తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆకలి కోరల్లో అభాగ్యులు

గతేడాదిలా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించకపోయినా.. రాష్ట్రాల్లో అమలవుతున్న కఠిన ఆంక్షలతో మునపటికన్నా తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి కోల్పోవడం వల్ల కొవిడ్​ మరణాల కన్నా ఆకలి చావులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి అనే భేదం లేకుండా రేషన్‌ దుకాణాల వద్ద నిలుచుని ఆహార ధాన్యాలు తీసుకోదలచిన వారందరికీ ప్రభుత్వం నెలసరి ఉచిత రేషన్‌ ఇవ్వాలి. ఆకలిచావులను అరికట్టేలా సత్వరమే చర్యలు చేపట్టాలి.

lockdown in india
భారత్​లో ఆకలి చావులు

By

Published : May 17, 2021, 7:38 AM IST

కొవిడ్‌ మలి దశ మహాసంక్షోభంలో ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధుల్ని కాపాడుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ లోగడే ప్రకటించారు. నిరుటి మాదిరిగా కేంద్రం జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించకపోయినా రాష్ట్రాల్లో అమలవుతున్న కఠిన ఆంక్షలతో మునుపటికంటే తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం కమ్ముకొస్తోందని విఖ్యాత ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ హెచ్చరిస్తున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కోట్లాది బడుగు జీవులకు రోజువారీ ఉపాధి- ప్రాణాలు కొడిగట్టకుండా కాపాడే పెన్నిధి. అదే దూరమై దేశవ్యాప్తంగా 45కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల్లో అత్యధికం కటిక పేదరికంలోకి జారిపోయి అలమటిస్తున్నారు. వీరిలో కొవిడ్‌ మరణాలకన్నా ఆకలి చావులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

నోచుకోనివారు ఎందరో..

దీన్ని నివారించడానికి కేంద్రం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ పథకం కింద 80కోట్ల మందికి మే, జూన్‌ నెలల్లో తలా అయిదు కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేస్తామన్నది. కానీ, జనగణన లెక్కల్లో పేర్లు లేక, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ఆహార ధాన్యాలు పొందలేకపోతున్న పేదలు 10 కోట్ల పైమాటే. వేలి ముద్రలు చెరిగిపోయి బయోమెట్రిక్‌ యంత్రాలు గుర్తించక రేషన్‌ భాగ్యానికి నోచుకోనివారు మరెందరో ఉన్నారు. పేదలకు అదనపు ఆహార ధాన్యాలిస్తామన్న కేంద్రం, వలస కార్మికులకు మాత్రం చేయి విదల్చనంటోంది. దేశమంతటా సంపూర్ణ లాక్‌డౌన్‌ లేదు కాబట్టి ఈసారి వలస కూలీల స్థితి గతేడాది అంత దారుణంగా లేదని, సొంత ఊళ్లకు తిరిగివెళ్ళిన వలస కూలీలు రేషన్‌ కార్డులతో ఆహారధాన్యాలు తీసుకొంటున్నారని కేంద్రం సెలవిస్తోంది.

దేశ జీడీపీకి 10శాతాన్ని సమకూర్చే వలస కార్మికుల వెతల్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం. నిరుడు సొంత ఊళ్లకు తిరిగివెళ్ళిన వలస శ్రామికుల్లో దాదాపు 39శాతానికి మళ్లీ పనులు దొరకలేదు. లాక్‌డౌన్‌ తరవాత వారి ఆదాయాలు 86శాతందాకా కోసుకుపోయాయి. నిరుటి మాదిరే వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి నానా అగచాట్లు పడుతున్నా ఆనాటి చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్న దాఖలాలు లేవు.

ఇతర ప్రాంతాల్లో వారినీ..

ఆహార దిగుబడుల్లో ఇండియా ఏటికేడు ఘనంగా రాణిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా- 107 దేశాల ప్రపంచ క్షుద్బాధా సూచీలో 94వ స్థానంలో నిలిచింది. ఉపాధి అవకాశాల్నీ కొవిడ్‌ మహమ్మారి మింగేయడం వల్ల వలస కూలీలతోపాటు నిరుపేదల జీవనహక్కూ నేడు పెను ప్రమాదంలో పడింది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో చిక్కుకుపోయిన వలస కూలీలకు రెండు పూటలా భోజనంతోపాటు కిరాణా సరకులూ ఇవ్వాలని కేంద్రాన్ని, దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళడానికి రవాణా ఏర్పాట్లు చేయాలనీ సూచించింది. దేశంలో ఇతర ప్రాంతాల్లోని వలస కూలీలనూ ఇదే తరహాలో ఆదుకోవాలి.

పునరావృతం కాకూడదు..

ఉపాధి కోల్పోయి మధ్యతరగతి నుంచి పేదరికంలోకి జారిపోతున్నవారి కుటుంబాల్లోనూ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కరోనా విలయం వల్ల 23 కోట్లమంది భారతీయుల రోజువారీ ఆదాయం జాతీయ కనీస వేతనమైన రూ.375కన్నా దిగువకు పడిపోయిందని అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం నిగ్గు తేల్చింది. కోట్లమందికి ఇప్పుడు తిండి లేదు, పనీ లేదు. నిరుడు కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో 27శాతం భారతీయులు తరచూ పస్తులు ఉండవలసి వచ్చిందని ఆహార హక్కు ఉద్యమ సంస్థ సర్వే వెల్లడించింది. ఈ మానవ మహా విషాదం పునరావృతం కాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన దానికన్నా మూడురెట్లు ఎక్కువ ఆహార నిల్వలు ప్రభుత్వ గోదాముల్లో పేరుకున్నాయి. పేద, మధ్యతరగతి అనే భేదం లేకుండా రేషన్‌ దుకాణాల వద్ద నిలుచుని ఆహార ధాన్యాలు తీసుకోదలచిన వారందరికీ నెలసరి ఉచిత రేషన్‌ ఇవ్వాల్సిన సమయమిది. కొవిడ్‌ మరణాలకు జతపడి ఆకలిచావులూ ముమ్మరించకుండా ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన కదలాలి!

ఇదీ చూడండి:కొరవడిన ముందు చూపు- అసమానతల్లో ప్రజారోగ్యం

ABOUT THE AUTHOR

...view details