తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పౌర బాధ్యతగా కరోనాపై పోరు - పౌర బాధ్యతగా కరోనాపై పోరు

కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విజృంభిస్తోంది. ఈ మహాయుద్ధంలో గెలుపోటముల నిర్ధరణకు మే నెల కీలకం కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశాన్ని ఆర్థికాన్ని కుంగదీస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడంలో ద్విముఖ వ్యూహానికి ప్రాధాన్యమిచ్చింది కేంద్రం. లాక్‌డౌన్‌కు కొద్దిపాటి సడలింపులు ప్రకటించడంలో అంతర్లీన సందేశం ఒక్కటే... ఎవరికివారు పౌరబాధ్యతతో మెలగాలన్నదే!

coronavirus
పౌర బాధ్యతగా కరోనాపై పోరు

By

Published : May 4, 2020, 7:25 AM IST

రోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న మహాయుద్ధంలో గెలుపోటముల నిర్ధారణకు మే నెల కీలకం కానుందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. నిన్నటితో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఈ నెల 15నాటికి కొవిడ్‌ కేసులు 65 వేలకు, ఆగస్టు 15నాటికి 2.7 కోట్లకు చేరతాయంటున్నాయి నీతి ఆయోగ్‌ గణాంకాలు! ఒకవంక అభాగ్యుల ప్రాణాలతో మృత్యుక్రీడలాడుతూ మరోవంక దేశార్థికాన్ని దారుణంగా కుంగదీస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడంలో ద్విముఖ వ్యూహానికి ప్రాధాన్యమిచ్చిన కేంద్రప్రభుత్వం- రెండు కీలక నిర్ణయాలు తీసుకొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను నేటి నుంచి రెండువారాలు పొడిగిస్తూ- రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లవారీగా విపుల మార్గదర్శకాలు వెలువరించడం వాటిలో మొదటిది. స్వస్థలాలకు చేరాలన్న వలస శ్రామికుల గుండఫెుోషకు చెవులొగ్గి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ద్వారా విస్తృత స్థాయి తరలింపులకు పచ్చజెండా ఊపడం రెండోది. కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయించి కొన్ని షరతులతో వర్తక వాణిజ్యాలకు అనుమతించడం- ఆర్థికంగా రాష్ట్రాలకు కొంత సాంత్వన కలిగించే నిర్ణయం. ఏప్రిల్‌ 15 నుంచి మే నెల ఒకటి మధ్య రెడ్‌జోన్ల సంఖ్య 170 నుంచి 130కి దిగిరావడం ఊరట కలిగించేదే అయినా అదే కాలంలో గ్రీన్‌జోన్ల సంఖ్యా తగ్గుతూ, ఆరెంజ్‌ జోన్లు 284కు పెరగడం- కరోనా ముప్పు అడుగడుగునా పొంచే ఉందనడానికి నిదర్శనం. పక్షం రోజులుగా సగటున రోజూ వెయ్యికి పైబడుతున్న కొత్త కేసులు కొన్నాళ్లుగా రెండు వేలకు మించుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మాదిరిగా ఇండియాలో కరోనా కరాళ నృత్యం చెయ్యకపోవడానికి లాక్‌డౌన్‌ ఎంతగానో ఉపకరించింది. నేడు దేశవ్యాప్తంగా 419 ల్యాబులతో రోజుకు 75వేల కరోనా పరీక్షల సామర్థ్యాన్ని సముపార్జించిన ఇండియా లాక్‌డౌన్‌కు కొద్దిపాటి సడలింపులు ప్రకటించడంలో అంతర్లీన సందేశం ఒక్కటే... ఎవరికివారు పౌరబాధ్యతతో మెలగాలన్నదే!

కొవిడ్​కు కోరలు తొడిగే ప్రమాదం..

భారతావని ప్రగతి సౌధానికి రాళ్లెత్తే వలస కూలీలు స్థూల దేశీయోత్పత్తిలో పది శాతాన్ని తమ స్వేదంతో సమకూరుస్తున్నారు. దూరాభారాల్ని లెక్కచేయకుండా పని నైపుణ్యాలు గిట్టుబాటయ్యే చోట్లకు దూసుకుపోయే వలస కూలీలు- గ్రామాల్లో 9.95 కోట్లు, పట్టణాల్లో 3.56 కోట్ల కుటుంబాలకు నెలనెలా డబ్బులు పంపుతుంటారు! 40 రోజులుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ అలాంటివారందరిపై అక్షరాలా పిడుగుపాటులా మారింది. ఉన్నచోట పనిలేక, సొంతూరు వెళ్ళే దారిలేక, తమ జీవికతో పాటు ఊళ్లో ఆత్మీయుల జీవనాధారం పైనా బెంగతో కోట్లమంది వలస కూలీలు అనుభవించిన మానసిక క్షోభ మాటలకందనిది! మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు బిహార్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాలూ వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లు కావాలనడంతో- కేంద్రం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లలో ప్రయాణానికి విస్పష్ట విధి నిషేధాల్ని రైల్వేశాఖ నిర్దేశించినా, స్వస్థలాలకు లక్షల సంఖ్యలో వలస కూలీల చేరవేత- కొవిడ్‌కు కోరలు తొడిగే ప్రమాదంపై భయసందేహాలకు కారణమవుతోంది. ఈ మధ్యనే నాందేడ్‌ గురుద్వారా దర్శనానికి వెళ్ళి చిక్కుపడిపోయిన సిక్కుల్ని తిరిగి రప్పించుకొన్న పంజాబ్‌ ప్రభుత్వం- వారివల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని మొత్తుకుంటోంది. బిహార్‌ వ్యక్తీకరిస్తున్న బాధా అదే! గుజరాత్‌ నుంచి ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లడానికి పేర్లు నమోదు చేసుకొన్నారు. రైలు ఎక్కేముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు చెయ్యడం, స్వరాష్ట్రంలో దిగాక విధిగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి జాగ్రత్తలు తీసుకోవడం వంటివి బాధ్యతాయుతంగా సాగాలి. చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఈ తరలింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాటైనా ప్రాణాంతకమవుతుందన్న స్పృహతో ప్రభుత్వాలు ముందడుగేయాలి!

ABOUT THE AUTHOR

...view details