'విశ్వసనీయమైన, గౌరవంతో కూడిన ప్రేమమయమైన దేశంగా మారితే, అంతర్జాతీయంగా మన ఖ్యాతి మరింత పెరుగుతుంది' అని ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ(Chinese Communist Party) సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపిచ్చారు. వాస్తవానికి, డ్రాగన్‌ది దుందుడుకు విదేశాంగ విధానం. దాదాపు 18 దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆ జాబితాలో చైనాకు అత్యంత సన్నిహిత దేశమైన ఉత్తరకొరియాతో పాటు రష్యా కూడా ఉండటం గమనార్హం. మరోవైపు, చైనా నుంచి వ్యాప్తిచెందిన కరోనా వైరస్ ప్రపంచానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్‌కు వ్యతిరేకంగా వాదనలు బలపడుతున్న తరుణంలో చైనా మరో కొత్త ఎత్తుగడకు పావులు కదుపుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిన్‌పింగ్ ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొన్నారు.
మూడు సూత్రాలు..
అంతర్జాతీయ స్థాయిలో అగ్రభాగాన చైనా(China) నిలిచేందుకు ఒక ప్రచారవేదిక, చైనాలో స్థిరంగా కొనసాగుతున్న సంస్కరణలు, అభివృద్ధిపై ప్రపంచ ప్రజల దృష్టిలో సానుకూల వాతావరణం, భవిష్యత్తు మానవాళికి డ్రాగన్ చేయూత తీరుపై అంతర్జాతీయంగా భారీయెత్తున ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. తద్వారా ప్రపంచంలోని పలుదేశాల్లో తమకు వ్యతిరేకత బలపడకుండా చూడాలన్నది ఆయన యోచన. అయితే కరోనా విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ అసంతృప్తి రానున్న కాలంలో దావానలంలా వ్యాపించే ప్రమాదముందని చైనా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీటితో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచే బయటకు వచ్చిందని కరాఖండీగా చెబుతూ, సమకాలీన ప్రపంచ సమాజానికి నష్టపరిహారం కూడా డిమాండ్ చేశారు. వైరస్ ప్రయోగశాల నుంచే బయటకు వచ్చిందన్న వాదన క్రమేపీ బలపడుతోంది.
ఇదీ చదవండి:ఆ దేశాలను ఎదుర్కొనేందుకు చైనా కొత్త తంత్రం!
వుల్ఫ్ డిప్లొమసీ..
సాధారణంగా ఏదైనా దేశం చైనాపై విమర్శలు చేసిన వెంటనే బీజింగ్ దౌత్యవేత్తలు రంగంలోకి దిగుతారు. ఘాటైన పదజాలం, హెచ్చరికలు కలగలపిన ప్రకటనలతో ఎదురుదాడి చేస్తారు. అయితే, ఇటీవల చైనాపై విమర్శలను చేసేవారు, పలు ఆధారాలతో చేయడంతో తిప్పికొట్టడం డ్రాగన్‌కు కష్టమవుతోంది. వీటితో పాటు కరోనా పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న బీజింగ్‌కు అంతర్జాతీయంగా మంచి పేరు రావాలన్న ఆకాంక్ష మొదలైంది. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలన్న కోరిక కూడా చైనాలో బలపడుతోంది. చైనా విదేశాంగ విధానం సంక్లిష్టమైనదిగా నిపుణులు పేర్కొంటారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానాన్ని డ్రాగన్ మార్చుకోదు. కానీ తమ దేశం సుఖ, సంతోషాలతో, ఉజ్జ్వల భవిష్యత్తు దిశగా సాగుతున్నట్లు ప్రపంచానికి చూపుతుంది. వీగర్ మైనారిటీలపై దమనకాండ, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య ధోరణి, సరిహద్దు దేశాలతో ఘర్షణ, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య వాదులపై ఉక్కుపాదం.. తదితర కరడుగట్టిన విధానాలను చైనా మార్చుకుంటుందా అనేది సందేహమే.