దేశంలో ఆర్థిక అసమానతలు ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరాయి. స్వాతంత్య్రం అనంతరం ఆర్థిక- సామాజిక సూచీల్లో దేశం ఎంతో పురోగతి సాధించింది. మూడు దశాబ్దాల క్రితం మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల జాతీయ ఆదాయ వృద్ధి రేట్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. పేదరికం సైతం అంతకు ముందున్న దానికంటే సగానికి తగ్గింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అసమానతలు పెచ్చుమీరాయి. అమెరికా, చైనాల తరవాత అత్యధిక సంఖ్యలో శతకోటీశ్వరులు భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత పేదల్లోనూ ఇండియా వాటా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2017లో అత్యంత పేదరికంలో ఉన్న జనాభా దాదాపు 68.9 కోట్లు. అందులో 20.17శాతం భారత్‌లోనే నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.8శాతమే!
నానాటికీ అధికం
అభివృద్ధి అన్నది ఆర్థిక అసమానతల పెరుగుదలకు దారితీస్తుందని నోబెల్ పురస్కార గ్రహీత సైమన్ కుజ్నెట్స్ పేర్కొన్నారు. అదిప్పుడు భారత్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సాధారణంగా అభివృద్ధి ప్రారంభ దశల్లో కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ధనవంతులు వాటిని సమర్థంగా వినియోగించుకుంటారు. అదే సమయంలో నైపుణ్యం లేని కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారి వేతనాల్లో కోత పడుతుంది. ఫలితంగా అసమానతలు పెరుగుతాయి. భారత్‌లో సరిగ్గా ఇదే జరిగింది. దేశంలో సరళీకృత విధానాల అమలు తరవాత ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. దుర్భర దారిద్య్రం వేగంగా తగ్గింది. ఆదాయ అసమానతలు మాత్రం పెరిగాయి. దీనికి భారత్‌లో విస్తృతంగా ఉండే ఇతర అసమానతలు తోడయ్యాయి.
దేశంలో ఆదాయం, ఆస్తులు, అవకాశాలు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యాయి. 1991 నుంచి అసమానతల్లో అధిక పెరుగుదల కనిపించింది. ఫలితంగా ప్రపంచంలో ఎక్కువగా ఆర్థిక అసమానతలున్న దక్షిణాఫ్రికా, జాంబియా వంటి దేశాల సరసన ఇండియా నిలుస్తోంది.
శ్రామిక విపణిలో 1991 తరవాత మూలధన వాటా పెరిగింది. శ్రామిక వాటా తగ్గింది. ఈ మార్పుల వల్లే అసమానతలు అధికమయ్యాయి. లాభం రేటులో పెరుగుదల వేతన వాటా క్షీణతకు తోడైంది. దీనికి విద్య, ఆరోగ్యం వంటి ప్రజాసేవలను పొందడంలో ఉన్న అసమానతలు తోడయ్యాయి. దేశంలో బలమైన మార్కెట్ నిబంధనలు ఉన్న సమయంలో ఎగువ వర్గాల ఆదాయాలు తక్కువగానే ఉండేవి. నూతన ఆర్థిక విధానాలు ప్రజల నిజ ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధి అన్ని వర్గాలకూ సమానంగా పంపిణీ కాలేదు. 1950-80 దశకాల్లో భారత ఆర్థిక వ్యవస్థ సగటున కేవలం 3.5శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జనాభాలో 0.5శాతం కంటే తక్కువ మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు.
1990 దశకం చివరి నాటికి అది మూడు శాతానికి, 2018-19 నాటికి 4.18శాతానికి చేరింది. దేశ జనాభాలో ఒకశాతమే ఉండే అత్యంత సంపన్నవర్గం, 2014-15 లెక్కల ప్రకారం జాతీయ ఆదాయంలో 21.3శాతాన్ని సొంతం చేసుకుంది. దేశంలో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరేవారి సంఖ్య మొదటి నుంచీ తక్కువగానే ఉంది. ఫలితంగా పేద వర్గాల్లో జన్మించిన వారు అలాగే మిగిలిపోతున్నారు. ఇది అసమానతలు కొనసాగడానికి దారితీస్తోంది.
వినియోగంలో సైతం పెద్దయెత్తున అసమానతలున్నాయి. 2011-12లో భారత్ మొత్తం వినియోగంలో దాదాపు 45శాతం... 20శాతంగా ఉన్న ధనవంతులదే. గత ముప్ఫై ఏళ్లలో అగ్రశ్రేణి ఆదాయాల వాటాలో ఇండియా అత్యధిక పెరుగుదల నమోదు చేసింది. పై స్థాయిలో ఉన్న 10శాతం వాటా 1980-2016 మధ్య 31శాతం నుంచి 56శాతానికి పెరిగింది.