రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికలు వాయిదా పడటం వల్ల ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించే తీరాలన్న సంకల్పంతో ముందుకెళ్ళిన శ్రీలంక అనుకున్నది సాధించింది. మొత్తం 71 శాతం ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో మహింద రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ మూడింట రెండొంతుల అద్భుత మెజారిటీతో విజయదుందుభి మోగించడం విశ్లేషకులనూ ఆశ్చర్యపరచిన పరిణామం.
అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తున్న 19వ రాజ్యాంగ సవరణను ఎత్తివేయడమో లేదా దానికి మార్పులు తీసుకురావడమో చేస్తామన్న హామీతో ప్రధాని పదవి చేపట్టిన మహింద రాజపక్స ఇప్పుడు ఎలాంటి అడుగు వేయనున్నారన్నది ప్రశ్నగా మారింది. స్వయంగా తన సోదరుడు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితుల్లో- ప్రధానిగా తన అధికారాలకు, పార్లమెంటు విశేష అధికారాలకూ కోతపెట్టి అధ్యక్షుడికి అగ్రాసనం కట్టబెట్టేందుకు మహింద ఎంతమేరకు ముందుకు వస్తారన్నదే శ్రీలంకలో విస్తృత చర్చనీయాంశంగా మారింది.
భారత్ దక్షతకు పరీక్ష
మైత్రిపాల సిరిసేన, విక్రమసింఘేల నడుమ అంతర్గత పోరు ముదురు పాకానపడటం; ఈస్టర్ పర్వదినాన ఉగ్రదాడుల్లో 290కిపైగా అమాయకులు అసువులు బాసిన నేపథ్యంలో- 2019 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ రాజపక్స అప్రతిహత విజయం సాధించారు. విపక్షమైన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) ప్రస్తుత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లతో సోదిలో కూడా లేకుండా పోయింది.
స్వయంగా సోదరులిరువురూ అధ్యక్ష, ప్రధాని స్థానాలను అలంకరించడం; విపక్షాలు దాదాపుగా గల్లంతు కావడం, ప్రశ్నించే గళాలకు చోటులేకపోవడం వంటివి- ఇరువురు రాజపక్సల తీరుతెన్నులను ఎలా ప్రభావితం చేయనున్నాయన్నది ఆసక్తికరం. రాజకీయంగా ఎదురులేని ఈ వాతావరణం వారిని నియంతలుగా మారుస్తుందా అన్న భయానుమానాలూ లేకపోలేదు. మహింద రాజపక్స ఉత్థానం భారత్, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకాంశం.
మూడుసార్లు ప్రధానిగా (ప్రస్తుత గెలుపుతో నాలుగోసారి), రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా విశేష పాలనానుభవం గడించిన మహింద రాజపక్సతో తొమ్మిదో దశకంలో భారత్ సన్నిహిత సంబంధాలే నెరపింది. తరవాతి కాలంలో రాజపక్స చైనాతో రాసుకు పూసుకొని తిరగడం, శ్రీలంకలోని తమిళ మైనారిటీల రాజకీయ హక్కులను కాలరాయడంతో ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం కొంతమేర బలహీనపడింది.
చైనా వ్యూహాలు..
నిరుడు నవంబరులో గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికవడం, తాజాగా కళ్లు చెదిరే మెజారిటీతో మహింద రాజపక్స విజేతగా నిలిచిన దృష్ట్యా- ఇరుదేశాల అనుబంధ పునరుద్ధరణపై భారత్ తీక్షణంగా దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకను ప్రభావితం చేసి తన కనుసన్నల్లోకి తెచ్చుకునేందుకు కొన్నేళ్లుగా చైనా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే నేపాల్‌ను భారత్‌పైకి ఉసిగొల్పడంలో బీజింగ్ నాయకత్వం విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో చైనా ప్రభావానికి లోబడి మరో పొరుగు దేశం శ్రీలంక సైతం భారత్‌కు ప్రతికూలంగా మారకుండా జాగ్రత్తపడాల్సిన చారిత్రక అవసరం మోదీ సర్కారు ముందుంది. అధికారికంగా పూర్తి ఫలితాలు వెల్లడికాక మునుపే, ప్రపంచ దేశాల నాయకులందరికన్నా ముందే మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభకామనలు తెలపడం ఈ క్రమంలో ఓ ముందడుగనే చెప్పాలి.
విదేశీ జోక్యంతో..
కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి శ్రీలంకతో చేసుకున్న ఒప్పందాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది. మరీ ముఖ్యంగా కొలంబో ఓడరేవులోని తూర్పు కంటైనర్ టర్మినల్(ఈసీటీ) పేరిట తలపెట్టిన సరకుల రవాణా ప్రాజెక్టు పట్టాలకెక్కడం వ్యూహాత్మకంగా భారత్‌కు చాలా అవసరం. సుదీర్ఘ చర్చోపచర్చల తరవాత 2019 మేలో 70 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో జపాన్, ఇండియాలు సంయుక్తంగా ఈసీటీ అభివృద్ధికి శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.