తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ

ఓఎఫ్‌బీని కార్పొరేట్‌ సంస్థగా రూపాంతరం చెందించిన వెంటనే ఆశించిన ఫలితాలు వచ్చేస్తాయనే పొరపాటు అభిప్రాయం చాలామందిలో ఉంది. కీలక ఆయుధ పునర్నిర్మాణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని సైన్యం నిశ్చయించడం వివాదం రేపింది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో పనులు జరిపించడం గురించి బొత్తిగా తెలియని అధికారులు జీఓసీఓ నమూనా పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇది దూరదృష్టి లేమికి నిదర్శనం. అయితే సంక్షోభం వచ్చినప్పుడు భారీఎత్తున ఆయుధాలు తయారుచేసే సత్తా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల సొంతం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం సమతూకంగా ఉండాలి. సరికొత్త ఆయుధాలను తయారుచేయడమే కాదు, వాటిని ఎగుమతి చేయగల స్థాయికీ భారత్‌ ఎదగాలి.

Editorial on privatization of Ordinance factory board
ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ

By

Published : Sep 22, 2020, 7:16 AM IST

ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)ను కార్పొరేట్‌ సంస్థగా మలచడానికి అనుసరించాల్సిన విధివిధానాలను సూచించడానికి కేపీఎంజీ, ఖైటాన్‌ కన్సల్టెన్సీ సంస్థలను రక్షణ శాఖ ఇటీవల నియమించింది. ఆయుధ తయారీ పరిశ్రమల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఈమధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఓఎఫ్‌బీ కార్పొరేటీకరణ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఓఎఫ్‌బీని కార్పొరేట్‌ సంస్థగా రూపాంతరం చెందించిన వెంటనే ఆశించిన ఫలితాలు వచ్చేస్తాయనే పొరపాటు అభిప్రాయం చాలామందిలో ఉంది.

కొరవడిన దూరదృష్టి

ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక పాశ్చాత్య దేశాలు తమ సాయుధ దళాల సంఖ్యను పెద్దయెత్తున కుదించాయి. ఆయుధాలకు గిరాకీ సైతం తగ్గింది. ఆ పూర్వ రంగంలో ఆయుధోత్పత్తి నుంచి పాశ్చాత్య ప్రభుత్వాలు క్రమంగా వైదొలగి, ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించసాగాయి. కానీ, భారతదేశంలో భద్రతా పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో నానాటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా, పాశ్చాత్య దేశాల బాటలో భారత్‌ నడవడం సాధ్యపడదు. అదేసమయంలో ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రైవేటు రంగానికి రక్షణ పరిశ్రమల్లో పాత్ర కల్పించాలనుకుంటే దాన్ని తప్పుపట్టలేం. ప్రభుత్వ యాజమాన్యంలో ప్రైవేటు కాంట్రాక్టర్లతో ఆయుధోత్పత్తి సాగించడాన్ని జీఓసీఓ నమూనా అంటారు. సైనిక ప్రధాన వర్కుషాపుల్లో ఈ నమూనాను చేపట్టే విషయమై తగు సూచనలు చేసే పనిని ప్రభుత్వం కొంతకాలం క్రితం ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈ వర్క్‌ షాపులు ఆయుధాల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటాయి. కీలక ఆయుధ పునర్నిర్మాణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని సైన్యం నిశ్చయించడం వివాదం రేపింది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో పనులు జరిపించడం గురించి బొత్తిగా తెలియని అధికారులు జీఓసీఓ నమూనా పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇది దూరదృష్టి లేమికి నిదర్శనం. చివరికి కన్సల్టెంట్ల నివేదిక అనుభవ రాహిత్యానికి ప్రతీకగా నిలవడమే కాదు, చేసిన ఖర్చుకు తగిన ప్రతిఫలం ఇవ్వలేకపోయింది. సైనిక ప్రధాన వర్కుషాపులు ఎంతటి గురుతర బాధ్యతలను నిర్వహిస్తాయో ఈ నివేదిక అర్థం చేసుకోలేకపోయింది. భారత్‌ సాయుధ దళాలు వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న రకరకాల ఆయుధాలను పకడ్బందీగా నిర్వహించడం, అవసరమైనప్పుడు మరమ్మతులు చేసి పోరాట సన్నద్ధంగా ఉంచడం వంటి కీలక బాధ్యతలను సైనిక వర్కుషాపులు నెరవేరుస్తాయి. కాలం చెల్లిన ఆయుధాలనూ పోరాట సన్నద్ధంగా ఉంచుతాయి. అందుకే మూడు దశాబ్దాల క్రితం తయారైన బోఫోర్స్‌ శతఘ్నులను సైన్యం ఇప్పటికీ పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో మోహరించగలుగుతోంది. గల్ఫ్‌ యుద్ధంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా, బ్రిటన్‌లు జీఓసీఓ నమూనాకు స్వస్తి చెప్పి, ప్రభుత్వ-ప్రైవేటు రంగాలకు సమతుల్య భాగస్వామ్యం కల్పించే పద్ధతికి మారాయి. భారత సైన్యం ఇలాంటి అనుభవాలను గమనించి తగు నమూనాలను రూపొందించుకోవాలి. ప్రస్తుతం ఎల్‌ఏసీపై చైనాతో ఏర్పడిన ఘర్షణ వాతావరణం, ఆయుధాలను పోరాటానికి సన్నద్ధంగా ఉంచుకోవలసిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. సైనిక ప్రధాన వర్కుషాపులను ప్రభుత్వం తన అధీనంలోనే ఉంచుకోవాలి.

ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల సమర్థ సేవలు

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన ఆయుధాలను, విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఆధారంగా తయారు చేసుకున్న ఆయుధాలను మన ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు సమర్థంగా ఉత్పత్తి చేసి సైన్యానికి అందిస్తున్నాయి. వీటికోసం మరింత ఆధునిక సాంకేతికత, నిపుణ సిబ్బందిని వినియోగించాలనడంలో మరోమాట లేదు. కానీ, సంక్షోభం వచ్చినప్పుడు భారీఎత్తున ఆయుధాలు తయారుచేసే సత్తా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల సొంతం. అటు చైనాతో, ఇటు పాకిస్థాన్‌తో ఏకకాలంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన ప్రస్తుత పరిస్థితిలో మన సేనలకు రైఫిళ్లు, ట్యాంకులు, శతఘ్నులను హుటాహుటిన అందించగలగాలి. ఈ విషయంలో ప్రైవేటు కన్సల్టెన్సీలపై అతిగా ఆధారపడకూడదు. రక్షణ శాఖ ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను కార్పొరేటీకరించింది. నవీకరణ వల్లనే రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు జర్మనీపై ఘన విజయం సాధించాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితిలో భారత సాయుధ దళాలూ నవీకరణకు పెద్దపీట వేయాలి. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదాన్నీ రక్షణ పరిశ్రమలకు వర్తింపజేయాలి. అవి ఆయుధ కూర్పునకు, విడిభాగాల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైపోకుండా నవీన సాంకేతికతతో శక్తిమంతమైన ఆయుధాలను తయారుచేయగల స్థితికి ఎదిగేలా ప్రభుత్వం చేయూత ఇవ్వాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం సమతూకంగా ఉండాలి. సరికొత్త ఆయుధాలను తయారుచేయడమే కాదు, వాటిని ఎగుమతి చేయగల స్థాయికీ భారత్‌ ఎదగాలి.

- లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌.బి.సింగ్‌

(సాయుధ దళాల ట్రైబ్యునల్‌ సభ్యులు)

ABOUT THE AUTHOR

...view details