ఆకలితో ఉన్నవారికి దేవుడు అన్నం రూపంలోనే కనిపిస్తాడన్నారు మహాత్మాగాంధీ. రెక్కాడితేగాని డొక్కాడని కోట్లాది బడుగు జీవులకు అన్నపూర్ణగా మారింది- జాతిపిత పేరిటే అమలవుతున్న గ్రామీణ ఉపాధి హామీ! కరోనా కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్ల కారణంగా పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మూసుకుపోయి స్వస్థలాలకు చేరిన కోట్లమంది వలస కూలీలకే కాదు, విద్యావంతులకూ నిపుణ శ్రామిక కోటికీ ఉపాధి హామీ పథకమే బతుకు తెరువుగా మారింది.
బడ్జెట్లో కేటాయించిన రూ.61వేల కోట్లకు అదనంగా మరో రూ.40 వేలకోట్లు జోడించి గ్రామీణ ఉపాధికి మోదీ ప్రభుత్వం ఈ మధ్య భరోసా ఇచ్చినా, ఆ దిలాసా ఇంకెంత కాలం ఉంటుందన్న సందేహమే ఆలోచనాపరుల్ని బాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ముగిసింది నాలుగు నెలలే అయినా మొత్తం కేటాయింపులో రూ.48,500 కోట్లకు పైగా ఖర్చు అయిపోయింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తాజా అధ్యయనం ప్రకారం ఎన్నెన్నో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులు నిండుకున్నాయి. వానలు జోరుగా పడుతున్నందున పలు రాష్ట్రాల్లో ఉపాధి పనులూ మందగించాయి. వంద రోజుల పని పరిమితి తీరిపోవడంతో లక్షల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
గ్రామ పంచాయతీలు చేపట్టిన ప్రాజెక్టులు కూడా ఈ నెలాఖరుకు ముగిసిపోనుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉపాధి హామీని రెండొందల రోజులకు పొడిగించి, మరో లక్ష కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రస్తావిస్తోంది. యూపీ, బిహారులకు చెందిన 30 జిల్లాల్లో వలస శ్రామికుల నైపుణ్యాల నమోదును చేపట్టిన కేంద్రం- సమీప ప్రాంతాల్లోని పరిశ్రమలకు వారిని మానవ వనరులుగా అందించే పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల అవసరాలు శ్రామికుల నైపుణ్యాల నడుమ వారధి కాగల పోర్టల్‌ను రూపొందించి దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న యోచన మంచిదే అయినా, పల్లెపట్టుల్లో ఉపాధి దీపం కొండెక్కకుండా కాచుకోవడంపై తక్షణం దృష్టి సారించాలి!