తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొత్త సమస్యలతో చైనాకు 'పొరుగు' పోటు - పొరుగు దేశాలతో చైానాకు సమస్యలు

దక్షిణాసియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పలు పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యలు డ్రాగన్‌కు తలనొప్పిగా మారాయి. భారత్​తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్​, మయన్మార్​, పాకిస్థాన్​లతో మైత్రి బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

china border dispute
చైనాకు పొరుగు పోటు

By

Published : Dec 21, 2021, 9:28 AM IST

ఇంతకాలం దక్షిణాసియాపై ఆధిపత్యం కోసం సమయాన్ని, డబ్బును పెట్టుబడిగా పెట్టిన చైనా కొత్త సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఎన్నో దశాబ్దాల తరవాత- అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చైనా ఆర్థిక వృద్ధి 2021లో నెమ్మదించింది. ఇదంతా ఒక ఎత్తయితే.. పలు పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యలు డ్రాగన్‌కు తలనొప్పిగా పరిణమించాయి. ఒకవైపు భారత్‌తో ఎప్పటినుంచో సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతుండగా ఇతర దేశాలతోనూ చైనాకు పొసగడం లేదు. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌), బెెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టులను జిన్‌పింగ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఆగ్నేయ, పశ్చిమ, మధ్యాసియాను ఆఫ్రికా, ఐరోపాలతో అనుసంధానించేలా రోడ్లు, సముద్ర మార్గాలను నిర్మించేందుకు బీఆర్‌ఐను చేపట్టింది. సీపెక్‌లో గ్వాదర్‌ ఓడరేవు అత్యంత కీలకం. అయితే, పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ రేవుకు సంబంధించి అక్కడి స్థానికులు చైనా వ్యతిరేక నిరసనలు చేపట్టడం వల్ల కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. చైనా ఆగడాలతో తాము జీవనోపాధి కోల్పోతామని గ్వాదర్‌ ప్రజలు భయపడుతున్నారు. తమకు తాగునీరు, సముద్రంలో చేపల వేటకు అనుమతులివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తీవ్రవాదంతో సతమతమయ్యే బలూచిస్థాన్‌లో గ్వాదర్‌ రేవు ఉండటం కూడా డ్రాగన్‌కు ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటికే సీపెక్‌, బీఆర్‌ఐ ప్రాజెక్టుల్లో భారీయెత్తున ఖర్చుపెట్టిన చైనా, ఇప్పుడు నిధులు కరవై పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నట్లు విదితమవుతోంది. 2020లో బీఆర్‌ఐలో 54శాతం మేర పెట్టుబడులు తగ్గినట్లు చైనాకు చెందిన ఓ మేధా సంస్థ వెల్లడించింది.

శ్రీలంకతోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. శ్రీలంకలో 2017లో హంబన్‌టోట రేవు అభివృద్ధిని 99 ఏళ్ల లీజుకు తీసుకున్న చైనా కొలంబో రేవులో అంతర్జాతీయ కంటైనర్‌ టర్మినల్‌ కాంట్రాక్టునూ దక్కించుకుంది. శ్రీలంక, భారత్‌, జపాన్‌ సంయుక్తంగా తలపెట్టిన కొలంబో రేవు తూర్పు కంటైనర్‌ టర్మినల్‌ను సైతం తన వశం చేసుకుంది. ప్రస్తుతం మాత్రం శ్రీలంక-చైనాల మధ్య ద్వైపాక్షిక బంధం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. శ్రీలంకలోని మూడు ద్వీపాల్లో తలపెట్టిన పునరుత్పాదక కర్మాగారాల ప్రాజెక్టును పక్కన పెడుతున్నట్లు కొలంబోలోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది. భారత్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, మూడో వ్యక్తి నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సమస్యలే ఇందుకు కారణమని వివరించింది. శ్రీలంకకు చైనా చేసే ఎరువుల సరఫరా, వాటి నాణ్యతలో లోపాలు ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టినట్లు విదితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయిలో సేంద్రియ సాగును అమలు చేసిన తొలి దేశంగా నిలవాలని సంకల్పించి లంక రసాయనరహిత ఎరువులే కావాలంటూ చైనా పడవలకు అనుమతి నిరాకరించింది. అదే సమయంలో భారత్‌ సీ-17 యుద్ధవిమానాల ద్వారా సేంద్రియ ఎరువులను శ్రీలంకకు తరలించడం చైనాకు గిట్టలేదు.

మరోవైపు, బంగ్లాదేశ్‌తోనూ చైనా మైత్రి బలహీనపడింది. ఖర్చులు పెరిగిపోయాయంటూ బంగ్లాదేశ్‌లోని రెండు కీలక రైలు ప్రాజెక్టుల నుంచి డ్రాగన్‌ వైదొలగింది. చైనా తప్పుకోవడానికి భారత్‌ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఢాకా నగరాన్ని ఈశాన్య, వాయవ్య ప్రాంతాలతో అనుసంధానించేందుకు తోడ్పడే ఆ ప్రాజెక్టులు పూర్తయితే భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య సరకు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకోవైపు, పొరుగు దేశాల్లో మయన్మార్‌తో డ్రాగన్‌కు ఎక్కడా లేనన్ని చిక్కులు తలెత్తాయి. మయన్మార్‌తో 2,200 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే చైనా... ఆ దేశంలో భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఇరుదేశాల బంధం సందిగ్ధంలో పడిన కారణంగా మయన్మార్‌లోని ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా బీఆర్‌ఐలో కీలకమైన సీఎమ్‌ఈసీ (చైనా- మయన్మార్‌ ఆర్థిక నడవా) నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌ సైన్యం ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టింది. సైనిక చర్యకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమంటూ చైనా దూరంగా ఉండిపోయింది. ఫలితంగా డ్రాగన్‌పై వ్యతిరేకత పెరిగింది. కీలక ప్రాజెక్టులూ నిలిచిపోయాయి. భద్రతాపరమైన కారణాలతో పలు చైనా సంస్థలు సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు యత్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటికి తోడు మయన్మార్‌కు చెందిన పలు సాయుధ సంస్థలకు డ్రాగన్‌ బహిరంగంగా, రహస్యంగా మద్దతు ఇవ్వడం వల్ల పరిస్థితులు మరింతగా విషమించాయి. ఇలా- చుట్టూ ఉండే పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యలు డ్రాగన్‌ ఎదుగుదలకు అడ్డంకులుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఎలాంటి అడుగులు వేస్తుందనేది కీలకంగా మారింది.

- సంజీవ్‌ కె.బారువా

ఇదీ చూడండి :Coal Phase down: బొగ్గుకు అంచెలంచెలుగా మంగళం

ABOUT THE AUTHOR

...view details