చైనా, ఇరాన్ మధ్య కుదిరిన భారీ వ్యూహాత్మక ఒప్పందం- భారత్ తలపెట్టిన చాబహార్ ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం కనబరచే అవకాశాలున్నాయి. 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' పేరిట చైనా, ఇరాన్‌ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. 25ఏళ్లపాటు అమలులో ఉండే సుమారు 40వేల కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావేద్ జరీఫ్ మార్చి 27న సంతకాలు చేశారు. దీనివల్ల ఇరాన్‌లో భారత్ ఇప్పటికే చేపట్టిన చాబహార్ ప్రాజెక్టుపై నీలినీడలు ప్రసరించే ప్రమాదం నెలకొంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇరాన్‌లో చైనా భారీ పెట్టుబడులు పెడుతుంది. ప్రతిగా, ఇరాన్ రాయితీ ధరలతో చైనాకు చమురు సరఫరా చేస్తుంది. ఇరుదేశాల మధ్య సైనిక సర్దుబాట్లూ జరుగుతాయి. ఇవేకాకుండా, ఇతర రంగాల్లోనూ పాతికేళ్లపాటు సహకరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలోని వివరాలను రహస్యంగా ఉంచారు. ఇరాన్‌లో తమ పెట్టుబడులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు డ్రాగన్ అయిదు వేలమంది సైనికులను మోహరించనున్నట్లు సమాచారం.
రష్యాతోనూ ఒప్పందం!
చైనాతో ఈ ఒప్పందం అనంతరం రష్యాతోనూ ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలను తట్టుకోవడానికి రష్యాతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఇరాన్ పార్లమెంటుకు చెందిన జాతీయ భద్రత, విదేశీ విధాన సంఘం అధ్యక్షులు మోజ్తబ జొన్నౌర్ ఇటీవల వెల్లడించారు. రైలు సేవలు, రహదారులు, శుద్ధి కర్మాగారాలు, పెట్రో రసాయనాలు, వాహన రంగం, చమురు, వాయువు, గ్యాసోలిన్, పర్యావరణ, విజ్ఞానాధారిత కంపెనీలు వంటి అంశాల్లో ఆ దేశాలతో సంయుక్త సహకారం, ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఇరాన్‌పై ఆంక్షల ప్రభావం చాలావరకు బలహీనపడుతుంది.
చాబహార్ ప్రాజెక్టుపై నీలినీడలు
వ్యూహాత్మక చాబహార్ ఓడరేవులో భారత్ అయిదు బెర్తులతో రెండు టెర్మినళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనివల్ల అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా, రష్యాలతో వాణిజ్య కార్యకలాపాలు మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది. రెండింటిలో ఒకటి 600 మీటర్ల కార్గో టెర్మినల్; మరొకటి 640 మీటర్ల కంటెయినర్ టెర్మినల్. 628 కి.మీ. పొడవైన రైలు మార్గం చాబహార్‌ను అఫ్గానిస్థాన్ సరిహద్దు పట్టణమైన జహెదన్‌తో అనుసంధానిస్తుంది.