కరోనాపై సమరం... ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటి తొలి ప్రాధాన్యాంశం ఇదే. చైనా విషయంలో మాత్రం భిన్నం. 'ఆధిపత్యం' ఆకాంక్షలకే అగ్రాసనం వేస్తూ దురాక్రమణ అజెండా అమలు చేస్తోంది ఆ దేశం. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్నీ ఇందుకు అనువుగా మార్చుకుంటోంది. దేశీయ సమస్యలతో అగ్రరాజ్యం అమెరికా సతమతమం అవుతున్న వేళ... మరింత దూకుడు పెంచింది. భారత సరిహద్దులో ఉన్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుయుక్తులు సాగిస్తోంది.
1962 వ్యూహం
సరిగ్గా 1962లో అవలంబించిన వ్యూహాన్నే చైనా తాజాగా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో అమెరికా, రష్యా మధ్య క్యూబా సంక్షోభం తలెత్తిన సమయంలోనూ చైనా ఈ దుందుడుకు వైఖరే ప్రదర్శించింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద అణ్వాయుధ దేశాలు సంఘర్షణలో ఉంటే.. చైనా తన ప్రాదేశిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు కుటిల ప్రణాళికలు రచించింది.
క్యూబాలో క్షిపణుల మోహరింపు విషయమై అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రారంభమైన వివాదం 1962 అక్టోబర్ 16న పూర్తి స్థాయి ప్రతిష్టంభనగా మారింది. ఇదే అదనుగా భావించి సరిగ్గా నాలుగు రోజుల తర్వాత భారత్‌పై దాడికి పాల్పడింది చైనా. దీంతో అటు అమెరికా గానీ.. ఇటు సోవియట్ గానీ భారత్- చైనా యుద్ధంలో జోక్యం చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి.
క్యూబాను నావికా దళంతో దిగ్బంధించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ 1962 అక్టోబర్ 22న ఆదేశాలు జారీ చేశారు. సోవియట్ యూనియన్‌తో జరిగిన విస్తృతమైన చర్చల ఫలితంగా అదే ఏడాది నవంబర్ 21న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ సమయంలోనే చైనా తన ప్రణాళికలను అమలు చేసింది. అక్టోబర్ 20న యుద్ధం ప్రారంభించిన డ్రాగన్... నవంబర్ 21న కాల్పుల విరమణ ప్రకటించింది.
అధ్యక్షుడి ఆదేశాలతోనే...!
ప్రస్తుత పరిణామాలన్నీ పరిశీలిస్తే ఇవన్నీ ఒక్కసారిగా జరిగినవి కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉన్నత స్థాయి నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి పక్కా ప్రణాళికతో చైనా సైన్యం రూపొందించిన ఎత్తుగడ అని చెబుతున్నారు.
"ఈ చొరబాట్లు, ప్రతిష్టంభన, ఘర్షణలు, ప్రాణనష్టం... ఇవన్నీ యాదృచ్ఛికంగా సంభవించినవి కాదు. ఉద్రిక్తతల స్థాయి, సమయం సహా ఇతర అంశాలు పరిశీలిస్తే.. పక్కా సమన్వయంతో చేసిన పని అని అర్థమవుతోంది. ఇది సరిహద్దులో జరుగుతున్న స్థానిక వివాదం కాదు. పైనుంచి సమ్మతి లేకుండా ఇంత భారీ స్థాయిలో ఘర్షణలు జరిగే అవకాశమే లేదు."
-విష్ణు ప్రకాశ్, భారత మాజీ రాయబారి
ఈ ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పొరుగున ఉన్న అన్ని దేశాలతో చైనా అతిక్రమణలకు పాల్పడుతోందని గుర్తు చేశారు ప్రకాశ్.
అదను చూసి..