భీకర యుద్ధాల మారణహోమం నేపథ్యంలో, మాంసఖండాల కోసం రివ్వున వాలే రాబందుల రెక్కల చప్పుడుకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొవిడ్ మహమ్మారిపై అలాంటి మహాయుద్ధాన్నే మానవాళి నిష్ఠగా చేస్తున్న వేళ- అధిక లాభాల ఆశపోతు రాబందుల ఉరవడి నిశ్చేష్టపరుస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్యాపరంగా అమెరికా, బ్రెజిల్ తరవాత మూడో స్థానానికి చేరిన ఇండియాలో మొత్తం బాధితులు 8.80లక్షలకు చేరువ కాగా, ఇప్పటికే 23వేల పైచిలుకు మరణాలు గుండెల్ని పిండేస్తున్నాయి.
పదింతల రేటు..
మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ తయారీ యత్నాలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నా ఇదమిత్థంగా అవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలియదు. ఈ లోగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కొంత సాంత్వన కలిగించేవిగా అందుబాటులో ఉన్న రెమిడెసివర్, టోసిలిజుమాబ్ ఇంజక్షన్లు- వాటి గరిష్ఠ చిల్లర ధరకు అయిదు నుంచి పదింతల రేటు పలుకుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లోని ఔషధ దుకాణాల్లోనూ అదే వరస! ఔషధాల టోకు వ్యాపారులూ అడ్డగోలు వసూళ్లకు తెగబడటం అన్నది నేడు దేశవ్యాప్తంగా పొడగడుతున్న అక్రమ దందా! అత్యవసర పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించడానికి మాత్రమే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అనుమతించిన ఔషధాలు, తయారీదారుల నుంచి నేరుగా ఆసుపత్రులకు మాత్రమే సరఫరా కావాలి. అత్యవసర పరిస్థితిలోని రోగులకు సరైన ప్రిస్క్రిప్షన్ ఉంటే కారుణ్య ప్రాతిపదికన నేరుగా ఇవ్వాలంటూ ఔషధ నియంత్రణ విభాగం నుంచి వచ్చిన సూచన మేరకు విడుదలైన ఔషధాలు పక్కదారి పట్టాయంటున్నారు. భారీస్థాయిలో ఫిర్యాదులు పోటెత్తడంతో డ్రగ్స్ కంట్రోలర్‌జనరల్‌ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి ఔషధాలు నల్లబజారుకు తరలడాన్ని నిలువరించాలంటూ ఆదేశించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరింత ప్రభావాన్విత కార్యాచరణకావాలిప్పుడు!
అధిక ధరలతో..
మానవాళికి మహావిపత్తుగా దాపురించిన కొవిడ్‌ను నయంచేసే ఔషధం ఏదైనా పేటెంట్ల బాదరబందీ లేకుండా అందరికీ అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిలషిస్తోంది. రోగి కోలుకొనే కాలావధిని కొద్దిగా తగ్గించగలుగుతున్న రెమిడెసివర్ ఔషధ ఉత్పాదన మొత్తాన్ని వచ్చే మూడునెలల కాలానికి అమెరికాకే అందించేలా ‘గిలీడ్’ సంస్థతో ట్రంప్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. గిలీడ్ అనుమతితో సిప్లా, హెటిరో, మైలాన్ సంస్థలు వేర్వేరు పేర్లతో రెమిడెసివర్‌ను దేశీయంగా తయారు చేయడానికి సర్కారు సమ్మతించగా- ఆ ఔషధం ధరలే బాధితుల ప్రాణాలతో అక్షరాలా చెలగాటమాడుతున్నాయి.