బతుకుల్ని జీవనాధారాల్ని గుల్లబార్చి, మానవాళి ఆకాంక్షలకు అభివృద్ధి లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ- కరోనా మహమ్మారి దేశదేశాలను హడలెత్తిస్తోంది. ఆర్థిక, వాణిజ్య రంగాల్నీ కకావికలం చేస్తోంది. భావితరంపైనా కొవిడ్ కర్కశ ప్రభావం దారుణంగా ఉండనుందని 'యునిసెఫ్' తాజాగా హెచ్చరిస్తోంది. కరోనా కోర సాచిన నేపథ్యంలో మలేరియా, పోలియో వంటి వ్యాధులపైనా దృష్టి సారించాల్సిందేనని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపిచ్చింది.
బాలలపై కరోనా వైరస్ ప్రభావ తీవ్రత ఇక ఎంతమాత్రం ఉపేక్షించలేనిదంటున్న యునిసెఫ్ ఉద్బోధ, సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూల మూలాన చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సాధారణ ఆరోగ్య వసతులూ అందుబాటులో లేకుండా పోయాయి. తల్లిదండ్రుల ఆదాయం కుంగి, సరైన పోషకాహారం అందక పిల్లలు చనిపోయే దుర్భర స్థితికి ఇవన్నీ దారితీసేవేనన్నది యునిసెఫ్ వ్యక్తపరుస్తున్న తీవ్రాందోళన.
జాగరూకత అవసరం..
వచ్చే ఆరునెలల్లో 118 దిగువ, మధ్యాదాయ దేశాల్లో రోజూ అదనంగా ఆరువేలమంది పసివాళ్లు కడతేరిపోతారన్నది ఎవరినైనా బెంబేలెత్తించే అంచనా. ప్రాణనష్టం అధికంగా సంభవిస్తుందంటున్న 10 దేశాల జాబితాలో- ఇథియోఫియా, కాంగో, టాంజానియా, నైజీరియా, ఉగాండా, పాకిస్థాన్లతో పాటు ఇండియా పేరూ చోటుచేసుకుంది. అయిదో పుట్టినరోజు జరుపుకోకుండానే భూమ్మీద నూకలు చెల్లుతున్న అభాగ్యుల సంఖ్యకిది అదనం!
సరైన పోషణ, కనీస వైద్యాలకు నోచక నివారించదగ్గ వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా కన్నుమూస్తున్న పిల్లలకు మరింతమంది జతపడకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా దేశాల భుజస్కంధాలపైనే ఉంది. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి విషమిస్తుందన్న యునిసెఫ్ హెచ్చరిక, భారత్ సహా నూటికిపైగా దేశాల్లో ఇకనైనా చురుకు పుట్టించాలి!