ఖరీఫ్ పంట సాగుపై ఆశ నిరాశల ఊగిసలాటలో కిందుమీదులవుతున్న అన్నదాతమీద అనూహ్యంగా ఎరువుల పిడుగు పడింది. సాధారణంగా రైతులు అధికంగా వినియోగించే డీఏపీ (డై అమ్మోనియం ఫాస్ఫేట్) యాభైకిలోల బస్తా రేటు ఒక్కసారిగా రూ.700 పెంపుదలతో రూ.1900కు చేరనుంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలకూ రెక్కలు మొలుస్తున్నాయి. ఇప్పట్లో ఎరువుల ధరలు పెంచే వీల్లేదన్న కేంద్రం రోజు గడవకముందే నాలుక మడతేసి- అందుబాటులో ఉన్న పాత స్టాక్ ఎరువులకే పాత ధరలు వర్తిస్తాయంటూ చేతులు దులిపేసుకుంది.
రికార్డుల ప్రకారం, పాత నిల్వల రాశి 11.3 లక్షల టన్నులే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఖరీఫ్, రబీలలో కలిపి 31 లక్షల టన్నులకుపైగా అవసరమంటే- దేశవ్యాప్తంగా పాత ధరల రూపేణా సాంత్వన.. పరిమితమే! విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి పదార్థాల ధరవరలు ఇటీవల భారీగా పెరిగిన కారణంగా సవరణ అనివార్యమైందని 'ఇఫ్కో' చెబుతున్నా- ఒక్కుమ్మడిగా ఇలా రేట్ల పెంపు.. సాగుదారులపై పెనుభారం కాక మానదు.
నిబంధనల మేరకు సంచులపై ముద్రిస్తామే తప్ప ఆ రేట్లను రైతులనుంచి వసూలు చేయబోమంటున్నా- భయాందోళనలు ఉపశమించడంలేదు. పెంపుదల భారం రైతన్నమీద పడరాదంటే తనవంతు సబ్సిడీ వాటాను కేంద్రం పెంచాలన్న సూచనలు వస్తున్నాయి. వాటి ఊసెత్తని ప్రభుత్వం- ఎరువుల కంపెనీలు అంతర్జాతీయ విపణినుంచి ఖరీదైన ముడిపదార్థాలు కొనుగోలు చేసేకన్నా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, జీవ ఎరువుల్లాంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్ళాలన్న సలహాతో సరిపుచ్చింది. ఏతావతా, ఈ పెంపుదల మూలాన ఆహారపంటలు పండించే రైతులపై సగటున ఎకరానికి రూ.4000 నుంచి రూ.5000 మేర అదనపు భారం పడనుందంటున్నారు. వాణిజ్య పంటలు సాగుచేసేవారికి మరిన్ని వాతలు తేలక తప్పదు. కూరగాయలు, పత్తి సాగుకు ఎరువుల అవసరం అధికం కాబట్టి- ఆ మేరకు మున్ముందు వినియోగదారుల వీపులపైనా ధరల దరువు అనివార్యం. ఒక్కో ఎరువుల బస్తా రేటు ఉన్నట్టుండి ఇంతగా పెరిగిపోయినా- కనీస మద్దతు ధరలో ఏటా కంటితుడుపు పెంపుదలకే పరిమితమై ఏనాడూ సరైన గిట్టుబాటుకు నోచని రైతన్న గోడు పట్టించుకునేదెవరు?