ఈశాన్యంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య బహిరంగంగానే ఘర్షణ జరుగుతోంది. ఈ పరిస్థితులు ఈశాన్య భారతదేశంలో తీవ్రవాద కదలికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసోం, మణిపుర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని వేర్పాటువాదుల విషయంలో చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
దశాబ్దాలుగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి పూర్తిగా బలహీనపడిపోయిన ఈ తిరుగుబాటు దళాలు... చైనా సహాయం అందితే మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉంది.
ఈశాన్య భారతదేశంలో చైనా తన కార్యకలాపాలు పెంచుకుంటోందని చెప్పడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. వేర్పాటువాదులకు చైనా పరోక్ష సహాయం, సరిహద్దు వెంబడి బలగాల మోహరింపు, జాతి వివక్ష పేరిట సమస్యలకు ఆజ్యం పోయడం వంటివి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
1. సైన్యాన్ని మోహరించడం
ఇరు దేశాలు వివాదాస్పద సరిహద్దుల వెంబడి తమ సైన్యాన్ని భారీ సంఖ్యలో మోహరిస్తున్నాయి. ఘర్షణ వాతావరణం తలెత్తిన ప్రాంతాల్లోకి రోడ్డు, వాయు మార్గంలో సైనికులను తరలిస్తున్నాయి.
భారత్‌తో ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు వెంట వీలైనన్ని సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు చైనా వ్యూహాత్మక రచనలు చేస్తోంది. తద్వారా భారత సైన్యం అన్ని వైపులా విస్తరించి బలహీనపడుతుందని పన్నాగాలు పన్నుతోంది.
ప్రస్తుతం ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న ఈ ఘర్షణలు అరుణాచల్ ప్రదేశ్‌కు వ్యాపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను తమ పరిధిలో ఉన్న టిబెట్‌లో అంతర్భాగంగా పరిగణిస్తోంది చైనా. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు ప్రారంభించడాన్నీ కొట్టిపారేయలేం.
భారత్ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తూనే... సైన్యాన్ని, రక్షణ సామగ్రిని తరలిస్తోంది. ఉత్తర సరిహద్దులో ఉన్న కొద్దిపాటి సైనికులకు సహాయంగా మరింత సైన్యాన్ని మోహరిస్తోంది.
2. తిరుగుబాటుదారులతో సంబంధాలు
ఈశాన్య తిరుగుబాటుదారులకు చైనాకు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఉన్న ఈ తిరుగుబాటుదారుల ద్వారా చైనా తన ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.
ఆయుధ శిక్షణతో పాటు చైనా అధికారులు, సైన్యంతో సంబంధాలు పెంచుకోవడానికి 1967లో తొలిసారి 133 మంది నాగా తిరుగుబాటుదారుల బృందం డ్రాగన్ దేశానికి బయలుదేరింది. అత్యంత కష్టతరమైన మార్గం గుండా చైనాకు చేరుకుంది. ఆ తర్వాతి కాలంలో మరెన్నో బృందాలు చైనాకు వెళ్లాయి.
అదే విధంగా అసోంకు చెందిన యూఎల్ఎఫ్ఏ, మణిపుర్‌కు చెందిన మెయితెయి తిరుగుబాటుదారులు సైతం చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పర్చుకునేందుకు ప్రయత్నించారు. ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
అసోం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(యూఎల్ఎఫ్ఏ) చీఫ్ కమాండర్ పరేష్ బారువా చైనాలోనే ఉంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యున్నాన్ రాష్ట్రంలోని సరిహద్దు పట్టణమైన 'రుయిలి' అనే ప్రాంతంలో పరేష్ తలదాచుకుంటున్నట్లు భావిస్తున్నారు. అక్కడి నుంచి తరచుగా మయన్మార్ అటవీ ప్రాంతంలో ఉన్న తమ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నట్లు సమాచారం.
నాగా ఉద్యమకారులు సైతం ఒకానొక సమయంలో చైనా సహాయం కోసం ప్రయత్నించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన తిరుగుబాటు సంస్థలన్నీ తొలినాళ్లలో చైనా అధికారుల సహాయాన్ని అర్థించినవే. అయితే వీరికి చైనా బహిరంగంగా సహాయం ప్రకటించకపోయినా.. పరోక్షంగా మేలు చేసింది. చైనాకు సంబంధం లేని వ్యక్తుల నుంచి ఆయుధాల సేకరించడంలో సహాయపడింది.