దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రజ్వలనానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తొలిసారి లాక్‌డౌన్ విధించి ఏడాది గడిచాక, నియంత్రణ వ్యూహం ఏ మేరకు ఫలించింది? ఆమధ్య తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, కొన్నాళ్లుగా మళ్ళీ పెరుగుతున్న కొవిడ్ కేసులు- మలిదశ ఉద్ధృతిని కళ్లకు కడుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే కొత్త కేసులు 47వేలకు మించిపోవడం, అందులో సుమారు 80శాతందాకా మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడుల్లోనే పోగుపడటం కరోనా వైరస్ విజృంభణను స్పష్టీకరిస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా స్థానికంగా అత్యవసర చర్యలన్నీ చేపట్టాల్సిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొవిషీల్డ్ రెండు మోతాదుల మధ్య వ్యవధిని ఎనిమిది వారాలకు పెంచిన కేంద్రం- 45ఏళ్లు దాటిన అందరికీ ఏప్రిల్ మొదటి నుంచీ టీకా అందుబాటులో ఉంటుందని చెబుతోంది. వ్యాక్సినేషన్ పరిధి పెరిగినా ఎవరూ ఉదాసీనంగా ఉండే వీల్లేదంటున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ జాగ్రత్తల్నీ ప్రస్తావించారు. మరో ఒకటి రెండేళ్లు మాస్క్ ధారణ, భౌతిక దూరాన్ని చేతుల పరిశుభ్రతను పాటించాలన్న హితబోధ- జాతికి శిరోధార్యమైనది. ఎక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం కనబరచినా మలిదశ ఉద్ధృతిని తట్టుకోలేమంటున్న అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) హెచ్చరిక ఉపేక్షించరానిది. కొవిడ్ ఉరవడికి పగ్గాలు వేయడమన్నది యావత్ ప్రజానీకం, సమస్త ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా నిర్వర్తించాల్సిన మహాయజ్ఞం.ఇప్పటికన్నా వ్యాక్సినేషన్ వేగం ఇతోధికం కావడం, అక్షరాలా ప్రాణావసరం. రోజుకు కోటి మోతాదుల టీకాలిచ్చే సామర్థ్యం సంతరించుకుంటే మూడు నెలల్లో సాధారణ వాతావరణం నెలకొనే వీలుందంటున్న సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా సూచనల వెలుగులో- ప్రభుత్వాల వ్యూహాలు చురుగ్గా పదును తేలాలి!
టీకా వృథాకు అడ్డుకట్ట..
సంక్రాంతి దరిమిలా జనవరి 16వ తేదీనాటి తొలిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియలో టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 1.91లక్షలు. ఇప్పటివరకు టీకాలు పొందిన వారి సంఖ్య ఇంచుమించుగా అయిదు కోట్లకు చేరింది. అప్పటితో పోలిస్తే టీకాలు వేసే వేగం జోరందుకున్న మాట వాస్తవం. 24 గంటల వ్యవధిలో సుమారు 32 లక్షల మందికి వ్యాక్సినేషన్ కొత్త రికార్డుగా కేంద్రం చెబుతున్నా- ఆ వేగం మూడు రెట్లకు మించితేనే రోజుకు కోటి టీకాల లక్ష్యాన్ని సాధించగలిగేది. టీకాల ప్రదానంలో శీఘ్రగతిని పుంజుకోవడమెంత ముఖ్యమో, ప్రధాని మోదీ ఇటీవల లేవనెత్తిన వృథా నివారణా అంతే కీలకం. ప్రాణప్రదమైన టీకాలు వ్యర్థం కాకుండా, నిర్దేశిత గడువులోగా వాటిని సద్వినియోగపరచేలా- చెన్నై కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేరువలోని 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ‘రిస్క్’ ఎక్కువగా కలిగిన వీధి వ్యాపారులు, పత్రికల సరఫరాదారులు, సెక్యూరిటీగార్డులు తదితరులకు అక్కడే కాదు- లూథియానా వంటి చోట్లా టీకాలు అందుబాటులో ఉన్నట్లు క్షేత్రస్థాయి కథనాలు వెల్లడిస్తున్నాయి.