ఒక్క జర్మనీ తప్ప ఐరోపాలోని ఏ దేశ జనాభాతో పోల్చినా బిహార్లో ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ఎకాయెకి 7.29 కోట్లమంది ఓటర్లతో అలరారే బిహార్‌లో పదిహేడో అసెంబ్లీ ఎన్నికల రంగంలో రేపే తొలి విడత పోలింగ్ పండగ! ముసురుకొన్న కొవిడ్ పెను ముప్పునుంచి ఎన్నికల ప్రక్రియను కాచుకొనేలా షెడ్యూలు ఖరారు చేసిన ఈసీ- మొట్టమొదటిసారిగా లక్షకుపైగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. మానవాభివృద్ధి సూచీల్లో వెనకబాటుకు పెట్టింది పేరైన బిహార్- కొవిడ్ మహమ్మారి, భీకర వరదలతో కుదేలైన నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలివి. కుల సమీకరణలకు రాజకీయ మాయోపాయాల్ని మేళవించి ఉట్టిని కొట్టే కళలో రాటుదేలిపోయిన పార్టీలే అన్నీ! అగ్రవర్ణాలు, భూమిహార్లు, యాదవేతర ఓబీసీల్లో ఒక వర్గానికి ప్రతినిధిగా భాజపా, నిమ్న కులాలు మహాదళితులు ఈబీసీల దన్నుతో జేడీ (యు), ముస్లిములు యాదవుల ఓటు బ్యాంకుతో ఆర్‌జేడీ బరిలో గిరిగీసి నిలిచిన రణక్షేత్రంలో- ఏ రెండు పార్టీలు చేతులు కలిపినా మూడో పక్షం గెలుపు దుర్లభమని ఇటీవలి చరిత్ర చాటుతోంది.
2010లో భాజపాతో కలిసి విజయ తీరాలకు చేరిన జేడీ(యు), 2015లో ఆర్‌జేడీతో పొత్తు కుదుర్చుకొని కమలనాథుల్ని చిత్తుచేసింది. 2017లో తిరిగి ఎన్‌డీఏ పంచకు చేరిన నితీశ్ కుమార్ 'సుశాసన్ బాబు'గా మరో దఫా ముఖ్యమంత్రిత్వం కోసం స్వేదం చిందించాల్సి వస్తోందంటే- క్షేత్రస్థాయి వాస్తవాలు బెంబేలెత్తిస్తుండటమే కారణం. కొవిడ్ వల్ల ఉన్న ఉద్యోగాలు కోల్పోయి బిహార్ తిరిగి వెళ్ళిన 22 లక్షలమంది వలస శ్రామికులకు బతుకు తెరువు కొరవడటం- తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందేమోనన్నది జేడీ(యు) నేతల భయం. 'సాత్ నిశ్చయ్' పేరిట 2015లో చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకొన్నామని, వాటికి కొనసాగింపుగా మరో ఏడింటిని సంకల్పిస్తున్నామంటున్న జేడీ(యు)-పది లక్షల ప్రభుత్వోద్యోగాలిస్తామన్న ఆర్‌జేడీ ప్రణాళికను తూర్పారపడుతోంది! అదే సమయంలో 'ఆత్మ నిర్భర్ బిహార్'ను నినదిస్తూ, 19 లక్షల ఉద్యోగాల కల్పనకు భాజపా వాగ్దానం- రాజకీయ యవనికను రసవత్తరం చేస్తోంది!
బిహార్లో ఏ విధంగా చూసినా నితీశ్ కుమార్‌కు ప్రత్యామ్నాయం లేదు. దానికి తోడు భాజపా దన్నుతో 10-12శాతం అదనపు ఓట్ల లబ్ధి తథ్యమంటున్నాయి సామాజిక సమీకరణల అధ్యయనాలు! కాబట్టే ముందస్తు సర్వేలు చిరాగ్ పాస్వాన్ లాంటి వారికి అవకాశమే లేదంటూ జేడీ (యు) భాజపా విజయం నల్లేరు మీద బండి నడకేనని తీర్మానిస్తున్నాయి. 'మూడు విడతల పాలనలో నితీశ్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ అందించారు. ప్రతి పొలానికీ నీరందించడానికి మరో అవకాశం కావాలంటున్నారు. ఉద్యోగ కల్పన, వలసల నిర్మూలన కోసం ఆయనకు ఇంకో 50 ఏళ్లు కావాలా?' అన్న సగటు ఓటరు సూటి ప్రశ్న పాలక కూటమిని బోనెక్కిస్తోంది.
2004-05లో పట్టణ ప్రాంత నిరుద్యోగిత రేటు ప్రతి వెయ్యికి 64గా నమోదుకాగా 2018-19 నాటికది 105కు చేరిందని ఆర్‌బీఐ నివేదికే వెల్లడించింది.
గ్రామాల్లో నిరుద్యోగితా 15 నుంచి 102కు పెరిగిందంటున్న నివేదిక, పారిశ్రామిక కార్మికుల సంఖ్య తీసికట్టుగా మారిందని స్పష్టీకరించింది.