ఏ దేశానికైనా ప్రజారోగ్యమే మహాభాగ్యం. నాణ్యమైన స్వాస్థ్య సేవలే రోగుల్లో ఆరోగ్య ధీమా పెంపొందిస్తాయన్నది అనుభవైకవేద్యం. దేశీయంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించి వాస్తవిక స్థితిగతులు దశాబ్దాలుగా తీవ్ర దిగులు పుట్టిస్తున్నాయి. 1990-2015 సంవత్సరాల మధ్య వైద్యసేవల గతిరీతుల ప్రాతిపదికన అంతర్జాతీయ అధ్యయనంలో భారత్ 154వ ర్యాంకుకు పరిమితమైంది. ఇక్కడితో పోలిస్తే చైనా(48), శ్రీలంక(71), బంగ్లాదేశ్(133) వంటివీ మెరుగ్గా రాణిస్తున్నాయి. తలవంపుల రికార్డు ఇంకా కొనసాగుతూనే ఉంది! సర్కారీ దవాఖానాల్లో చెల్లించే మొత్తానికి నాలుగింతలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూలు చేస్తున్నట్లు 2016నాటి ఆర్థిక సర్వే విశ్లేషించింది. తాజాగా వెల్లడైన డెబ్భై అయిదో జాతీయ నమూనా సర్వే నివేదికాంశాల ప్రకారం- ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య వ్యయానికి ఏడింతల దాకా ప్రైవేటు సంస్థలు దండుకుంటున్నాయి. పౌరుల సొంత ఆరోగ్య వ్యయ అంతర్జాతీయ సగటు సుమారు 18శాతమని, అదే భారత్‌లో చికిత్సకయ్యే ఖర్చులో 63శాతం దాకా జనమే భరించాల్సి వస్తున్నదన్నది పాత లెక్క. దేశంలో 80శాతం కుటుంబాలు ఆస్పత్రి బిల్లుల కోసం పొదుపు మొత్తాల్ని కరిగించేయక తప్పడం లేదని నమూనా సర్వే ధ్రువీకరిస్తోంది. మరో 13శాతం కుటుంబీకులు అప్పుల పైనే ఆధారపడుతుండటం-క్షేత్రస్థాయి స్థితిగతుల్ని కళ్లకు కడుతోంది. కరోనా ప్రజ్వలనం నేపథ్యంలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్ని ఆశ్రయించే సాహసం చేయలేక, ప్రైవేటు వైద్యాలయాల సేవల కోసం బారులు తీరుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న దీనగాథలు- ఆరోగ్య రంగానికి అత్యవసర చికిత్స ఆవశ్యకతను ఎలుగెత్తుతున్నాయి!
ఆరోగ్య సంరక్షణలో స్వస్థతే జాతికి సురక్ష! - INDIA
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ యోజనలకు అన్ని దేశాలూ ప్రాధాన్యమివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. నిజానికి అనేక దేశాలు ఎన్నో దశాబ్దాలుగా సార్వత్రిక స్వాస్థ్య ప్రణాళికలు అమలుపరుస్తూ దీర్ఘకాలిక సత్ఫలితాలు ఒడిసిపడుతున్నాయి. భారత్‌లో మాత్రం ఈ ప్రణాళిక లోపించింది. దేశంలో వైద్య సేవల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెడితేనే దేశంలో అర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ సాకారమవుతుంది!
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ యోజనలకు అన్ని దేశాలూ ప్రాధాన్యమివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెల్లాళ్ల క్రితం పిలుపిచ్చింది. నిజానికి జపాన్(1938), జర్మనీ(1941), బెల్జియం(1945), యూకే(1948), స్వీడన్(1955) ప్రభృత దేశాలు ఎన్నో దశాబ్దాలుగా సార్వత్రిక స్వాస్థ్య ప్రణాళికలు అమలుపరుస్తూ దీర్ఘకాలిక సత్ఫలితాలు ఒడిసిపడుతున్నాయి. చైనా, గ్రీస్, ఇటలీ, హాంకాంగ్ వంటివి విస్తృత ఆరోగ్య రక్షణ పథకాల ద్వారా కుటుంబాల సొంత ఖర్చును గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి. ఆఫ్రికా దేశం ఉగాండా సార్వత్రిక ఆరోగ్య ఛత్రం, మౌలిక వసతుల పరిపుష్టీకరణ, మలేరియా నియంత్రణ ప్రణాళికల దన్నుతో మధ్యాదాయ దేశ హోదా సంతరించుకోవడం ఇటీవలి చరిత్రే! దేశీయంగానూ అటువంటి పరివర్తన, కోట్లాది పేదరోగులకు సాంత్వన- ఆరోగ్య రంగానికి సమగ్ర చికిత్సతోనే సుసాధ్యమవుతాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశాల మేరకు ప్రతి వెయ్యిమందికి ఒక వైద్యుడు ఉండాలి. 135 కోట్ల సువిశాల జనాభా కలిగిన ఇండియాలో ఆ నిష్పత్తి 1:1445గా ఉన్నట్లు కేంద్రమే గత నవంబరులో రాజ్యసభాముఖంగా ప్రకటించింది. ఆ మాటకొస్తే- ఏడున్నర లక్షల మందికి పైగా డాక్టర్ల కొరత, 20శాతం దాకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 30శాతం మేర సామాజిక స్వాస్థ్య కేంద్రాలకు లోటు దేశాన్ని పీడిస్తోంది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీల్నీ పెద్దయెత్తున భర్తీ చేయాల్సి ఉంది. ఇదంతా రాత్రికి రాత్రే సాధ్యపడేది కాదు. జీడీపీలో రెండున్నర శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించి, ఆస్పత్రుల్లో సమస్త మౌలిక సాధన సంపత్తిని సమకూర్చడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏకోన్ముఖ లక్ష్యంతో ముందడుగేయాలి. ఒక్క అమెరికాలోనే భారతీయ మూలాలు కలిగిన వైద్య ప్రముఖులు 80 వేలమంది వరకు ఉన్నారని అంచనా. దేశదేశాల్లో అటువంటి నిపుణుల తోడ్పాటునూ కూడగట్టి, అధికార గణానికి అడుగడుగునా బాధ్యత మప్పినప్పుడే- దేశంలో అర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ సాకారమవుతుంది!