తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'పర్యావరణ హిత' పద్ధతుల్లో ఆనందంగా దీపావళి - దీపావళి బాణాసంచాపై సుప్రీంకోర్టు తీర్పు

ఒకప్పుడు దీపావళి అంటే.. దీపాల వరుసతో ఇళ్లన్నీ కనులవిందు చేసేవి. కొందరు మాత్రమే బాణాసంచా కాల్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. సందర్భం ఏదైనా బాణాసంచా కాల్చాల్సిందే! దీంతో బాణాసంచా తయారీలో వినియోగించే రసాయనాలతో పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకే పలు అంశాలను పరిశీలించి టపాసుల విక్రయాలపై మూడేళ్ల క్రితమే ఆంక్షలు విధించిన సుప్రీం ధర్మాసనం. ఈ క్రమంలో పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో ఆనందంగా ఆరోగ్యంగా పండగ సంబరాలు ఎంతో మేలని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Celebrating Diwali
దీపావళి సంబరాలు

By

Published : Nov 3, 2021, 7:11 AM IST

గత సంవత్సరం కాళీమాత పూజ సందర్భంగా పశ్చిమ్‌ బంగాలోదీపావళి విక్రయాలు, వినియోగాలపై కలకత్తా హైకోర్టు నిషేధపుటుత్తర్వులు జారీచేసింది. అప్పట్లో వాటిపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూనే 'పండగలే కాదు.. ప్రాణాలూ ముఖ్యమే'నని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తాజాగా అదే హైకోర్టు బాణసంచాపై టోకున నిషేధం విధించడాన్ని వ్యతిరేకించిన సుప్రీంకోర్టు- ఆంక్షలు వేటిపై ఎంతవరకు అన్న స్పష్టమైన విభజనరేఖను ప్రస్ఫుటీకరించింది. హరిత బాణసంచా తయారీ, విక్రయాలనే అనుమతిస్తున్నామన్న న్యాయస్థానం, యావద్దేశానికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయనీ వెల్లడించింది. దీపావళి, ఛాత్‌పూజ, క్రిస్మస్‌, నూతన సంవత్సరం.. ఏ సందర్భంగానైనా ధ్వని, కాంతి, కాలుష్య తీవ్రతలను ఇంతలంతలు చేస్తూ పెద్దయెత్తున టపాసులు కాలుస్తూ వినోదించడం ఆనవాయితీగా స్థిరపడింది. దివ్వెల పండుగ వేళ బాణసంచా కాల్చడం వల్ల అతిసూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5) మూడున్నర రెట్ల మేర పెరుగుతున్నట్లు ఆమధ్య విస్తృత అధ్యయనాలు ధ్రువీకరించాయి.

ఈసారి దీపావళికి ముందే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తరతమ భేదాలతో ఆంక్షలు, పరిమితులు ప్రకటించాయి. సాధారణ బాణసంచాకు నిప్పంటించి పేల్చగానే దట్టమైన పొగ, ధూళికణాలు పరిసరాల్లో ఆవరిస్తాయి. అల్యూమినియం, పొటాసియం నైట్రేట్‌, బేరియం లవణాలు తదితర హానికర రసాయనాలు లేకుండా రూపొందించే హరిత బాణసంచా వినియోగం వల్ల 30శాతం మేర కాలుష్యం తగ్గుతుందంటున్నారు. సీఐఎస్‌ఆర్‌ (పారిశ్రామిక వైజ్ఞానిక పరిశోధన కేంద్రం) చొరవతో తక్కువ కాలుష్యం వెదజల్లే హరిత టపాసుల్ని రూపొందించినట్లు కేంద్రం రెండేళ్లక్రితమే ప్రకటించింది. వాటి వినియోగానికే న్యాయపాలిక ఓటేస్తున్నా- జనచేతన పెంపొందించడంలో వ్యవస్థాగత అలసత్వం కొనసాగుతోంది. ప్రజానీకంలో అవగాహన ఇనుమడిస్తేనే, హరిత బాణసంచాను అనుమతించిన లక్ష్యం నెరవేరుతుంది!

ఆన్‌లైన్‌లో టపాసుల విక్రయాలపై మూడేళ్లక్రితమే ఆంక్షలు విధించిన సుప్రీం ధర్మాసనం- అనుమతి పొందిన వ్యాపారులే పరిమిత స్థాయిలో పొగను, శబ్దాన్ని వెలువరించే బాణసంచాను అమ్ముకోగల వీలుందని లక్ష్మణరేఖ గీసింది. వాస్తవిక కార్యాచరణలో ఉల్లంఘనల ఉదంతాలు పెచ్చరిల్లి వాతావరణానికి తూట్లు పడుతున్నాయి. బాణసంచాలో ఉపయోగించే విషరసాయనాల కారణంగా మూత్రపిండ సమస్యలు, చర్మ వ్యాధులు, రక్తహీనత ముట్టడించి నాడీవ్యవస్థ సైతం గాడితప్పుతున్నట్లు విశ్లేషణలు చాటుతున్నాయి. తక్కువ ధరకే వచ్చిపడుతున్న చైనా టపాసుల మూలాన ముప్పు పదిరెట్లు అధికమంటున్నారు. కొవిడ్‌ సంక్షోభం, రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో నిషేధాంక్షల నేపథ్యంలో ఈసారి గిరాకీ కుంగుదల రూపేణా చైనా వ్యాపారులకు రూ.50వేలకోట్ల మేర నష్టం వాటిల్లిందన్న అంచనాలు- బాణసంచా వినియోగ విస్తృతిని కళ్లకు కడుతున్నాయి. దేశీయంగానూ దశాబ్దాలుగా టపాసుల తయారీ, సరఫరాలే ప్రధాన జీవనాధారంగా లక్షల సంఖ్యలో కుటుంబాలు మనుగడ సాగిస్తున్నాయి.

దేశంలో బాణసంచా తయారీదారుల 'జీవనోపాధి పొందే' ప్రాథమిక హక్కు, పౌరులు ఆరోగ్యంగా జీవించే హక్కు- ఏదీ దెబ్బతినరాదన్న సదాశయంతో సుప్రీంకోర్టు గతంలోనే ప్రత్యేక ఏర్పాటు చేసింది. పండగల సమయంలో వినియోగించే మందుగుండు తయారీలో నిషేధిత పదార్థాలేవీ వాడకుండా చూసే పర్యవేక్షణాధికారాన్ని 'పెసో' (పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ)కు అప్పగించింది. వాస్తవంలో ఆ కీలకాంశం మరుగున పడిపోయి 'హరిత టపాసుల' తయారీలో బేరియం లవణాలు తదితరాల వాడకం కొనసాగుతున్నదన్న కథనాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి! దేశవ్యాప్తంగా సుమారు 80లక్షల మందికి జీవనాధారమైన బాణసంచా పరిశ్రమను సాకల్యంగా ప్రక్షాళించి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలి. పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో ఆనందంగా ఆరోగ్యంగా పండగ సంబరాలు నిర్వహించుకోవడం భావితరాలకూ ఎంతో మేలన్న సామాజిక స్పృహ ప్రజానీకంలో పొంగులెత్తాలి. కాలుష్య ధూమానికి ఉమ్మడిగా కళ్లెం వెయ్యగలిగిననాడే- జాతికి నిజమైన దీపావళి!

ఇదీ చూడండి:'టపాసులు లేకుండానే దీపావళి.. మెజార్టీ ప్రజల ఆలోచన ఇదే!'

ABOUT THE AUTHOR

...view details