ఆర్థికరంగాన ప్రజాస్వామ్య భావనలకు ఊపిరులూది గ్రామీణ వికాసంలోను, జాతీయాభివృద్ధిలోను కీలక భూమిక పోషించగల సహకార సంఘాలకు దేశంలో సముచిత ప్రాధాన్యం కొరవడిందన్న యథార్థం ఎవరూ తోసిపుచ్చలేనిది. కేంద్రంలో కొలువు తీరిన నూతన మంత్రిత్వశాఖ దేశీయ సహకారోద్యమ పరిపుష్టీకరణకు దోహదపడతానని అభయమిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వర్తించగల సహకార బ్యాంకుల అభివృద్ధికీ బాటలు పరుస్తానంటోంది. ఇప్పటివరకు వ్యవసాయ మంత్రిత్వశాఖలో ఒక విభాగం స్థాయికి పరిమితమైనదాన్ని అమిత్ షా నేతృత్వాన ప్రత్యేక శాఖగా నెలకొల్పడం రాష్ట్రాల హక్కుల్ని హరించే యత్నంగా విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది 'రాజకీయ దుశ్చేష్ట' అని, సహకారోద్యమాన్ని హైజాక్ చేసే యత్నమన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. 'నడమంత్రపు చట్టాలు మాకొద్దు!' అని అన్నదాతలు ఒకపక్క నిరసనోద్యమం కొనసాగిస్తుండగా, క్షేత్రస్థాయిలో కేంద్రప్రభుత్వం పట్ల రైతు వ్యతిరేకతను నీరుకార్చేలా సహకార సంఘాలపై పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా పావులు కదిపారన్న విశ్లేషణలూ వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, యూపీలను; దక్షిణాన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితరాలను లక్షించిన కమలనాథుల విస్తృత వ్యూహంలో ఇది అంతర్భాగమన్న అంచనాల్లో- ఫెడరల్ స్ఫూర్తి కొల్లబోతుందన్న ఆందోళన ప్రస్ఫుటమవుతోంది. తమది సదుద్దేశమేనంటున్న కేంద్రం- సమాఖ్య భావన బీటలు వారకుండా, సహకారోద్యమాన్ని తేజరిల్లజేయడంలో దక్షత నిరూపించుకోవాలి. తద్వారా పెచ్చరిల్లుతున్న స్వాహాకారానికి కళ్లెం వేయాలి!
సహకార సంఘాలపై పట్టు కోసమే కొత్త శాఖ! - రుణం
సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల హక్కులను హరించడమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే సహకారోద్యమానికి ప్రభుత్వం సహాయకారిగా ఉండాలే కానీ.. జోక్యం చేసుకోని స్వప్రయోజనం పొందడం ద్వారా దాని ఉద్దేశానికే తూట్లు పొడిచేలా ఉండకూదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధాని నెహ్రూ- ఏ దశలోనూ సహకారోద్యమం సర్కారుదన్న భావన రానీయరాదన్న సదాశయానికి ఎత్తుపీట వేశారు. దురదృష్టవశాత్తు, ఆయన జమానాలోనే సహకార బ్యాంకుల వాటా మూలధనంలో ప్రభుత్వాలకూ చోటుపెట్టి, సొసైటీ యాజమాన్యంలో మూడోవంతు మందిని నామినేట్ చేయగల వెసులుబాటు కల్పించారు. వాటి దుష్పరిణామాల తీవ్రతను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్ మధు దండావతే తూర్పారపట్టారు. ఖుస్రో కమిటీ, వైద్యనాథన్ కమిటీ వంటివీ- ప్రభుత్వ అదుపాజ్ఞల్లో సహకార సంస్థలు కునారిల్లే దుర్గతి రూపుమాసిపోయేలా దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను స్పష్టీకరించాయి. సర్కారీ ప్రమేయం తగ్గి, పాలనపరమైన లోపాల్ని సత్వరం సరిదిద్దాలన్న సిఫార్సులెన్నో ఏళ్లతరబడి అరణ్యరోదనమవుతున్నాయి. అందుకు భిన్నంగా వెలుపలి ప్రపంచంలో స్ఫూర్తిమంతమైన విజయగాథలనేకం సహకారోద్యమం సాకారం చేయగల అద్భుతాల్ని కళ్లకు కడుతున్నాయి. పొరుగున బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ గ్రామీణబ్యాంకు ద్వారా చిరు వ్యాపారులకు సూక్ష్మరుణాలందించి అసంఖ్యాక జీవితాల్ని చక్కదిద్దిన ఉదంతం యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. బ్రెజిల్, నార్వే, ఉరుగ్వే, కెనడా ప్రభృత దేశాలు సహకార ఫలాల్ని విస్తృత జనబాహుళ్యానికి పంచడంలో పోటీపడుతున్నాయి! అదే ఇక్కడ- సహకార సంస్థల్ని వశపరచుకుంటే పల్లెపట్టుల్లో ఓట్లవేటకు అక్కరకొస్తాయని పార్టీలు పసిగట్టాక బోగస్ సభ్యత్వాలు ముమ్మరించాయి. మితిమీరిన వెలుపలి జోక్యం మూలాన స్వావలంబన, జవాబుదారీతనం, పారదర్శకతలకు నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. సర్కారీ పెత్తనం ఇంతలంతలై, ఎన్నికైన బోర్డులపై వేటుపడి, యథేచ్ఛగా ప్రభుత్వ నామినీల మార్పులు జోరెత్తి సహకార సంస్థలు కుంగిపోతున్నట్లు లోగడ ప్రధానమంత్రిగా వాజ్‌పేయీ సూటిగా ఆక్షేపించారు. అటువంటి అవలక్షణాల్ని తుడిచిపెట్టే చొరవ ఏ మేరకు ఎలా సాధ్యమో చూడాలిప్పుడు!
ఇదీ చూడండి:అద్దె ఇళ్ల కోసం కొత్త చట్టం- ఇక ఇలా చేయాల్సిందే...