కొవిడ్ కారణంగా- మహాభారతంలో కర్ణుడి రథ చక్రంలా కుంగిన పలు కీలక రంగాల్లో చిల్లర వర్తకం ఒకటి. అభివృద్ధికి ఆకాశమే హద్దు అని పలు అధ్యయనాలు నిరుడు చాటిన నేపథ్యంలో, ఉరుములేని పిడుగులా మహమ్మారి విరుచుకుపడి, కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌లు జతపడి దేశవ్యాప్తంగా చిల్లర వర్తక రంగం అక్షరాలా చితికిపోయింది. లాక్‌డౌన్ మొదలైన తొలి వంద రోజుల్లోనే ఏకంగా 15.5 లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని 40 వేల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత వర్తకుల సమాఖ్య నిరుడు జులై నెలలో వాపోయింది. లాక్‌డౌన్‌కు మినహాయింపులతో క్రమేణా దుకాణాలు తెరచుకొన్నా మునుపటి స్థాయిలో వ్యాపారాలు సాగక పలు విధాల రుగ్మతలతో అవి కిందుమీదులవుతూనే ఉన్నాయి.
రాయ్.. ప్రతిపాదనలు..
ఎకాయెకి అయిదు కోట్ల మందికి జీవనాధారమైన చిల్లర వర్తక రంగం ప్రస్తుతం పడుతూ లేస్తున్న అవస్థల్ని అధిగమించి ధీమాగా పురోగమించాలంటే- కేంద్ర ప్రభుత్వపరంగా వచ్చే బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల దన్ను తప్పనిసరిగా దక్కాలని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) గట్టిగా కోరుతోంది. వినియోగమే దేశార్థికానికి చోదకశక్తి అని, చిల్లర వర్తక రంగమే దానికి ముఖద్వారమన్న సూత్రీకరణ నూరుపాళ్లు నిజం. విధానపరమైన ప్రతిబంధకాల సంకెళ్లను తెగతెంచి, అభివృద్ధి సాధనకు అవసరమైన నిధుల లభ్యతను పెంచితేనే- చిల్లర వర్తకానికి కొత్త ఊపిరి అందుతుందన్నది 'రాయ్' విజ్ఞాపన సారాంశం. జాతీయ చిల్లర వర్తక విధానాన్ని సత్వరం రూపొందించి అమలు చేయాలని, ఎంఎస్‌ఎంఈల పరిధిలోకి ఈ రంగాన్నీ తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, కిరాణా దుకాణాలు 'డిజిటలైజేషన్' దిశగా మళ్ళేందుకు ముద్ర యోజన కింద ఆర్థిక తోడ్పాటు అందించాలనీ 'రాయ్' కోరుతోంది. సమగ్ర జాతీయ విధానం పట్టాలకెక్కితే 2024కల్లా అదనంగా 30 లక్షల ఉద్యోగాలు రానున్నాయన్న అధ్యయనాల దృష్ట్యా పటిష్ఠ కార్యాచరణకు కేంద్రం సమకట్టాలి!
భారత్ వెనకబాటు..