తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఐరాస 'నిష్పాక్షికత'పై నీలి నీడలు

ఇంతకాలం ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు తమ మాటే వేదం అన్నట్లు వ్యవహరిస్తూ.. సమితి బహుళత్వానికి తూట్లు పొడవటం వల్ల ఐక్య కార్యాచరణ ఎండమావి అవుతోంది. కరోనా వంటి మహమ్మారులను, ఆర్థిక మాంద్యాలను, వాతావరణ మార్పులను నిరోధించాలంటే సమితి దేశాలు ఒకే మాట ఒకే బాటగా నడుచుకోవాలి. అయితే చైనా ప్రాబల్యం పెరుగుతున్నా కొద్ది ఐక్యరాజ్యసమితి ప్రజాతంత్ర వేదికగా, మానవ హక్కులు, అంతర్జాతీయ నియమ నిబంధనలను గౌరవించే సంస్థగా నిలవగలుగుతుందా? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

Editorial on the performance of United Nations and raising issues
ఐరాసా నిష్పాక్షికతపై నీలి నీడలు

By

Published : Sep 30, 2020, 7:49 AM IST

అగ్రరాజ్యమైనా, బడుగు దేశమైనా సాటి దేశాలతో సంబంధం లేకుండా ద్వీప సదృశంగా మనలేవని, కలిసికట్టు కార్యాచరణ చేపట్టాల్సిందేనని కొవిడ్‌ సంక్షోభం చాటిచెబుతోంది. ఇంతకాలం ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు తమ మాటే వేదం అన్నట్లు వ్యవహరిస్తూ, సమితి బహుళత్వానికి తూట్లు పొడవటం వల్ల ఐక్య కార్యాచరణ ఎండమావి అవుతోంది. అసలు బహుళపక్ష వేదికగా సమితి ఎంతకాలం మనగలదనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమతున్నాయి. అందుకే ఐరాస 75వ వార్షికోత్సవ సందర్భంగా ప్రపంచ నాయకుల వర్చువల్‌ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనాటి సవాళ్లను కాలం చెల్లిన వ్యవస్థలతో అధిగమించలేమని గుర్తుచేశారు. గత 8-9 నెలలుగా ప్రపంచం కరోనా మహమ్మారితో చేస్తున్న సమరంలో సమితి ఎక్కడుందని నిలదీశారు. 130 కోట్ల జనాభా గల భారతదేశానికి ఐక్యరాజ్య సమితి విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని ఎంతకాలం నిరాకరిస్తారని ప్రశ్నించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు చైనా మోకాలడ్డటాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. చైనా వంటి ఏకపక్ష దేశాలకు భద్రతా మండలిలో వీటో అధికారాన్ని తొలగిస్తే కానీ నిజమైన బహుళత్వం వర్ధిల్లదు. కరోనా వంటి మహమ్మారులను, ఆర్థిక మాంద్యాలను, వాతావరణ మార్పులను నిరోధించాలంటే సమితి దేశాలు ఒకే మాట ఒకే బాటగా నడుచుకోవాలి. గతంలో అమెరికా, రష్యా వైరుధ్యాలు, ఇప్పుడు అమెరికా, చైనా విభేదాలు సమితి సమష్టి కార్యాచరణకు అడ్డు పడుతున్నాయి.

డ్రాగన్‌ నీడలో...

సమితిలో ఈ ప్రధాన లోపమున్నా 75 ఏళ్లుగా ప్రపంచ శాంతిసౌభాగ్యాలు, మానవ హక్కుల పరిరక్షణకు ఏకైక అంతర్జాతీయ వేదికగా నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు కొవిడ్‌ సంక్షోభం విసరతున్న పెను సవాలును ఎదుర్కోవడంలో సమితి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వర్చువల్‌ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కరోనా మహమ్మారిని చైనా వైరస్‌గా వర్ణించి, ప్రస్తుత కల్లోలానికి సమితి ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఈ మాట ఒడ్డున కూర్చుని చెబుతున్నారే తప్ప, నలుగురితో కలిసి రావడానికి ససేమిరా అంటున్నారు. ఆయన హయాములో అమెరికా- ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల నుంచి వైదొలగి బహుళపక్ష సంఘటిత కార్యాచరణకు గండి కొట్టింది. కరోనా వైరస్‌ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తొక్కిపట్టిందని ఆరోపిస్తూ అందులో నుంచి నిష్క్రమిస్తానని ప్రకటించింది. దానికన్నా ముందు యునెస్కో నుంచి, ఐరాస మానవ హక్కుల మండలి నుంచి వైదొలగింది. సమితికి తన వంతు ఆర్థిక కేటాయింపులకు కత్తెర వేస్తోంది. మరోవైపు చైనా, గడచిన పదేళ్లలో ఐరాసకు నిధుల కేటాయింపును అయిదు రెట్లు పెంచింది. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), పారిశ్రామికాభివృద్ధి సంస్థ వంటి ప్రత్యేక ఐరాస విభాగాల్లో తన పట్టు పెంచుకొంది. ప్రస్తుతం నాలుగో వంతుకు పైగా సమితి ప్రత్యేక సంస్థలకు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా ఖాళీ చేసిన అంతర్జాతీయ నాయకత్వ స్థానంలోకి తాను అడుగుపెట్టాలని చైనా చూస్తోంది. ఐక్యరాజ్య సమితిలో కొంతకాలంగా రష్యాతో చైనా కలిసి పని చేస్తోంది. గుట్టుగా తన అజెండాను అమలు చేసుకుంటూ పోతోంది. పాకిస్థాన్‌, టర్కీ వంటి దేశాలు చైనాకు సహజంగానే తోడ్పడతాయి.

