కట్టు తప్పి రెచ్చిపోతున్న వాయుకాలుష్యం మూలాన, అధికారిక గణాంకాల ప్రకారమే- ఏటా 12 లక్షలకు పైగా నిండు ప్రాణాలు కడతేరిపోతున్న దేశం మనది. ఊపిరి నిలపాల్సిన గాలే కర్కశంగా ఆయువు తోడేసే దురవస్థను చెదరగొట్టేందుకు ఉద్దేశించిందే ఎన్‌క్యాప్(జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం). 2017నాటి కాలుష్య స్థాయి ప్రాతిపదికన 2024 సంవత్సరం నాటికి 20-30 శాతం మేర తగ్గింపును సాధించాలన్న ఆ కార్యక్రమ మౌలిక ధ్యేయాన్ని సహేతుకంగా ప్రక్షాళించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) గతంలోనే పిలుపిచ్చింది. ప్రవచిత లక్ష్య సాధనే కష్టతరమని, ఒక దశకు మించి కాలుష్య నియంత్రణ ఆచరణాత్మకం కాదన్న కేంద్ర పర్యావరణఅటవీ మంత్రిత్వ శాఖ బాణీని ఎన్‌జీటీ తాజాగా తూర్పారపట్టడం సమంజసమే. గాలి నాణ్యత పరంగా 180 దేశాల జాబితాలో అట్టడుగు వరసన భారత్ కుములుతోంది. ఈ అప్రతిష్ఠను తుడిచిపెట్టే కృషిలో భాగంగా 122 నగరాల్లో వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల్ని 2020 నవంబరులోగా నెలకొల్పాలని లోగడ ఆదేశించిన ట్రైబ్యునల్- ఇప్పటినుంచి ఆరు నెలల్లో మొత్తం పని పూర్తి కావాలంటోంది! కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోని 46 నగరాలే కొద్దిపాటి చొరవ కనబరుస్తున్నాయని, నిర్దేశాల్ని తుంగలో తొక్కిన నగరాలు పశ్చిమ్ బంగ, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, ఒడిశాలలో అధికంగా పోగుపడ్డాయన్న విశ్లేషణల దృష్ట్యా కొన్నాళ్లుగా ట్రైబ్యునల్ అసహనం వ్యక్తపరుస్తోంది. అవసరానుగుణంగా వ్యూహాల్లో దిద్దుబాట్ల సంగతిని గాలికొదిలేసి కాలుష్య నియంత్రణ ప్రణాళికను జావగార్చే ఉదాసీనత పర్యావరణ శాఖలో ఎగదన్నడం క్షమార్హం కాదు. రాజ్యాంగ స్ఫూర్తి కొల్లబోతోందన్న ట్రైబ్యునల్ ఆగ్రహం సకారణమైనా, కేవలం గడువు పొడిగింపుతోనే పరిస్థితి చక్కబడే అవకాశం లేనే లేదు!
ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం.. పట్టించుకునేదెప్పుడు? - కాలుష్యం
దేశంలో వాయుకాలుష్యం కారణంగా ఏటా 12లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాలి నాణ్యత పరంగా 180 దేశాల జాబితాలో అట్టడుగు వరసన భారత్ కుములుతోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు 122 నగరాలను ఎంపిక చేసి వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. కానీ 46 నగరాలే కొద్దిపాటి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపడితేనే ప్రాణాలు నిలుస్తాయి.
ప్రజాబాహుళ్యం ఆయుర్దాయానికి తూట్లు పొడుస్తున్న వాయుకాలుష్యాన్ని 'ఇక సహించేది లేదు' అని ప్రధాని మోదీ సమరభేరి మోగించగా, అత్యవసర కార్యాచరణ ప్రణాళికల్ని 'నీతి ఆయోగ్' క్రోడీకరించింది. దేశంలో మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలు 'గ్యాస్ ఛాంబర్ల'ను తలపిస్తున్నా- ఎంపిక చేసిన 122 నగరాల్లోనైనా నిర్దిష్ట ప్రణాళిక అమలు ఎందుకు చురుకందుకోలేదు? కాలుష్య కట్టడికి వివిధ నగరాల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) అమలు బాధ్యతను రాష్ట్ర స్థాయి పొల్యూషన్ బోర్డులకు బదలాయించింది. నగరాల వారీగా ఇదమిత్థంగా ఎప్పటిలోగా ఏమేమి సాధించాలన్న స్పష్టత లేకపోవడం, ప్రత్యేక చట్టబద్ధ కట్టుబాటు కొరవడటం, రకరకాల విభాగాల నిష్పూచీతత్వం తదితరాల వల్ల నేడింతటి దుర్దశ దాపురించింది. ఇటువంటప్పుడు 'ఫలానా గడువులోగా చేయకపోయారో...' అంటూ ఎన్‌జీటీ కొరడా ఝళిపించినంత మాత్రాన జరిగేదీ ఒరిగేదీ ఏముంది?'కా'(క్లీన్ ఎయిర్ యాక్ట్) పేరుతో శాసనాన్ని ఏనాడో రూపొందించిన అమెరికా- ఎప్పటికప్పుడు నిబంధనల్ని కట్టుదిట్టం చేస్తూ ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. 1970 లగాయతు కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ సహా ఆరు రకాల ఉద్గారాలు 77శాతం మేర అక్కడ తగ్గాయంటే- యంత్రాంగం నిబద్ధతే ప్రధాన కారణం. ఆస్ట్రియా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, సింగపూర్ తరహాలో కాలుష్యకారక వాహనాలపై భారీ జరిమానాల విధింపు, అటవీ ప్రాంతాల సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థ అవతరణ, కలుషిత పరిశ్రమల కట్టడికి చైనా నమూనా... చాలాచోట్ల దస్త్రాలకే పరిమితమవుతున్న ఇండియాలో- రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కు దిక్కులేనిదవుతోంది. అసంఖ్యాక జీవితాలిలా పొగచూరిపోకుండా కాలుష్యకారక సంస్థలపై ఉక్కుపాదం మోపి- కార్యాలయాల చేరువలో జనావాసాలు, ప్రజారవాణా విస్తృతీకరణల్ని సాకారం చేస్తేనే... దేశంలో వాయునాణ్యత మెరుగుపడుతుంది!