కొత్త వ్యవసాయ చట్టాల్లో పంటలను మద్దతు ధరకు ఎవరు కొనాలనే అంశంపై స్పష్టత కరవైంది. ఇంతకాలం ఈ బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ఇకమీదట ఏం చేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. 'ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు... రైసుమిల్లరో, పప్పు మిల్లరో కాదు. పంటలను కొనడం ప్రభుత్వ బాధ్యత కాదు' అని తెలంగాణ రాష్ట్ర సర్కారు అధికారికంగా ప్రకటించడం కొత్త చట్టాల అమలు తీరు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర సర్కార్ల ఆదేశాల మేరకు పలు ప్రభుత్వ సంస్థలు నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు పంటలను పరిమితంగానే కొంటున్నాయి. వాస్తవానికి ఈ సంస్థలకు పంటలు కొనుగోలు చేయమని కాగితాలపై ఉత్తర్వులు జారీచేయడమే తప్ప బడ్జెట్లనుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వడం లేదు. బ్యాంకులనుంచి అప్పులు తెచ్చుకుని ఈ సంస్థలు పంటలను కొని రైతులకు డబ్బు చెల్లిస్తున్నాయి. తిరిగి ఆ పంటలను అమ్మి ఏటా వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నా ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆదుకున్న దాఖలాలేమీ లేవు. తాజాగా పంటల కొనుగోలు అంశంపై కొత్త చట్టాల్లో ఏ మాటా లేకపోవడంతో పాటు, ప్రభుత్వాలు ఏ విషయమూ గట్టిగా చెప్పకపోవడం ఈ సంస్థల మనుగడపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
అక్కరకురాని వ్యవస్థలు
ఆహార, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి తదితర 24 పంటలకు కేంద్రం ఏటా మద్దతు ధరలు ప్రకటిస్తోంది. పత్తిని 'భారత పత్తి సంస్థ', పప్పుధాన్యాలు, నూనెగింజలను 'జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య'(నాఫెడ్), వరిధాన్యం, గోధుమలను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్రం ఆదేశాలతో కొంటున్నాయి. మూడేళ్ల క్రితం 'ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్'(పీఎం ఆశ) పథకం కింద పంటలను కొనుగోలు చేసేందుకు కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఒక రాష్ట్రంలో పండిన పంట దిగుబడిలో 25శాతం కొనాలనేది ఈ పథకంలోని నిబంధన. ఇలా పంటలను కొని తిరిగి విక్రయించినందుకు నాఫెడ్ 2015-16లో రూ.12.18 కోట్ల నికరనష్టాల్లో ఉంటే పీఎం ఆశ అమల్లోకి వచ్చాక 2018-19కల్లా రూ.278.31 కోట్ల నికర లాభాల్లోకి వచ్చింది. గడచిన అయిదేళ్ల(2014-19)లో 25.11కోట్ల టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు పండితే 3.6శాతాన్ని (91లక్షల టన్నులు) మాత్రమే మద్దతుధరకు 'నాఫెడ్' కొనుగోలు చేసింది. కేంద్ర సంస్థల తరఫున గ్రామాలకు వెళ్లి పంట కొనేందుకు ప్రతి రాష్ట్రంలో ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య’(మార్క్‌ఫెడ్), పౌర సరఫరాల సంస్థలు ఉన్నాయి. పంట కొనుగోలు చేసిన 72గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేయాలన్నది కేంద్రం నిబంధన. పంటలను విక్రయించిన నెల రోజులదాకా ఆ సొమ్ము రైతుల ఖాతాల్లోకి రావడం లేదు. తక్షణం సొమ్ము అవసరమై పేద రైతులు ఈ జాప్యం, నిబంధనల గోల భరించలేక అప్పటికప్పుడు నగదు ఇచ్చే వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకుని నష్టపోతున్నారు. ఆ వ్యాపారులు అదే పంటను తిరిగి ప్రభుత్వ సంస్థలకు అమ్ముకుని మద్దతుధరలు పొందుతున్నారు. దేశంలో