భారత్, చైనాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చల్లబరచే కసరత్తులో భాగంగా- ఇరుపక్షాల సైనికాధికారుల స్థాయిలో ఎన్ని సమావేశాలు జరిగినా పీటముడి మాత్రం వీడటం లేదు. గత కొన్ని నెలలుగా అన్ని కోర్ కమాండర్ల సమావేశాల మాదిరిగానే ఇటీవల 14 గంటలపాటు నిర్వహించిన సుదీర్ఘ సంప్రతింపులు సైతం ఫలితాన్ని ఇవ్వలేదు. పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగం, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్ ప్రాంతాల్లో చైనా తనకు ఆధిపత్యం ఉన్న భాగాల నుంచి వెనక్కితగ్గే విషయంలో ఆలోచన చేయడంతోపాటు, భారత సైన్యం ఇటీవల ఆక్రమించిన పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని ఆధిపత్య ప్రాంతాల నుంచి వైదొలగాలనీ చైనా ప్రజావిముక్తి సైన్యం (పీఎల్‌ఏ) ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయినప్పటికీ త్వరలోనే మళ్లీ సంప్రతింపులు కొనసాగించాలని ఇరుపక్షాలూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సమావేశాలు, సంప్రతింపులకు సంబంధించి అన్ని స్థాయుల్లోని యంత్రాంగాలు విఫలమైన నేపథ్యంలో పరిష్కార భారం ఇరుదేశాలకు చెందిన అగ్రనేతలపైనే పడింది. ఎందుకంటే, భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బలమైన జాతీయవాద నేతలుగా ప్రస్తుతం అత్యధిక ప్రజాదరణతో అధికార పీఠాలపై కొనసాగుతున్న పరిస్థితుల్లో ఒప్పందాల్ని కుదుర్చుకోవడం, అమలు చేయడం సులభ సాధ్యమవుతుందనే అంచనాలున్నాయి. లేనిపక్షంలో ప్రస్తుత వాతావరణమే కొనసాగితే, వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు మరింత దిగజారి, ఘర్షణలు పెచ్చరిల్లే అవకాశం ఉంది. చైనా మన దేశంతో బహిరంగ పోరుకు మొగ్గుచూపితే- ప్రామాణిక నిర్వహణ విధివిధానాలు, ఇతరత్రా నియమాలూ నిష్ఫలంగా మారిపోయే ప్రమాదముంది.
నవంబర్ నెలలో, ఆ తరవాత వాస్తవాధీన రేఖ వెంబడి వాతావరణ పరిస్థితులు మానవ కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో ప్రతికూలంగా మారిపోతాయి. భారీగా మంచుకురవడం, వణికించే చలి, గడ్డకట్టించే వాతావరణంలో మానవ కార్యకలాపాలే సాగించలేని పరిస్థితుల్లో పోరాటం సాధ్యమయ్యే పనికాదు. మరోవైపు, మంచుతో నిండిపోయిన హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక మోహరింపు, సామగ్రి తరలింపును మున్ముందు మంచు కరిగే వరకు కొనసాగించడం ఇరుదేశాలకూ ఆర్థికంగా పెనుభారమే అవుతుంది. ఆర్థిక కారణాలు, కొవిడ్ మహమ్మారి ప్రభావంతో తిరోగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఎదుట అక్టోబర్ నుంచి జనవరి వరకు పండగల సీజన్ ఉంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో వినియోగ వస్తువులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనం కలిగించడంతోపాటు, నష్టాలనూ పరిహరించే వీలుంది. వ్యూహాత్మక ప్రణాళికలకు పేరొందిన చైనా వాస్తవాధీన రేఖ వెంబడి కయ్యాలకు దిగేందుకే యత్నించే అవకాశాలున్నా... సరిహద్దుల్లో అదనంగా 40 వేలమంది సైనికుల నిర్వహణను భరించడం డ్రాగన్ ఆర్థిక వ్యవస్థకు తలకుమించిన భారంగా పరిణమించే అవకాశం లేకపోలేదు.
సెప్టెంబర్ 4న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాస్కోలో చైనా విదేశాంగ మంత్రి వీ ఫెంఘెను కలిసి చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైనా ప్రతినిధితో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ జులై 6న చైనా ప్రతినిధి వాంగ్ యీతో సంప్రతింపులు జరిపారు. అదేవిధంగా జూన్ 6, జూన్ 22, జూన్ 30, జులై 14, ఆగస్టు 2 తేదీల్లో లఫె్టినెంట్ జనరల్ స్థాయుల్లో సమావేశాలు జరిగాయి. అయినా పరిస్థితులు మారలేదు. ఇప్పటి వరకు సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడంలో అన్ని రకాల యంత్రాంగాలు విఫలమైన క్రమంలో తిరిగి మోదీ, జిన్‌పింగ్ స్థాయులో చర్చలకు వెళ్లాల్సిన అవసరాన్ని పరిస్థితులు సూచిస్తున్నాయి. భారత, చైనా సమస్యలకున్న లక్షణం ఏమిటంటే- ఇరుదేశాలకు సంబంధించి అత్యున్నత స్థాయిలో పరిష్కారం లభించాల్సిందే. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యలను కొలిక్కి తీసుకురావడానికి అది తప్పనిసరి కూడా. సైనిక, దౌత్య వర్గాల స్థాయిలో చర్చలు సమస్యల్ని సమగ్రంగా పరిష్కరించలేవు. ఒకవైపు మునుపెన్నడూ లేనిస్థాయిలో హిమాలయాల్లో సైనిక మోహరింపు, ఆయుధ సాధన సంపత్తి తరలింపు, సంబంధిత ఏర్పాట్లు జరుగుతుండగానే- భారత, చైనాల మధ్య సంప్రతింపులు సాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరువైపులా లక్షకుపైగానే సైనికుల్ని వాస్తవాధీన రేఖ వెంబడి, అత్యంత కీలక ప్రాంతాల్లో మోహరించినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణాపరమైన ఏర్పాట్లకు సంబంధించిన సంసిద్ధత శరవేగంగా సాగుతోంది. చైనా తొలిసారిగా వాస్తవాధీన రేఖ వెంబడి భారీ స్థాయిలో తన బలగాలను మోహరిస్తుండగా, భారత్ పాకిస్థాన్‌పై అమలుచేసే సైనిక ఎత్తుగడను చైనా కేంద్రీకృత వ్యూహంగా మార్చి అమలు చేస్తోంది.
- సంజీవ్ బారువా