బోసినవ్వుల పసిబిడ్డలు, పేదింటి పడతుల దేహాలతో పైశాచిక వ్యాపారం చేస్తున్న మానవ అక్రమ రవాణా ముఠాలు దేశదేశాల సరిహద్దుల్ని చెరిపేస్తూ పేట్రేగిపోతున్నాయి. నెత్తుటికూడుకు అలవాటుపడ్డ నరహంతక వ్యాఘ్రాల స్వైరవిహారంతో ఏటా కోట్లాది జీవితాలు అర్ధాంతరంగా కడతేరిపోతున్నాయి. కొవిడ్ మహమ్మారి మోసుకొచ్చిన మహాసంక్షోభంతో సమస్య మరింతగా పెచ్చరిల్లుతోందన్న యూఎన్‌ఓడీసీ (మాదకద్రవ్యాలు, నేరాలపై ఐరాస కార్యాలయం) తాజా నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా ఇటువంటి హేయమైన నేరాలకు వెనుదీయని వారిపై ఉక్కుపాదం మోపడానికి మూడేళ్ల క్రితం మానవ అక్రమ రవాణా(నివారణ, పరిరక్షణ, పునరావాసం) బిల్లును మోదీ మంత్రిమండలి ఆమోదించింది. లోక్‌సభలో సమ్మతి పొందినా రాజ్యసభామోదం సాధించలేకపోయిన ఆ బిల్లుకు మార్పుచేర్పులు చేసిన కేంద్రం- రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చట్టరూపం కల్పించాలని తలపోస్తోంది.
భారత్ విఫలం
బాలికల అక్రమ రవాణాను నిరోధించి, బాధితులకు చేయూతనందించేలా ప్రత్యేక చట్టానికి పదునుపెట్టాలని 2004లోనే సుప్రీంకోర్టు సూచించినా- ప్రభుత్వాధినేతలు అలవిమాలిన తాత్సారం చేస్తూనే వచ్చారు. దందాసురుల వెన్నులో వణుకు పుట్టించేలా గరిష్ఠ శిక్షలను ప్రతిపాదిస్తున్న తాజా బిల్లును సత్వరం పట్టాలెక్కించాలని నోబెల్ పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థితో సహా ఎందరో ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 బిలియన్ డాలర్ల మేరకు విస్తరించిన మానవ అక్రమ రవాణా వ్యాపారం- ఇండియాలోని 335 జిల్లాల్లో పడగవిప్పి పెనువిపత్తుగా మారిందని ఐరాస గతంలోనే కుండ బద్దలుకొట్టింది. చిన్నారులు, యువతులను కట్టుబానిసలుగా మార్చే చీకటి దందాలను కట్టడి చేయడంలో భారత యంత్రాంగం వైఫల్యాన్ని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక సైతం తప్పుపట్టింది.
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు చొప్పున 'తప్పిపోతున్న' చిన్నారుల్లో 40-50 శాతం శాశ్వతంగా అదృశ్యమైపోతున్నారు! అక్రమ రవాణా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కిన రెండు కోట్ల మందికి పైగా అసహాయులు ఒళ్లు హూనమయ్యే వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. కాసులకక్కుర్తితో దారుణ నేరాలకు ఒడిగట్టే దుర్మార్గులకు సంకెళ్లు బిగించి, బాధితుల కన్నీళ్లు తుడిచేలా పకడ్బందీ కార్యాచరణకు ప్రభుత్వాలు నిబద్ధమైతేనే- అభాగ్యుల జీవన హక్కుకు భరోసా లభిస్తుంది!