ఏ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఏర్పాటు లక్ష్యాలను చూసినా రైతులకు సేవలందించడానికి, పంటలను కొనడానికేనని కాగితాల్లో ప్రభుత్వాలు రాశాయి. కానీ పలు రాష్ట్రాల్లో మార్క్‌ఫెడ్‌లు ప్రభుత్వ అనుమతి లేకుండా పంటలు కొనడం లేదు. నిబంధనల ప్రకారం అవి స్వతంత్ర సంస్థలు. ప్రాథమిక వ్యవసాయ సంఘాల(ప్యాక్స్) పాలకవర్గాలకు ఎన్నికైన రైతులే మార్క్‌ఫెడ్ పాలకవర్గంలో ఉంటారు. అంటే రైతులే నడుపుతున్న ఈ సంస్థలు పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అడగాల్సిన అవసరమేమిటి? అనుమతి లభించకపోతే పంటలను ఇవి అసలు కొనుగోలు చేయడమే లేదు. ఇలా అయితే ఇవి రైతులకేం సాయం చేస్తున్నట్లు? నెలరోజులుగా దిల్లీ రోడ్లపై పంజాబ్ రైతులు మద్దతు ధర, వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ధర్నాలు చేస్తున్నారు. పంజాబ్ మార్క్‌ఫెడ్ నిరుడు, ఈ ఏడాది కలిపి 58.38 లక్షల టన్నుల గోధుమలు, 41.70 లక్షల టన్నుల వరిధాన్యాన్ని మద్దతు ధరకు కేంద్రం తరపున మాత్రమే కొనుగోలు చేసింది. సొంతంగా ఏమీ కొనలేదు. తెలంగాణ మార్క్‌ఫెడ్ కూడా కేంద్రం, రాష్ట్రం తరపున పలు పంటలను కొని ఇప్పటికే రెండు వేల కోట్ల నష్టాలను చూపుతోంది. ఛత్తీస్‌ఘఢ్ మార్క్‌ఫెడ్ రూ.950 కోట్ల నష్టాలను మూటగట్టింది. ఇలా పలు రాష్ట్రాల మార్క్‌ఫెడ్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి మేరకే పంటలను కొని నష్టాలు చూపుతున్నాయి. ఒక పంటను కొనమని అనుమతించే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుకు నిధులు మాత్రం మార్క్‌ఫెడ్లకు ఇవ్వడం లేదు. బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోవడానికి పూచీకత్తు ఇస్తున్నాయి. పంటలను తిరిగి విక్రయించి ఆ అప్పు చెల్లించాలని ఆ లోగా వడ్డీలు, గోదాముల్లో వాటి నిల్వకు, రవాణాకయ్యే ఖర్చులు భరిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. చివరికి ఆ ఖర్చులన్నీ కలిపితే పంట ధర మరింత పెరిగి ఖర్చుల మేర రాకపోవడంతో మార్క్‌ఫెడ్లు నష్టపోతున్నాయి. ఆ నష్టాలను గానీ, వడ్డీ, గోదాముల అద్దె, రవాణా ఖర్చులనుగానీ రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయడం లేదు. ఆ సొమ్ములన్నీ రాలేదని నష్టాల కింద చూపుతున్నారు. గడచిన మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌తో మొక్కజొన్నలు కొనిపించింది. వాటిలో కొంత పంటను దాణాకింద కోళ్లఫారాలను చాలా తక్కువ ధరకు రాయితీపై ఇచ్చింది. అప్పులపై వడ్డీలు, ఇతర ఖర్చుల నిధులూ మార్క్‌ఫెడ్‌కు తిరిగి ఇవ్వలేదు. మిగిలిన మొక్కజొన్నలను తక్కువ ధరలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మార్క్‌ఫెడ్ మార్కెట్లో అమ్మేసింది. ఈ వ్యవహారంలో రూ.1590 కోట్ల నష్టం వచ్చింది. ఇలా నష్టాలకు పంటలను వచ్చే ఏడాది కొనలేం అని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నష్టాలను చూపి మొక్కజొన్న పంటనే వేయవద్దని ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు సూచించింది. కోళ్లఫారాలకు తక్కువ ధరలకు రాయితీపై ఇస్తే, అప్పులపై వడ్డీలు, గోదాముల అద్దె, రవాణా ఖర్చుల నిధులను ప్రభుత్వం తిరిగి ఇవ్వకపోతే ఏర్పడిన లోటును మార్క్‌ఫెడ్ నష్టం కింద ఎలా చూపుతారు? దేశవ్యాప్తంగా ఇలా ప్రభుత్వాల కనుసన్నల్లో పనిచేస్తున్న మార్క్‌ఫెడ్లు నష్టాల్లో ఉన్నట్లు లెక్కలు చూపుతూ పంటలను కొనకుండా వాటి ఏర్పాటు లక్ష్యాలను గాలికొదిలేస్తుండటం సహేతుకం కాదు.
