డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయకపోతే అగ్రరాజ్య హోదా చేజారిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలా ముందుగానే పసిగట్టారు. ఈ క్రమంలో చైనా ఆర్థిక శక్తిని లక్ష్యంగా చేసుకొనేలా వ్యూహం పన్నారు. ఇందుకు ఐరోపా సమాఖ్య సహకారం అవసరమని గుర్తించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ దురుసుతనం కారణంగా దూరమైన మిత్రులను బుజ్జగించే పనిని వేగవంతం చేశారు. బైడెన్ తీరు ఐరోపా సమాఖ్యలో మార్పును తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బైడెన్ అమెరికా పాత మిత్రదేశాలకు భరోసానిచ్చేందుకు తాజాగా చేపట్టిన ఐరోపా యాత్ర విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
నోరు పారేసుకుంటున్న డ్రాగన్
డ్రాగన్‌కు వ్యతిరేకంగా బైడెన్ చేపట్టిన చర్యలతో చైనా-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన సమగ్ర పెట్టుబడుల ఒప్పందం (సీఏఐ) నిలిచిపోయింది. ఈ పరిణామాలు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఒప్పందం కోసం ఇరుపక్షాలు 2013 నుంచి ఏడేళ్లపాటు 35 విడతలకు పైగా చర్చలు జరిపాయి. బైడెన్ శ్వేతసౌధంలోకి అడుగుపెడితే ఇది ప్రమాదంలో పడుతుందని గ్రహించిన చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ రంగంలోకి దిగారు. ఐరోపా సమాఖ్యకు తాయిలాలు ఇచ్చి ఒప్పందంపై చర్చలను కొలిక్కి తెచ్చారు. ఈ ఒప్పందం వల్ల వాహన, రసాయన, వైద్య, ఆర్థిక సేవల రంగాల్లోని కంపెనీలకు చైనా మార్కెట్లో లబ్ధి చేకూరుతుంది. వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్తు వాహనాల మార్కెట్ జర్మనీకి చాలా కీలకం. దీంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్- ఈ ఒప్పందం కోసం చొరవ చూపారు.
చిన్నచూపు..
చైనాతో సంబంధాలపై ఐరోపా సమాఖ్య 2019లో విడుదల చేసిన వ్యూహపత్రం మూడు అంశాలను తేటతెల్లం చేసింది. డ్రాగన్‌ను పర్యావరణం వంటి అంశాల్లో భాగస్వామిగా; వ్యాపారం వంటి ఆర్థిక అంశాల్లో వ్యూహాత్మక పోటీదారుగా; విలువ, పరిపాలన వ్యవస్థ వంటి విషయాల్లో విరోధిగా పరిగణిస్తోంది. 'మా దేశాల మార్కెట్‌లోకి ప్రవేశం కల్పిస్తున్నాం.. అంతమాత్రాన మానవ హక్కులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే తీరును ఉపేక్షించబోం..' అనే ఐరోపా సమాఖ్య వ్యవహార శైలిని అర్థం చేసుకోవడంలో చైనా బోల్తాపడింది. దాని దృష్టిలో ఐరోపా సమాఖ్య అంటే 'అమెరికా అనుచర బృందం' అనే చిన్నచూపు ఉంది.
తాజాగా సమగ్ర పెట్టుబడుల ఒప్పందం మూలనపడటానికి వీఘర్ల అంశం కారణమైంది. షింజియాంగ్ ప్రాంతంలో వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మార్చిలో అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య చైనా అధికారులపై ఆంక్షలు విధించాయి. 1989 తియనాన్మెన్ ఉదంతం తరవాత తొలిసారి ఐరోపా సమాఖ్య చైనాపై ఆంక్షలు విధించింది. ఇందుకు ప్రతిగా ఈయూకు చెందిన పది మందితో పాటు నాలుగు సంస్థలపై డ్రాగన్ ఆంక్షలు విధించింది. అంతేకాదు- జర్మన్లను నాజీలని, నమీబియన్ల హంతకులని నోరు పారేసుకొంది. ఈ పరిణామాలతో ఐరోపా సమాఖ్య పెట్టుబడుల ఒప్పందాన్ని 'ఆమోదించే ప్రక్రియ'ను నిలిపివేసింది.