలో పట్టాలకు ఎక్కడమే అందుకు ప్రధాన కారణమనీ అది విశ్లేషించింది. ఆరేళ్ల వ్యవధిలో 142నుంచి 63కు ఇండియా ర్యాంకు మెరుగుపడటం మెచ్చదగిందే. అయినా- పూడ్చాల్సిన కంతలింకా ఉన్నాయని క్షేత్రస్థాయి అధ్యయనాలు చాటుతున్నాయి.

దేశంలో పలుచోట్ల భూసేకరణ వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతుల్లో విపరీత జాప్యం, నిధుల సమీకరణలో ఇబ్బందులు తదితరాలకు వ్యాజ్యాల కోలాటం, బ్యురాక్రసీ నిష్ప్రయోజకత్వమూ జతపడి ప్రాజెక్టుల సత్వర పరిపూర్తికి ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. రకరకాల వివాదాలు, అహేతుక నిబంధనల మూలాన జాప్యాల వల్ల జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కే ఏటా కనీసం మూడు లక్షలకోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతున్నదని రెండు నెలల కిందట కేంద్రమంత్రి గడ్కరీ వాపోయారు. ఎనభైశాతం భూసేకరణ జరగనిదే ఇకమీదట కాంట్రాక్టులు ఇవ్వబోమనీ అప్పట్లో వెల్లడించారు. ఇప్పటికే కొంత ముందుకు వెళ్ళి నిలిచిపోయిన ప్రాజెక్టులకు మోక్షం కల్పించడంలో కొత్తగా నెలకొల్పిన 'ఫాస్ట్‌ట్రాక్‌' కోర్టులు ఏ మేరకు ప్రభావం కనబరచగలవో చూడాలి.


మూడు దశాబ్దాల నాడు ప్రపంచీకరణ గవాక్షాలు తెరిచినా, మౌలిక సదుపాయాల పరంగా భారత్‌ను మందభాగ్యం ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. ఏమాత్రం జవాబుదారీతనం లేని అవినీతి అసమర్థ యంత్రాంగమే అందుకు ప్రబలహేతువని కేంద్ర మంత్రులే ఈసడించడం సమస్య మూలాల్ని పట్టిస్తోంది. సులభతర వాణిజ్య సూచీలో ఎన్నదగ్గ ప్రగతి గోచరిస్తున్నా- ఒప్పందాల అమలులో 163, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో 154 ర్యాంకులతో భారత్‌ దిమ్మెరపరుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాలే అందుకు నేరుగా పుణ్యం కట్టుకుంటున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ నిరుడీ రోజుల్లో స్పష్టీకరించారు. రాష్ట్రాల స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలకు అవినీతి పెద్దసమస్యగా పరిణమించిందన్న విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్నాయి.

అవినీతి, రవాణాలకు సంబంధించి దుర్భర స్థితిగతులు ఇండియాను దిగలాగుతున్నట్లు గతంలో ఫోర్బ్స్‌ నివేదిక సూటిగా ఆక్షేపించింది. సులభతర వాణిజ్య నిర్వహణలో ఇతోధిక మెరుగుదల సాధించడమన్నది- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో నెగ్గుకురావాల్సిన అంశం. 2025నాటికి భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరింపజేసే క్రమంలో మౌలికరంగాన వంద లక్షల కోట్ల రూపాయలకుపైగా వెచ్చిస్తామన్న కేంద్రం, 18 రాష్ట్రాల్లో చేపట్టదలచిన పథకాల్ని ఏడాది క్రితమే క్రోడీకరించింది. ఆ కసరత్తును ఉరకలెత్తించడంలో కాంట్రాక్టుల అమలు, వివిధ అనుమతుల జారీ, న్యాయస్థానాల పనితీరు తదితరాలది నిర్ణాయక భూమిక. దాంతోపాటు కొవిడ్‌ సంక్షోభ పర్యవసానాల్ని చక్కదిద్దడంలో భాగంగా విద్యావ్యవస్థను పరిపుష్టీకరించి, నిపుణ మానవ వనరుల గనిగా దేశాన్ని తీర్చిదిద్దే వ్యూహాలు చురుగ్గా పదును తేలాలి. వాణిజ్య నిర్వహణకు సానుకూలాంశాలు ఇనుమడిస్తే, సమధిక పెట్టుబడుల్ని పారిశ్రామిక భారతావని సూదంటురాయిలా ఆకర్షించగలుగుతుంది!

ఇదీ చూడండి:వృద్ధి బాటలో ఉపాధికి బాసట!

ABOUT THE AUTHOR

...view details