తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొవిడ్​ నుంచి ఆదుకోవాల్సింది ప్రభుత్వమే!

వ్యాక్సిన్ల తయారీలో దిగ్గజ శక్తిగా పేరు గడించిన భారత్‌- కొవిడ్‌ టీకాలకు కొరతను ఎదుర్కోవాల్సి రావడం కచ్చితంగా ప్రణాళిక రాహిత్య పర్యవసానమే. దశాబ్దాలుగా జాతీయ ఉచిత టీకా కార్యక్రమం అమలవుతున్న దేశం మనది. అటువంటిది, కొవిడ్‌ విషయంలో దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానమే కేంద్రాన్ని ప్రశ్నించింది. కొవిడ్ నుంచి ప్రజలను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే.

corona
కొవిడ్​ నుంచి ఆదుకోవాల్సింది ప్రభుత్వమే!

By

Published : May 14, 2021, 7:06 AM IST

కొవిడ్‌ మహా సంక్షోభవేళ విపక్షాల బాధ్యతాయుత సమష్టి స్పందన ఇది. దేశంలోని అన్ని ఆస్పత్రులు, వైద్య కేంద్రాలకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించాలని, దేశవ్యాప్తంగా ఉచిత టీకా కార్యక్రమం చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేసి పది రోజులైంది. ప్రభుత్వంలో సత్వర స్పందన కొరవడటాన్ని గర్హిస్తూ నలుగురు ముఖ్యమంత్రులు, 12 ప్రతిపక్ష పార్టీల తాజా ఉమ్మడి లేఖాంశాలు తక్షణ కార్యాచరణను అభ్యర్థిస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరుకు ప్రత్యేకించామన్న రూ.35వేల కోట్లను వెంటనే విడుదల చేసి దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేయాలంటున్న విపక్షాలు- వైరస్‌ కట్టడిపై దృష్టి కేంద్రీకరించాలనీ సూచించడం వెనక విస్తృత నేపథ్యం ఉంది. వ్యాక్సిన్ల తయారీలో దిగ్గజ శక్తిగా పేరు గడించిన భారత్‌- కొవిడ్‌ టీకాలకు కొరతను ఎదుర్కోవాల్సి రావడం కచ్చితంగా ప్రణాళిక రాహిత్య పర్యవసానమే.

అప్పుడు ఉచితమే.. మరి ఇప్పుడు..

దశాబ్దాలుగా జాతీయ ఉచిత టీకా కార్యక్రమం అమలవుతున్న దేశం మనది. అటువంటిది, కొవిడ్‌ విషయంలో దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానమే కేంద్రాన్ని నిగ్గదీసింది. అసంఖ్యాక జీవితాలు చితికిపోయిన దశలో ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్లు అందించకపోతే నిరుపేదల పరిస్థితి ఏమిటనీ సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కుకు మన్నన దక్కని వాతావరణాన్ని చెదరగొట్టాల్సిందిగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలూ హితవు పలకడం నూటికి నూరుపాళ్లు సమర్థనీయమే. జులై దాకా టీకాలకు కటకట తప్పదన్న అంచనాలు, ఆక్సిజన్‌కు ప్రాణాధార ఔషధాలకు కొరత ముమ్మరించి రోగుల ఆక్రందనలు మిన్నంటుతున్న తరుణంలో- రాష్ట్రాల్ని కూడగట్టుకుని కేంద్రం ఇకనైనా చురుగ్గా కదలాలి!

పద్నాలుగు నెలల కాలావధిలో మొదటిసారి ఇంగ్లాండ్‌లో మూన్నాళ్ల క్రితం కొవిడ్‌ మరణాలు సున్నా స్థాయికి చేరాయి. కొత్త కేసుల సంఖ్యా రెండు వేలకు పడిపోయింది. అదే ఇక్కడ ఇండియాలోని 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రియాశీల కేసులు హడలెత్తిస్తున్నాయి. దేశమంతటా అటువంటి కేసుల సంఖ్య 37 లక్షలకు పైమాటే. రెండు కోట్ల 37 లక్షల కొవిడ్‌ కేసులు, సుమారు రెండు లక్షల అరవై వేల మరణాలకు నెలవైన భారత్‌లో ఇప్పటికీ రోజువారీ చావులు నాలుగు వేలకు తగ్గడం లేదు. ఈ భీతావహ స్థితిలో 10 శాతానికి మించిన కేసుల పాజిటివిటీ ప్రాతిపదికన సుమారు 530 జిల్లాల్లో ఎనిమిది వారాల వరకు లాక్‌డౌన్‌ విధించడమే శరణ్యమని ఐసీఎమ్‌ఆర్‌ (భారతీయ వైద్య పరిశోధన మండలి) చెబుతోంది.

బతుకులు అస్తవ్యస్తం..

నిరుటి లాక్‌డౌన్లు, ఇటీవలి కర్ఫ్యూలూ పరిమిత ఆంక్షల మూలాన కోట్లాది బతుకులు అస్తవ్యస్తమైపోగా- ఇంకో రెండు నెలల లాక్‌డౌన్‌తో నిత్య శ్రామికుల గతేం కాను? భారత్‌ ముంగిట జీవనోపాధి సంక్షోభ ముప్పు పొంచి ఉందంటున్న సామాజిక శాస్త్రవేత్త జీన్‌డ్రెజ్‌- చాలామంది కష్టార్జితం కరిగిపోయిందని, ఎందరో పెద్దయెత్తున అప్పుల పాలయ్యారంటూ మేలిమి సిఫార్సులూ చేశారు. లోగడ ప్రకటించిన ఉపశమన చర్యల్ని విస్తృతీకరించడంతోపాటు సమగ్ర నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలంటున్నారు. అమెరికాలో బైడెన్‌ సర్కారు రూ.138 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, నిరుద్యోగులకు భృతి, చిరు వ్యాపారులకు తోడ్పాటు సమకూరుస్తోంది.

ఆకలి చావులను అరికట్టండి..

దేశ రాజధాని ప్రాంతంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు రేషన్‌ సమకూర్చాల్సిందిగా కేంద్రాన్ని, దిల్లీ హరియాణా యూపీ ప్రభుత్వాల్ని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. దేశంలో ఎక్కడా ఆకలి చావులు దాపురించకుండా పేదలూ అల్పాదాయ వర్గాలకు ఉచితంగా రేషన్‌ సమకూర్చే మానవీయ బాధ్యతను ప్రభుత్వాలే తలకెత్తుకోవాలి. సమధిక ఆహార, ధాన్య నిల్వల్ని సద్వినియోగపరచే పటిష్ఠ కార్యాచరణే కోట్లాది అన్నార్తుల ప్రాణదీపాల్ని నిలబెట్టగలిగేది!

ఇదీ చూడండి:'18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌'..అని కేంద్రం చెప్పినా..!

ABOUT THE AUTHOR

...view details