కరోనా వైరస్ కట్టడికి వివిధ దేశాలు ఆత్యయిక స్థితిని, కర్ఫ్యూలను విధించాయి, కొందరు దేశ నాయకులైతే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులూ జారీచేశారు. పలు దేశాలు లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం, స్వీయ నిర్బంధం, రెడ్ జోన్లను ప్రకటించడం వంటి చర్యలను తీసుకున్నాయి. కొవిడ్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఎందరో కుబేరుల సంపద కళ్లముందే తరిగిపోయింది. ఇక సామాన్యులు, మధ్యతరగతి ప్రజల దుస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదు. ప్రపంచం మహా మాంద్యంలోకి జారిపోతుందని ఆర్థికవేత్తలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ పరిస్థితిలో బ్రిటన్ పూర్వ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ చేసిన ఒక వ్యాఖ్య గుర్తుకొస్తోంది. ‘సంక్షోభమంటే ఓ సువర్ణావకాశం. దాన్ని వృథాచేయద్దు’ అన్నారాయన. కరోనా కారుమబ్బుల వెనుక దాగిన కాంతి రేఖ భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలను తీసుకొస్తుంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయ సమాజం, పౌరులు ఆ అవకాశాలను ఎలా అందుకోవాలి అన్నది లోతుగా పరిశీలించి కార్యాచరణకు ఉపక్రమించాలి.
పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేనా..?
సింగపూర్, దక్షిణ కొరియాలు పటిష్ఠమైన పాలన, ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాలతో కొవిడ్ విజృంభణకు అడ్డుకట్ట వేయగా, అమెరికా చిరకాలంగా ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితాన్ని అనుభవిస్తోంది. పాశ్చాత్య సంపన్న దేశాల డొల్లతనాన్ని కరోనా బయటపెట్టింది. సంక్షోభ కాలంలో ప్రపంచానికి దిశా నిర్దేశం చేయగల నాయకత్వం ప్రపంచానికి నేడు కొరవడింది. ఇప్పటివరకు కరోనా దూకుడును సమర్థంగా నిలువరించగలుగుతున్న భారతదేశం విపత్కాలంలో సార్క్, ఆఫ్రికా దేశాలతోపాటు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలకూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసి ప్రశంసలు అందుకొంటోంది. ప్రపంచ నాయకత్వంలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీచేయడానికి ఒక చిన్న అడుగు వేసింది. కొవిడ్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగితే భారత్ సాయం కోసం పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడం ఖాయం.
సామర్థ్య నిరూపణకు తరుణమిదే!
ఇంతకాలం భారతదేశ పోలీసు, పౌర పాలనా యంత్రాంగాల పట్ల కానీ, మన ఆస్పత్రులు, వైద్య సిబ్బంది పట్ల కానీ జనానికి సదభిప్రాయం ఉండేది కాదు. కానీ, కొవిడ్ దూకుడును ఎదుర్కోవడంలో ఈ యంత్రాంగాలు పట్టుదలతో, చిత్తశుద్ధితో రేయింబవళ్లు శ్రమిస్తున్న తీరు అందరి మన్ననలు అందుకొంటోంది. భవిష్యత్తులో ఈ యంత్రాంగాలు మరింత సమర్థంగా పనిచేయగలవనే నమ్మకం మన ప్రజానీకంలో ఏర్పడుతోంది. హనుమంతుడికి తన బలమేమిటో ఇతరులు చెబితే కానీ తెలియదంటారు. ఇది మన పాలన, పోలీసు, వైద్య యంత్రాంగాలకూ వర్తిస్తున్నట్లుంది.