ప్రస్తుతం ప్రపంచంలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న దేశమేదైనా ఉందంటే అది ఒక్క రిపబ్లిక్ ఆఫ్ చైనా మాత్రమే. ఇతర దేశాల సమస్యలను ఆసరాగా తీసుకొని పబ్బం గడుపుకుంటోంది చైనా. చైనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలు ఎన్నో. ఇక ఆ దేశం సాగించే అకృత్యాలకు కొదవే లేదు.
- టిబెట్, షింజియాంగ్, హాంకాంగ్‌లో మానవహక్కుల ఉల్లంఘన
- దక్షిణ చైనా సముద్రంలో విస్తరణవాదం
- పెద్ద దేశాలతో వాణిజ్య యుద్ధాలు
- కరోనా వ్యాప్తిపై తప్పుడు సమాచారం
- బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్
- భారత సరిహద్దులో చొరబాట్లు
- నేపాల్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం
ఇలా చెప్పుకుంటూ పోతే చైనా బాగోతం చాంతాడంత ఉంటుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది, ప్రమాదకరమైనది మరొకటి ఉంది. అదే... 'రుణ ఉచ్చు దౌత్యం'(డెట్ ట్రాప్ డిప్లమసీ). ఈ పదాన్ని తొలిసారిగా భౌగోళిక వ్యూహకర్త, రచయిత బ్రహ్మ చెలనీ ప్రయోగించారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 2010లో ఆఫ్రికా దేశాలకు రుణాలు ఇచ్చే చైనా విధానాలను వర్ణించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు.
ఇదీ తీరు
- అత్యవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం
- రుణగ్రహీత దేశాల నుంచి విలువైన, తనకు అవసరమైన వాటిని పొందే విధంగా షరతులు విధించడం
- క్రమంగా ప్రాంతీయ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం
చైనా ఈ రుణాలన్నీ అల్పాదాయ అభివృద్ధి చెందుతున్న దేశాలకే ఇస్తుంది. కఠిన నిబంధనల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు పొందలేని దేశాలకు చైనా ఆర్థిక సాయం అందిస్తుంది. చాలా వరకు అల్పాదాయ దేశాలు ఇలా విదేశాల నుంచి అప్పుల రూపంలోనే నిధులు సమీకరించుకుంటున్నాయి.
ఇక్కడ చైనా కంపెనీలు, ఆర్థిక సంస్థలు రంగంలోకి దిగుతాయి. పెద్ద ఎత్తున నిధులు అందుబాటులో ఉంచుతాయి. అభివృద్ధి ప్రాజెక్టుల వేలం ప్రక్రియలో పాల్గొనే కంపెనీలకు 6 శాతం వడ్డీతో రుణాలు అందిస్తాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలతో పోలిస్తే ఇది ఎక్కువ. సాధారణంగా ఈ సంస్థలు 3-4 శాతం వడ్డీ తీసుకుంటాయి.
ఇక్కడే చైనా దుర్మార్గపు ఆట ప్రారంభమవుతుంది. రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆయా దేశాలను హామీ (పూచీకత్తు) అడుగుతాయి. భూభాగం, మైనింగ్‌లో రాయితీలు, వాణిజ్య ప్రాధాన్యాల రూపంలో వీటిని పొందుతాయి. ఒక్కో దేశం నుంచి ఒక్కో విధమైన ప్రయోజనాలను సొంతం చేసుకుంటాయి.
అవినీతికి పట్టం కట్టి...
మరోవైపు ఆయా దేశాల్లో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలు అధిక ధరలు కోట్ చేస్తాయి. ఈ ప్రాజెక్టులకు అవసరమయ్యే పరికరాలను చైనా నుంచే దిగుమతి చేసుకునే విధంగా షరతులు విధిస్తాయి. ప్రాజెక్టు నిర్వహణ, దానికి అవసరమయ్యే కార్మికులను కూడా కొన్నిసార్లు చైనా నుంచే తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుంటాయి. ఫలితంగా ఈ ప్రాజెక్టు వ్యయంలో చాలా వరకు చైనా కంపెనీలకే తిరిగివెళ్తుంది. స్థానిక నేతల చేతులు తడుపుతారు కాబట్టి వీరి పని సులువుగానే జరిగిపోతుంది. పారదర్శకమైన వ్యాపార ధోరణికి విరుద్ధంగా ప్రాజెక్టులు సొంతం చేసుకుంటుంది.
ఒకవేళ సదరు దేశం రుణం చెల్లించడంలో విఫలమైతే హామీగా తీసుకున్న పూచీకత్తును పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా భారత్‌లో మారుమూల గ్రామాల్లోని వడ్డీవ్యాపారుల వ్యవహారాన్ని పోలి ఉంటుంది. అయితే చైనా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడదని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు. కానీ కాంట్రాక్టుల పద్ధతి, ప్రాజెక్టుల వ్యయం తరచూ పెరగడం, మధ్యలోనే కొన్ని ప్రాజెక్టులను నిలిపివేయడం, హామీలను జప్తు చేసుకోవడం వంటి విషయాలను పరిశీలిస్తే చైనా నిగూఢ ఉద్దేశం బోధపడుతుంది.
రుణాల విలువ ఎంతంటే?
- హోవార్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం దాదాపు 152 దేశాలకు చైనా రుణాలు అందించింది.
- ఈ రుణాల విలువ 1.5 ట్రిలియన్ డాలర్లు(భారత జీడీపీకి దాదాపు సమానం)
- కెయిల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది వరల్డ్ ఎకానమీ ప్రకారం వివిధ భాగస్వాములకు అందించిన వాణిజ్య క్రెడిట్లను కలుపుకుంటే రుణాల విలువ 5 ట్రిలియన్ డాలర్లు
- ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 6 శాతం