సమష్టి కార్యాచరణే కీలకం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నాలకు గండి కొట్టే పని అప్పుడే మొదలైపోయినట్లుంది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ (జనరల్‌ అసెంబ్లీ)కి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి- టర్కీకి చెందిన వోల్కన్‌ బోజ్కిర్‌. ముస్లిం ప్రపంచానికి అధినేతగా ఎదగాలని కలగంటున్న టర్కీ ఈ మధ్య పాకిస్థాన్‌తో అంటకాగుతోంది. అందుకేనేమో బోజ్కిర్‌ సమితి 75వ వార్షిక సభ ఉన్నత స్థాయి సమావేశంలో అన్ని సంప్రదాయాలకు విరుద్ధంగా కశ్మీర్‌ సమస్యను లేవనెత్తారు. భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణకు సమితి సభ్య దేశాలతో సంప్రతించే కమిటీకి అధ్యక్షుడిని ఎంపిక చేసే అధికారం బోజ్కిర్‌కు ఉంటుంది. దీన్ని ఆయన దుర్వినియోగం చేసి భారత్‌ అంటే గిట్టని వ్యక్తిని నియమించే ప్రమాదం ఉంది. ఇంతవరకు ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడిగా నియమితుడయ్యే వ్యక్తి, ఆ పదవిని స్వీకరించే ముందు భారత్‌ను సందర్శించడం ఆనవాయితీ. కానీ, ఈ ఏడాది సెప్టెంబరు 15న పదవిని స్వీకరించే ముందు బోజ్కిర్‌ పాకిస్థాన్‌కు వెళ్లి తన ధోరణి ఎలా ఉండబోతోందో ముందుగానే బయటపెట్టుకున్నారు. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచ దేశాలు తగు పాఠాలు నేర్చుకున్నాయనే ఆశాభావంతో 1945లో ఐక్యరాజ్యసమితిని నెలకొల్పారు. ప్రపంచంలో శాంతి పరిరక్షణలో సమితి కృషి ఫలవంతంగా సాగాలంటే, భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలే కాదు, అన్ని ప్రధాన దేశాలూ కేవలం సొంత లాభం చూసుకోకుండా మానవాళి మేలుకు గట్టి కృషి తలపెట్టాలి. సమితి మూల సూత్రాలను గౌరవించాలి. శాంతి, భద్రతల సాధనకు సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలి. అందుకోసం తగు సంస్కరణలు తీసుకురావాలి. భూతాప నివారణకు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పునరంకితం కావాలి. అలా కాకుండా సమితి చైనా ప్రాబల్యంలోకి వెళ్లిపోతే అమెరికా, భారత్‌లు ప్రత్యామ్నాయాన్ని వెతికే అవకాశాన్ని తోసిపుచ్చలేం!

'సమితి' నిబద్ధతపై సందేహాలు

చైనా ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ ఐక్యరాజ్యసమితి ప్రజాతంత్ర వేదికగా, మానవ హక్కులు, అంతర్జాతీయ నియమ నిబంధనలను గౌరవించే సంస్థగా నిలవగలుగుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. చైనా ఇప్పటికే హాంకాంగ్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, లద్దాఖ్‌లలో అంతర్జాతీయ ఒప్పందాలను, ఆనవాయితీలను తుంగలో తొక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో అమెరికా, రష్యా కూటముల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సమితిని నిర్వీర్యం చేస్తే- మున్ముందు అమెరికా, చైనా ప్రచ్ఛన్న యుద్ధం అదే పని చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ మాత్రం సమితి వర్చువల్‌ సమావేశంలో ప్రసంగిస్తూ తాము ప్రచ్ఛన్న యుద్ధం కానీ, బహిరంగ యుద్ధం కానీ చేసే ప్రసక్తే లేదన్నారు. లద్దాఖ్‌లో, దక్షిణ చైనా సముద్రంలో చైనా అతిక్రమణలను చూస్తే- జిన్‌ పింగ్‌ మాటలపై నమ్మకం కుదరదు. కొవిడ్‌ కల్లోలాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని జిన్‌ పింగ్‌ ఇచ్చిన పిలుపును తప్పు పట్టలేం కానీ- చైనా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కావడం బహుళపక్ష కార్యాచరణకు అడ్డువస్తోంది.

- ప్రసాద్‌

ABOUT THE AUTHOR

...view details