స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలని భారత్ కలలు కంటోంది. ఈ లక్ష్యసాధనలో భాగంగా దేశంలోని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చింది. డీఆర్‌డీఓ కింద 50 పరిశోధనశాలలను ఏర్పాటు చేసింది. మరో 150 వరకు ప్రైవేటు కంపెనీలూ సహకరిస్తున్నాయి. అణు జలాంతర్గామి, నాలుగోతరం యుద్ధవిమానం, ప్రధాన యుద్ధట్యాంక్, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను సొంతంగా తయారు చేసుకొనే శక్తి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ 'స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ(సిప్రి)' లెక్కల ప్రకారం 2016-20 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ 9.5శాతం వాటాతో రెండోస్థానంలో ఉందని విస్మరించరాదు. గతంతో పోలిస్తే దిగుమతుల శాతం తగ్గడం ఒక్కటే ఊరట. ఇక ఆయుధ ఎగుమతుల్లో 0.3శాతం వాటాతో 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
మిత్రదేశాల సహకారం అవసరం
రక్షణ రంగంలో సాంకేతికతకు చాలా విలువ ఉంటుంది. కేల్కర్ కమిటీ సూచనలతో 2005 నుంచి రక్షణ రంగ కొనుగోళ్లలో ఆఫ్‌సెట్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాటిప్రకారం భారత్‌లో విడిభాగాల తయారీ, మరమ్మతులకు అవసరమైన వనరుల అభివృద్ధి తదితరాలకు ఆయుధ విక్రేతలు పెట్టుబడులు వెచ్చించాలి. సాంకేతికత బదలాయింపులతో ముడివడిన ఈ నిబంధన సక్రమంగా అమలు కావడంలేదు. ప్రస్తుతం 'ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాల' విషయంలో ఈ నిబంధనలను మినహాయించారు. గతంలో పలు ఆఫ్‌సెట్ నిబంధనల విషయంలో చోటుచేసుకొన్న జాప్యంపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌కు చెందిన 11 కంపెనీలను భారత ప్రభుత్వం హెచ్చరించింది. బంగారు బాతులా ఆదాయాన్నిచ్చే సాంకేతికతను- ఇతరులతో పంచుకొనేందుకు విదేశీ ఆయుధ కంపెనీలు సుముఖత చూపడంలేదు. భౌగోళిక రాజకీయాల్లో సాంకేతికత చేజారితే, వ్యూహాత్మక ఆధిపత్యాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని తొషిబా-కాంగ్స్‌బెర్గ్ ఘటన దీనికి నిదర్శనం. నాటి అమెరికా అణు జలాంతర్గాములతో పోలిస్తే రష్యా ఉత్పత్తులు భారీ శబ్దం చేసేవి.
సాంకేతికతను ఒడిసిపట్టాలి
యుద్ధరంగాల్లో మారుతున్న పరిస్థితులను ఆకళించుకుని విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం.. ఇప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతికతను రక్షణ రంగానికి అన్వయించడం సమాంతరంగా జరుగుతూ ఉండాలి. పౌర-రక్షణ అవసరాలు తీర్చేలా కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేసుకొంటే భవిష్యత్తులో అవి ఆర్థికంగా భారం కావు. మనం నిత్యం వినియోగించే జీపీఎస్, మైక్రోవేవ్‌వంటి సాంకేతికతలు ఇలా పుట్టినవే. అమెరికా, రష్యా, ఐరోపా సంఘం, ఇజ్రాయెల్ ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ అవసరాలకు వాడుకోవడంలో ముందున్నాయి. భారత్ మాత్రం ఇతరులు అన్వయించిన విధానాలను అనుకరించే దశలోనే ఉండటం అపకీర్తికి కారణమవుతోంది.
ఆ సమయంలో అమెరికా మిత్రదేశాలైన జపాన్ నార్వేలకు చెందిన తొషిబా-కాంగ్స్‌బెర్గ్ సంస్థలు కంప్యూటర్ ఆధారిత మిల్లింగ్ యంత్రాలను రెండో కంటికి తెలియకుండా రష్యాకు విక్రయించాయి. ఆ యంత్రంతో అతితక్కువ శబ్దం వచ్చేలా సబ్‌మెరైన్ ప్రొపల్షన్ బ్లేడ్ తయారు చేయవచ్చు. ఆ తరవాత కొన్నేళ్లలోనే రష్యా సబ్‌మెరైన్లు నిశ్శబ్దంగా అమెరికా జలాంతర్గామికి 10 నాటికల్ మైళ్ల సమీపానికి చేరే సామర్థ్యం సంపాదించాయి. నాలుగోతరం యుద్ధవిమానంగా పేర్కొనే తేజస్ ప్రాజెక్టు భారత్‌లో 1983లో పట్టాలకెక్కింది. తరవాత ఏడేళ్లకు తేలికపాటి యుద్ధవిమానం తేజస్ వినియోగంలోకి వచ్చింది. 1983లో అమెరికా తొలి 'స్టెల్త్ జెట్ ఎఫ్117'ను వినియోగంలోకి తెచ్చి, 2008లో దానికి 'రిటైర్మెంట్' ప్రకటించింది. ఇప్పుడు చైనా స్టెల్త్ జెట్‌లు వాడుతోంది. ఇది మన రక్షణ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని, దార్శనికత లోపాన్ని ప్రతిబింబిస్తోంది. యుద్ధక్షేత్రాల్లో నేరుగా పనిచేసే దళాలు ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములైతేనే మెరుగైన ఫలితాలు ఉంటాయి. భారత్ నేవీ 'డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్' సాయంతో ఈ విధానాన్ని అమలుచేసి మెరుగైన ఫలితాలను సాధించింది. రక్షణ రంగ అంకురాల సృష్టి కోసం ఇజ్రాయెల్ 'టాల్పియోట్' పేరిట ప్రతిభావంతులను ఎంపిక చేసి, వారికి ఆధునిక సైనిక విధుల్లో కఠిన శిక్షణ ఇస్తోంది. కొన్నేళ్ల తరవాత వారు బయటికి వచ్చి అంకుర సంస్థలను ప్రారంభించి రాణిస్తున్నారు.