పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon session) 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే సమయంలో ఎన్‌డీఏకు చెందిన ఇద్దరు మహిళా ఎంపీలు- కులాలవారీ జనగణన(caste census) అంశాన్ని లేవనెత్తారు. ప్రజాస్వామ్యంలో అన్ని విధాలుగా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఓబీసీలకు దక్కినప్పుడే సామాజిక న్యాయం అనే మాటకు అర్థం చేకూరుతుందని పేర్కొన్నారు. మరోవైపు, కులాలవారీ జనగణన డిమాండ్‌తో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Bihar CM Nitish kumar) నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ప్రధాని మోదీని కలిసింది. నీతీశ్ వెంటే, ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు.
సమగ్ర అభివృద్ధి పథకాలను రూపొందించేందుకు కులాలవారీ జనాభా లెక్కలు అత్యావశ్యకమని ప్రధానికి బిహార్ నేతలు విజ్ఞప్తి చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని సూచించారు. 35శాతం మంత్రి పదవులతో ఓబీసీ వర్గానికి తాము ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ఎన్‌డీఏ చెబుతున్నా- కులాలవారీ జనగణన కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ డిమాండ్లను పట్టించుకోకపోతే దుష్ప్రభావాలు తప్పకపోవచ్చని పలువురు భాజపా సభ్యులే అనుమానిస్తున్నారు. అందుకే పార్టీ నాయకత్వం వద్ద ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నారు. ఎన్ని డిమాండ్లు వస్తున్నా కేంద్రం మాత్రం ఇప్పటిదాకా సుముఖత చూపలేదు. 2021 జనాభా లెక్కల సేకరణలో కులాలవారీ గణన ఉండబోదని తేల్చిచెప్పింది.
కారణాలేమిటి?
కులగణన విషయంలో కేంద్రం నిర్ణయానికి కారణాలేమిటి? కులాలవారీ గణనను ప్రోత్సహిస్తే అత్యంత సున్నితమైన అంశాన్ని తిరగదోడినట్లవుతుందని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. 1931 జనగణన, ఇతర డేటా ఆధారంగా దేశంలో 52శాతం ఓబీసీ జనాభా ఉన్నట్లు మండల్ కమిషన్ నిర్ధారించింది. అప్పటిదాకా అగ్రవర్ణాలతో కలిసి జనరల్ కేటగిరీలో ఉన్న ఓబీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తరవాత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సర్వేలో భాగంగా 2011లో సామాజిక ఆర్థిక కులగణన(ఎస్‌ఈసీసీ)ను చేపట్టారు. అందులోని వివరాలను మాత్రం ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. అయితే దేశంలోని 46లక్షల కులాలు, ఉప కులాలకు చెందిన జాబితాను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ సంఖ్యను వర్గీకరించడం అతిపెద్ద సవాలు.