కరోనా వైరస్ మలి దశ విజృంభణతో కొవిడ్ కొత్త కేసులు ఒక్క రోజులోనే లక్షాపాతిక వేలకు మించిపోయిన తరుణంలో, పటుతర నియంత్రణ వ్యూహానికి కేంద్రం ఓటేస్తోంది. విస్తృత పరీక్షలు, వైరస్ వ్యాప్తి ఆనుపానుల కూపీ, తగిన చికిత్స, తు.చ. తప్పకుండా కొవిడ్ విధివిధానాల పాటింపు, విరివిగా వ్యాక్సినేషన్ ద్వారా మహమ్మారిని అదుపు చేయగలమన్న విశ్వాసం ప్రధాని మోదీ మాటల్లో ప్రస్ఫుటమవుతోంది. విస్తరణ వ్యూహంలో భాగంగా ఏప్రిల్ 11-14 మధ్య 'టీకా ఉత్సవ్' నిర్వహణకు, 11వ తేదీనుంచి వందమందికి పైబడి సిబ్బంది కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్రం అనుమతించడం స్వాగతించదగింది. క్రమంగా వేగం పుంజుకొంటూ రోజూ సుమారు 40 లక్షల మోతాదుల దాకా టీకాలు వేసే స్థాయికి యంత్రాంగం చేరిన దరిమిలా, తాజా భూరి విస్తరణ యోచనను సమర్థంగా పట్టాలకు ఎక్కించడం గడ్డుసవాలే. నేరుగా కార్యాలయాలకు వెళ్ళి అక్కడే టీకాలు వేసేందుకు అవసరమైన మానవ వనరులతోపాటు, అదనంగా వ్యాక్సిన్ మోతాదులూ అందుబాటులో ఉండాలి.
రాజకీయ రగడ..
ఇప్పటికే టీకాల కొరత అంశంపై రాజకీయ కాక రేగుతోంది. కేసుల కట్టడిలో స్వీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొరత నెలకొందంటూ అంశాన్ని రాజకీయం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తగినన్ని టీకా మోతాదులు సరఫరా కావడం లేదని గళమెత్తింది మహారాష్ట్రలోని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కారు ఒక్కటే కాదు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, రాజస్థాన్ ప్రభృత రాష్ట్రాలూ కొన్నాళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థల గరిష్ఠ సామర్థ్యం ఎంతో, ఉత్పత్తి జరుగుతున్నదెంతో, ఏ మేరకు పంపిణీ అవుతోందోనన్న యథార్థాలకు ఎవరూ మసిపూసి మారేడు చేయలేరు. జాతి యావత్తు ఏకోన్ముఖ కృషితో కొవిడ్ కట్టడికి నిబద్ధం కావాల్సిన వేళ, ఈ తరహా రాజకీయ కోలాటాల్ని ఆలోచనాపరులెవరూ హర్షించరు!
వృథా సమస్య..