ఒకవైపు ప్రపంచం అంతరిక్ష పర్యాటకంవైపు ఆసక్తిగా చూస్తోంది. మరోవైపు ఆకలి మంటలు చల్లార్చే కాస్తంత తిండి దొరక్క ఎందరో నిర్భాగ్యుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. కర్కశ కోరలతో కరోనా ప్రపంచంలో నిమిషానికి ఏడుగురిని కబళిస్తుంటే, ఆకలి భూతం దాన్ని మించిపోయి పదకొండు మంది ఆయువును తోడేస్తోంది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ఇటీవల వెల్లడించిన ఈ చేదు నిజం మానవత్వానికే మాయని మచ్చ! రాకాసి మహమ్మారి, అంతర్గత యుద్ధాలు, వాతావరణ మార్పుల ముప్పేట దాడితో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్షుద్బాధతో కునారిల్లుతున్నారన్న కఠోర వాస్తవం ఆలోచనాపరుల హృదయాల్ని బరువెక్కించింది. ఆదాయాలు తెగ్గోసుకుపోవడం, పాఠశాలలు మూతపడటం, సామాజిక భద్రతా పథకాలు ఆచరణలో కొల్లబోవడం వల్ల భారత్ సైతం ఆకలి కేకలకు నెలవైందన్న విశ్లేషణ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఆహార భద్రత డొల్ల!
మహమ్మారి విజృంభణ దరిమిలా దేశంలో 23 కోట్ల మంది రోజువారీ సగటు సంపాదన కనీస వేతనమైన రూ.375 కంటే తక్కువకు కుంచించుకుపోయింది. ఫలితంగా ఎంతో మందికి పస్తులు, అర్ధాకలి తప్పడంలేదు. రాకాసి కరాళనృత్యంతో పాఠశాలలు మూతపడి దేశంలో 12 కోట్ల మంది పిల్లలు మధ్యాహ్న భోజనానికి దూరమయ్యారు. చౌక ధరల దుకాణాల ద్వారా అందించే ఆహార ధాన్యాలు దేశంలో 10 కోట్ల మందికి ఇంకా అందని భాగ్యమేనని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. పదేళ్ల కిందటి జన గణన వివరాల ప్రాతిపదికన పంపిణీ వ్యూహం అమలు పరుస్తున్నందువల్లే ఈ దురదృష్టం దాపురించిందన్న ఆక్స్‌ఫామ్ స్పష్టీకరణ- దేశీయ ఆహార భద్రతా పథకాల డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది!
ఎవరికీ అందని తిండిగింజలు
భారత ఆహార సంస్థ గోదాములు 7.70 కోట్ల టన్నుల ధాన్య రాశులతో కళకళలాడుతున్నా- అవి అన్నార్తుల చెంతకు చేరడానికి అవరోధాలెన్నో! ఎఫ్‌సీఐ గోదాముల్లో ఆరేళ్ల వ్యవధిలో 40 వేల టన్నుల తిండిగింజలు ఎవరికీ కొరగాకుండా పోవడం వ్యవస్థాగతంగా దారుణ నిర్లక్ష్యానికి అద్దంపట్టింది. మహమ్మారి విలయంతో ఉపాధి కరవై సొంతూళ్ల బాట పట్టిన కోట్లాది వలస జీవుల ఆకలి కేకలు, నెత్తుటి అడుగులు- దేశవాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
స్వస్థలాలకు చేరాక గ్రామీణ ఉపాధి హామీ చట్టం సైతం శ్రామికులకు సరైన ఆదరువు కాలేకపోయింది. సర్వోన్నత న్యాయపాలిక జోక్యం చేసుకునేంత వరకు వారి ఆర్తనాదాలు ప్రభుత్వం చెవులకు సోకనేలేదు. మరోవైపు ప్రపంచ ఆకలి సూచీలో ఎక్కడో ఆఖరి వరసలో నిలుస్తుండటం పోషకాహార రంగాన భారత్ వెనకబాటుకు ప్రబల దృష్టాంతం. గతేడాది మొత్తం 107 దేశాల జాబితాలో అట్టడుగు నుంచి పదమూడో స్థానంతో భారత్ సరిపెట్టుకుంది. పాకిస్థాన్, నేపాల్, మయన్మార్‌ల కన్నా ఆకలి స్థాయి ప్రమాదకరంగా ఉన్న దేశంగా వెలాతెలాపోతూ చెరగని దుష్కీర్తిని మూటగట్టుకుంది. జనాభాలో 14 శాతం పౌష్టికాహారానికి నోచకపోవడం దేశ దుర్బలత్వాన్ని, ప్రణాళికా రచనలో లోటుపాట్లను కళ్లకు కడుతోంది.
ప్రభుత్వాల చొరవే కీలకం
రాజ్యాంగదత్తమైన జీవనహక్కులో అంతర్భాగంగా- గౌరవప్రదమైన రీతిలో బతకడానికి అవసరమైన ఆహారాన్ని, ఇతర ప్రాథమిక వసతులను పొందడాన్ని అన్వయించవచ్చునని పక్షం రోజుల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పాలక శ్రేణులు ఆ స్ఫూర్తికి గొడుగుపట్టాలి. ఆహార భద్రతలో పోషకాహారాన్నీ చేర్చి స్వస్థ భారతావనికి మేలు బాటలు పరుస్తూ- దేశంలో ఏ పేగూ ఆకలితో కమిలిపోకుండా ప్రభుత్వాలు గట్టి చొరవ తీసుకోవాలి!
ఇదీ చదవండి:పోషకాహార సమస్యను పెంచిన కరోనా!