నిబద్ధత అవసరం
పంటలను మార్కెట్లో ప్రభుత్వాలు కొనడం మొదలు పెడితే పోటీ ఏర్పడి వ్యాపారులు ధర పెంచుతారు. అది జరగాలంటే మార్క్‌ఫెడ్లు స్వతంత్రంగా పనిచేయాలి. వాటికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు సమకూర్చి నిపుణులతో నడిపిస్తే సరిపోతుంది. మార్కెట్ ధరలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయనే అంచనాలిచ్చే మార్కెటింగ్ నిఘా విభాగాలను ఏర్పాటు చేయాలి. ఒకసారి మద్దతు ధరలకు కొన్న పంటలను తిరిగి మార్కెట్లో విక్రయించి లాభపడేలా మార్క్‌ఫెడ్‌లు పనిచేయాలి. గ్రామాల్లో రైతులకు దగ్గరగా ఉండే 'ప్యాక్స్' సైతం పంటలను కొని ఉత్పత్తుల తయారీ వ్యాపారాలు చేస్తే వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రతి పంటను సీజన్ ముగిసేదాకా మద్దతుధరలకు కొని- తీరా కొత్త సీజన్‌లో పంటను మార్కెట్లోకి రైతులు తీసుకువచ్చే సమయానికి పాత పంటను తక్కువ ధరలకు విక్రయిస్తున్న విధానాలు మారాలి. దీనివల్ల కొత్త పంటలకూ ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తులను తయారుచేసి ప్రజలకు, వ్యాపారులకు అమ్మితే లాభాలొస్తాయి. ఇప్పటికే గుజరాత్ మార్క్‌ఫెడ్ ఇలా వేరుసెనగ నూనె, పల్లీలు తదితర అనేక ఉత్పత్తులతో లాభాలార్జిస్తోంది. పంటల ఉత్పత్తులను రేషన్‌కార్డులపై పేదలకు విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే మార్క్‌ఫెడ్‌లకు అతి పెద్ద వ్యాపారం లభించి లాభాలొస్తాయి. నిరుడు కేంద్రం మద్దతు ధరలకు కొన్న కందులను పప్పుగా మార్చి రేషన్‌కార్డులపై అమ్మేందుకు ఇలాగే అనుమతించగా 19 రాష్ట్రాలు 8.70 లక్షల టన్నులు కొని పేదలకు అమ్మాయి. మార్కెట్‌లో అమ్మే కందిపప్పు ధరకన్నా కిలోకు రూ.15 తగ్గించడంతో పేదలకు సులభంగా పప్పులు అందాయి. దీనివల్ల వారికి తక్కువ ధరలకు పోషకాహారం, 'నాఫెడ్'కు లాభాలు, రైతులకు మద్దతు ధర దక్కాయి. ఇలా బహుముఖ వ్యూహంతో పంటలు కొని, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసే వ్యాపార సంస్థలుగా మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల సంస్థ వంటివి నిపుణులతో కలిసి పనిచేస్తే నష్టాలనేవి ఉండవు. దేశంలోని 130కోట్ల జనాభాకే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆహారోత్పత్తులకు ఎంతో డిమాండు ఉంది. అయినా పరిమితంగా పంటలను కొనడానికీ నిధులు లేవని, వాటిని తిరిగి అమ్మితే నష్టాలొస్తున్నాయని లెక్కలు చూపడం వైఫల్యాలకు నిదర్శనం. రైతులను ఆదుకోవాలని, పేదలకు పోషహాకారం తక్కువ ధరలకు అందించాలనే చిత్తశుద్ధి, సరైన వ్యూహాలుంటే ఈ దేశంలో మద్దతుధరలకు పంటలు కొనడం ఏమాత్రం కష్టం కాదని పాలకులు గుర్తించాలి.
భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)
భారత ఆహార సంస్థల చట్టం-1964 ప్రకారం దేశ ఆహార విధానాలు, అవసరాల మేరకు పనిచేసే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయడం ఈ సంస్థ బాధ్యత. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారధాన్యాల పంపిణీ, దేశ ఆహార భద్రత దృష్ట్యా అత్యవసర వినియోగానికి సరిపోయిన ధాన్యం నిల్వ చేయడం ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు. రైతుల అవసరాల ప్రాతిపదికగా కన్నా- కేంద్రం అనుమతులమేరకే ఈ సంస్థ పంటలు కొనుగోలు చేస్తోంది. కేవలం నాలుగైదు రాష్ట్రాలకే కట్టుబడి వరి, గోధుమలు కొనేందుకు ఇది పరిమితమైంది.