'అప్పులఊబి దౌత్యం' అనే పదబంధాన్ని తొలిసారి ఉపయోగించిన ఆర్థికవేత్త బ్రహ్మా చేలాని. ఆఫ్రికా దేశాల అభివృద్ధి పథకాలకు చైనా రుణాలు సమకూర్చే తీరును అభివర్ణించడానికి ఆయనీ పదప్రయోగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చైనా అందిస్తున్న అన్ని రుణాలకూ ఇది వర్తిస్తుంది. విదేశాల్లో విలువైన ఆస్తులు చేజిక్కించుకోవడానికి వీలుగా చైనా నిబంధనలు ఉంటాయి. రుణాలిచ్చిన దేశాలను గుప్పిట్లోకి తెచ్చుకుని తన ప్రయోజనాలకు అనుకూలంగా వాటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇదే చైనా అప్పులఊబి దౌత్యం!
ఆర్థిక వల
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పారదర్శక నిబంధనల కారణంగా స్వల్పాదాయ వర్ధమాన దేశాలు(ఎల్‌డీసీలు) నిధులు సమకూర్చుకోలేవు. అవి విదేశీ కంపెనీల పెట్టుబడులపట్ల మొగ్గుచూపుతాయి. ఇదే అదనుగా చైనా సంస్థలు రంగంలోకి దిగుతాయి. చైనా ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్షియర్లు నిధులు సమకూర్చి, ఆయా దేశాల ప్రాజెక్టుల బిడ్డింగుల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తాయి. ఈ కంపెనీలు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచబ్యాంకు ఇచ్చే 3-4శాతం చౌకవడ్డీ రేటుకంటే ఎక్కువగా ఆరుశాతం వరకు వడ్డీ గుంజుతాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చైనా రుణదాతలు రుణగ్రహీత సంస్థలతో భూమిని, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టిస్తాయి. గనుల తవ్వకాల్లో రాయితీలు రాబడతాయి. కిస్తీలను పెట్రో ఉత్పత్తుల రూపంలో వసూలు చేస్తాయి. వాణిజ్య రాయితీలు పొందుతాయి. ఈ ప్రయోజనాలు దేశాన్నిబట్టి మారుతుంటాయి. నిధులు తెచ్చే చైనా సంస్థ ఆయా దేశాల్లోని స్థానిక నాయకుల చేతులు తడపాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు వ్యయాన్ని చాలా ఎక్కువగా చూపుతుంది. అనైతిక వ్యాపార పద్ధతుల ద్వారా, పారదర్శకత లోపించిన టెండరింగ్ విధానాల ద్వారా ప్రాజెక్టును చేజిక్కించుకుంటుంది. యంత్రపరికరాల సరఫరా, యాజమాన్య సేవలు, కొన్ని సందర్భాల్లో చైనా కార్మికుల నియోగం వంటి కాంట్రాక్టులు ఒప్పందం షరతుల మేరకు చైనా కంపెనీలకే దక్కుతాయి. ఇలా ప్రాజెక్టు రుణంలో లేదా వ్యయంలో సింహభాగం అప్పిచ్చిన చైనా దేశానికే తిరిగిచేరుతుంది. అప్పు తీసుకున్న దేశం రుణాన్ని, లేదా వాయిదాలను సకాలంలో చెల్లించలేనట్లయితే తాకట్టు ఆస్తులను చైనా రుణదాత స్వాధీనపరచుకుంటుంది.
భారతీయ గ్రామాల్లో కనిపించే వడ్డీవ్యాపారుల తరహాలోనే ఈ వ్యవహారం అంతా సాగుతుంది. చైనా ప్రభుత్వం అప్పుల లావాదేవీల్లో జోక్యం చేసుకోదని కొందరు విశ్లేషకులు అంటారు. ఈ తరహా కాంట్రాక్టులపై ఉండే నీలినీడలు, వ్యయాలు తడిసి మోపెడై మధ్యంతరంగా ప్రాజెక్టులు రద్దు, తాకట్టు ఆస్తుల జప్తు- చైనా దురుద్దేశాలనే వెల్లడిస్తాయి. హోవర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, చైనా 152 దేశాలకు 1.50 లక్షల కోట్ల డాలర్లు (భారత్ జీడీపీలో దాదాపు సగం) రుణం ఇచ్చింది. వర్ధమాన దేశాల నుంచి చైనా కొనుగోలు చేసిన రుణపత్రాలు, పలు భాగస్వాములకు అందించిన వాణిజ్య రుణాలు కలిపి చూసినట్లయితే ఈ మొత్తం అయిదు లక్షల కోట్ల డాలర్ల పైగా ఉంటుందని లెక్కకట్టారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువలో ఆరు శాతం! 12 దేశాల చైనా రుణాలు వాటి జీడీపీలో 20శాతాన్ని మించిపోయాయి. పీకలోతు అప్పులో కూరుకుపోయిన డిజిబౌటి తమ దేశంలో చైనా సైనిక స్థావరం ఏర్పాటుకు అంగీకరించాల్సి వచ్చింది. విదేశాల్లో ఇదే చైనా తొలి సైనిక స్థావరం. శ్రీలంక 100 కోట్ల డాలర్ల బకాయిలు చెల్లించలేక చేతులెత్తేసింది. 4,300 కోట్ల డాలర్ల రుణాన్ని పెట్రో ఉత్పత్తుల రూపంలో జమచేస్తున్న చమురు సంసన్న దేశం అంగోలాలో రాజధాని లువాండా పక్కనే ఓ కొత్త నగరాన్ని చైనా నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించడం లేదు.