తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'బాయ్​కాట్​ చైనాతో మేక్ ఇన్​ ఇండియాకు దెబ్బ!' - సుంజోయ్ జోషి

చైనాతో ఉద్రిక్త పరిస్థితులు మధ్య ఒక్కసారిగా ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించడం సాధ్యం కాదని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్​ ఛైర్మన్ సంజయ్ జోషి అభిప్రాయపడ్డారు. రాత్రికి రాత్రే సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కుదరదని ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో విశ్లేషించారు. చైనాను ఎదుర్కోవడానికి దీర్ఘకాల వ్యూహాలు రచించాలని ప్రభుత్వానికి సూచించారు.

Chairman, ORF
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్

By

Published : Jul 2, 2020, 1:16 PM IST

చైనా సంస్థలకు చెందిన 59 మొబైల్ యాప్స్​పై కేంద్రం నిషేధం విధించడం ఆ దేశానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతీకార చర్యగా కనిపిస్తోందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్​ ఛైర్మన్ సంజయ్ జోషి అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కోవడానికి దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముందని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఒక్కసారిగా సరఫరా గొలుసు(సప్లై చైన్)ను మార్చేయడం కుదరదని, చైనాలో తయారైన ఉత్పత్తులను తక్షణమే నిషేధిస్తే.. మేక్ ఇన్ ఇండియాపై ప్రభావం పడుతుందని అన్నారు జోషి. ప్రభుత్వం కూడా ఇలా చేస్తుందని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థతో చైనా లోతైన సంబంధాలు కలిగి ఉందన్నారు. బైడూ, పేటీఎం వంటి సంస్థల్లో చైనా పెట్టుబడులు భారీగా ఉన్నాయని గుర్తు చేశారు. పొరుగుదేశాలతో వ్యూహాత్మక యుద్ధం చేసినా.. వ్యూహాత్మక సంబంధాలు నెలకొల్పాలనుకున్నా.. సుదీర్ఘ సమయం పడుతుందని స్పష్టం చేశారు.

సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో జోషి ఇంటర్వ్యూ

"కరోనా వ్యాప్తి మొదలైన తర్వాతే ప్రపంచ దేశాలు దీనిపై దృష్టిసారించాయి. ఒకే దేశంపై, ముఖ్యంగా చైనాపై అతిగా ఆధారపడటం మంచిది కాదని గ్రహించాయి. అలాంటి దేశాల నుంచి సప్లై చైన్​ను తగ్గించాలని చూస్తున్నాయి. దీనికి దాదాపు 3 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని చాలా మందికి తెలుసు. ఇప్పుడు భారతదేశానికి చాలా అవకాశఆలు ఉన్నాయి. వాటికోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాలి."

-సంజయ్ జోషి, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్

చైనాపై ఆధారపడటం తగ్గించి తైవాన్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు జోషి. ఈ ఎగుమతులపైనా చైనా ముద్ర ఉంటుందని చెప్పారు. ప్రాణాలతో పాటు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిన ఈ కరోనా పరిస్థితుల్లో చైనా పట్ల వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. లేదంటే భారత్​ ఆర్థిక వ్యవస్థపై మరింత దెబ్బ పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఫార్మా రంగానికి కావాల్సిన ఉత్పత్తుల్లో 70 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ఎందుకు చైనా నుంచే ఎక్కువగా వస్తున్నాయనేది మనం ఎప్పుడో ప్రశ్నించుకోవాల్సింది. ఇప్పుడు దానికి గురించి ఆలోచించి ఒకేసారి నిషేధం విధిస్తామంటే కుదరదు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికీ ఇదే వర్తిస్తుంది. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాల్సిన సమయంలో ఒకవేళ వీటిపై నిషేధం విధిస్తే.. చైనా కన్నా మనకే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ప్రచారం కోసమో, టీఆర్​పీల కోసమో ఇలా చేయడం మంచిది కాదు. కాబట్టి వ్యూహాత్మక వైఖరితో దీర్ఘకాల ప్రణాళికలు రచించాలి."

-సంజయ్ జోషి, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్

చైనా నుంచి పెట్టుబడులు రావడం మంచిదేనని అన్నారు జోషి. లేదంటే చైనా మరింత దూకుడుగా వ్యవహరించేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"చైనా నుంచి అధికంగా పెట్టుబడులు రావడం మంచిదే. వారికి ఇక్కడ పెట్టుబడులు లేకపోతే మరింతగా కయ్యానికి కాలుదువ్వేవారు. ఇప్పుడు చైనా అవకాశాలను పరిశీలిస్తోంది. కొన్ని దేశాలు తనకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని అనుకుంటోంది. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు, దక్షిణ చైనా సముద్రంలో ఘర్షణలు, ఆస్ట్రేలియాలో సైబర్ దాడులు.. ఇవన్నీ ప్రణాళిక ప్రకారం చేసినట్లు అనిపిస్తోంది. ఒకవేళ చైనాపై ఒత్తిడి పెరిగి పరిస్థితి క్లిష్టంగా మారినప్పుడు ఏం చేస్తుంది? పరిస్థితులకు అనుగుణంగా చైనా నడుచుకుంటుంది. కాబట్టి భారత్​ సైతం సరైన జవాబివ్వాలి. అన్ని మార్గాలు మూసేయకుండా.. ప్రతి విషయానికి సిద్ధంగా ఉండాలి. ఆసియా ఇద్దరికీ చెందినదని గుర్తుంచుకోవాలి."

-సంజయ్ జోషి, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్

ఏ దేశానికి చెందిన అప్లికేషన్ల నుంచైనా భద్రతా సమస్యలు వచ్చే అవకాశం ఉందని... దీనికి సరైన పరిష్కారం స్వదేశంలోనే తయారుచేసుకోవడమేనని జోషి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మనిర్భర్(స్వయం సమృద్ధి) సాధించేంత వరకు సమాచార భద్రత వంటి సమస్యలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో దేశంలో పోటీతత్వాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు జోషి. పోటీ వాతావరణం పెంచడం ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటాయని చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం, పరిశ్రమ రంగం పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు జోషి.

ఇదీ చదవండి-కరోనా విజృంభణ: దేశంలో 6 లక్షలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details