తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనాతో కుదేలైన విద్యా వ్యవస్థ

ప్రపంచ మహమ్మారి కరోనా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 శాతం చిన్నారులు సరైన విద్యను పొందలేకపోయారని యునెస్కో తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దాదాపు 91 శాతం మంది పిల్లలు విద్యా సంస్థలకు దూరమయ్యారని నివేదించింది.

EDUCATION SYSTEM HAS BEEN COLLAPSED
కుదేలైన విద్యా వ్యవస్థ

By

Published : Jul 7, 2020, 6:16 AM IST

సామాజిక అభ్యున్నతికి, మానవుడి పరిపూర్ణ వికాసానికి కీలకమైన సాధనం విద్య. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలో అసమానతలకు కారణమైంది. ఈ సంక్షోభ సమయంలో పేద, అల్పాదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 40శాతం చిన్నారులు సరైన విద్యను పొందలేకపోయారని యునెస్కో తాజా నివేదిక వెల్లడించింది. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వ పాఠశాలల మీదే ఆధారపడిన పేద, దిగువ మధ్యతరగతి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

91 శాతం పిల్లలు విద్యాసంస్థకు దూరం..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తృతిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థుల చదువులు అటకెక్కినట్లు ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక-2020 పేర్కొనడం- కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై చూపిన ప్రభావానికి అద్దం పడుతోంది. దాదాపు అన్ని దేశాల్లో ఏప్రిల్‌ నెల నుంచి పాఠశాలలు మూతపడటంతో 91శాతం పిల్లలు విద్యాసంస్థలకు దూరమయ్యారు. ప్రత్యక్ష విద్యాభ్యాసానికి దూరమైన పరిస్థితుల్లో పలు విద్యాసంస్థలు దీనికి పరిష్కారంగా దూరవిద్యా పద్ధతిని ఎంచుకున్నాయి. ఇలాంటి ఏర్పాట్లన్నీ తరగతి గది విద్యకు అసంపూర్ణ ప్రత్యామ్నాయ మార్గాలేనని నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. లాక్‌డౌన్‌ కాలంలో చాలా వరకు పేద దేశాలు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడానికి రేడియో, టీవీల్లో ప్రభుత్వ ప్రసార సాధనాలనే మాధ్యమాలుగా ఎంచుకున్నాయి.

అసమానతే పెద్ద అవాంతరం

అందరికీ విద్య, వైద్య సదుపాయాలు అందించడంలో అసమానతలు, అంతరాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైంది. ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కువగా ఆధారపడినవారు గ్రామీణ, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు చెందిన చిన్నారులే కావడంతో- వాళ్లు ఆన్‌లైన్‌ విధానంలోని అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు, తగిన అంతర్జాల సదుపాయం, వాటిని ఉపయోగించే విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌ విద్యావిధానంలో ఉన్న ప్రయోజనాన్ని వినియోగించుకోలేక పోతున్నారని యునెస్కో నివేదిక స్పష్టం చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అదే పరిస్థితి..

నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు, సెల్‌ఫోన్‌లు ఉన్నా... గ్రామీణ ప్రాంతాలు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. పాఠశాలలు, విద్యాసంస్థలన్నీ మూతపడటంతో ముఖ్యంగా ప్రత్యేక అవసరాలుగల పిల్లల విద్యాభ్యాసానికి దోహదపడే అనుబంధ సామగ్రి, సదుపాయాల కల్పనలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి అంధులు, బదిరులు వంటి దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే విద్యావనరులు, మౌలిక సదుపాయాలు లభ్యమయ్యే పరిస్థితులు లేవు. ఇలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలు స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌లతో ప్రయోజనం పొందడం తక్కువే. సాధారణంగా పాఠశాల వాతావరణంలో అందుబాటులో ఉన్న వసతుల మధ్య పొందే అనుభూతి ఆన్‌లైన్‌-డిజిటల్‌ విజ్ఞాన ప్రపంచంలో పొందలేరన్నది సుస్పష్టం. మధ్యాహ్న భోజనం, ఉచిత శానిటరీ న్యాప్‌కిన్ల కోసం ప్రభుత్వ పాఠశాలల మీదే ఆధారపడే బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాల, బాలికలు పాఠశాలలు మూతపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న యునెస్కో నివేదిక- పేదరికంలో మగ్గుతున్న వారి దైనందిన పరిస్థితులకు అద్దం పడుతోంది.

అందరికీ ప్రయోజనకరంగా...

దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నింటినీ జులై 31 వరకు ప్రారంభించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తరవాతా అవి ఎప్పటికి మొదలవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పాఠశాలలు మూత పడటంతో మధ్యాహ్న భోజన పథకంపైనే ఆధారపడిన విద్యార్థుల కడుపునిండే పరిస్థితి లేదని, కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తాజాగా హైదరాబాద్‌ ఉన్నత న్యాయస్థానంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత్‌తో సహా పలుదేశాల్లో అన్ని పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేయడంతో అనివార్యంగా పిల్లల భవిష్యత్తు నిర్ణయాధికారాన్ని ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టినట్లయింది. ఇంటర్నల్స్‌, టర్మ్‌ పరీక్షల్లో మార్కులు వేయడం పాఠశాలలో ఉపాధ్యాయుల బాధ్యతే కాబట్టి, వాటి ఆధారంగా అంతిమ మూల్యాంకనం ఉంటుంది.

గ్రేడింగ్​లే..

వాస్తవ పరీక్షల్లో విద్యార్థులు చూపే ప్రతిభకన్నా, ఉపాధ్యాయుల తీర్పుపైనే వారి గ్రేడింగ్‌లు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ పాఠశాలలను తెరచినా డ్రాపవుట్లు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ మహమ్మారి విజృంభించినప్పుడు అత్యధిక శాతం బాలికలు సంక్షోభం ముగిసే వరకూ పాఠశాలల ముఖం చూడలేదు. భారత్‌లో విద్యార్థుల సంఖ్యను బట్టి షిఫ్టులు, విడతల వారీగా నిర్వహించాలని, ఒకరోజు ప్రత్యక్షంగా తరగతి గదిలో హాజరైన విద్యార్థులకు మరుసటి రోజు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పథకాలు, ప్రణాళికలు- సర్కారీ బడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పేద, మధ్యతరగతి, ప్రత్యేక అవసరాలుగల పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలి.

ఇదీ చదవండి:'చివరి సెమిస్టర్​ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరి'

ABOUT THE AUTHOR

...view details