తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంస్థానాల విలీనానికి ఉపయోగపడిన ఆయుధం.. 'రాజభరణం'

హమ్మయ్య.. ఆంగ్లేయులు వెళ్లిపోతున్నారు.. స్వాతంత్య్ర సమరం ముగిసిందని సంబరపడేంతలో అనుకోకుండా అనివార్యంగా భారతావని ముందుకు మరో యుద్ధం ముంచుకొచ్చింది. అదే సంస్థానాల విలీనం. ఇదీ ఓ యుద్ధమే.. అప్రకటిత యుద్ధం. విదేశీయులపై కాదు.. స్వదేశీయులపైనే! సామదానభేద దండోపాయాలతో సాగిన ఈ సమరంలో సర్దార్‌ పటేల్‌, ఆయన బృందానికి ఉపయోగపడిన అస్త్రం.. రాజభరణం.

princely states
రాజ్యాలు

By

Published : Aug 8, 2022, 7:16 AM IST

ప్రపంచ చరిత్రలోకి తొంగిచూస్తే ఎన్నో దేశాలు స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాయి. కానీ.. భారత్‌కు వచ్చిన స్వాతంత్య్రం మాత్రం భిన్నమైంది. అంతకుముందు మరే దేశానికీ ఎదురవని ప్రత్యేకమైంది. బ్రిటిషర్లు వెళ్లిపోతూ నిప్పు రాజేశారు. 'మహారాజులారా! స్వాతంత్య్రం ఇస్తున్నాం. ఇక భారత్‌లో ఉంటారో, పాకిస్థాన్‌లో చేరతారో.. స్వతంత్ర దేశంగా ఉంటారో మీ ఇష్టం..' అని చిచ్చుపెట్టారు. అందుకే పైకి కనిపించినట్లుగా.. కేవలం రెండు దేశాలుగా మాత్రమే భారత్‌ విడిపోలేదు. భారత్‌, పాకిస్థాన్‌లతోపాటు దేశం దాదాపు 560 ముక్కలైంది.

ఈ క్రమంలో సంస్థానాధీశుల్ని ఒప్పించి వారి రాజ్యాలను దేశంలో విలీనం చేయటమే భారత నాయకత్వం ముందు పెద్ద పరీక్షగా నిలిచింది. ఎందుకంటే.. 40% దేశ భూభాగం సంస్థానాధీశుల ఆధీనంలో ఉంది. దేశ జనాభాలో 28% వరకు 560 స్వదేశీ రాజ్యాలలోనే ఉంది. వీటన్నింటినీ విలీనం చేయకుంటే స్వరాజ్యానికి అర్థంలేని పరిస్థితి. మరోవైపు దేశ విభజనకు మతమే ప్రాతిపదిక అన్న మహమ్మద్‌ అలీ జిన్నా.. ఆ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి.. హిందువులు అధికంగా ఉన్న సంస్థానాధీశులనూ పాకిస్థాన్‌లో కలవాలని ప్రోత్సహించసాగాడు. జోధ్‌పూర్‌ మహారాజుకు ఏకంగా బ్లాంక్‌ చెక్‌ ఇచ్చాడు. దీంతో భారత నాయకత్వం అప్రమత్తమైంది. సామదానభేద దండోపాయాలను ప్రయోగించి వాటన్నింటినీ దారిలోకి తెచ్చే పని మొదలెట్టారు సర్దార్‌ పటేల్‌, ఆయన బృందం. రాజకీయ, అంతర్జాతీయ కారణాలతో నాలుగైదు మినహా మిగిలిన సంస్థానాలన్నీ విలీనానికి అంగీకరించాయి. కానీ.. ఒప్పందంపై సంతకానికి ముందు సంస్థానాలన్నీ ముక్తకంఠంతో అడిగిన ప్రశ్న.. విలీనమైతే మాకేంటి?

అప్పటిదాకా సకల సౌకర్యాలూ అనుభవిస్తూ.. రాజులుగా, సంస్థానాధీశులుగా, జమీందార్లుగా పాలించిన వారు భారత్‌లో విలీనమైతే ఉన్నపళంగా సామాన్యుల్లా మిగిలే పరిస్థితి తలెత్తింది. హోదాలు, దర్పాలు, సౌకర్యాలు వదులుకోవాల్సి వస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. అందుకే.. విలీన ప్రక్రియ బాధ్యత చేపట్టిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ముందు వారంతా.. 'రాజ్యాలు వదులుకుంటాం. మాకేంటి గిట్టుబాటు? మా హోదాకు ఏదీ చెల్లుబాటు?' అంటూ గగ్గోలు పెట్టారు. రాజయోగం ఎలాగూ లాగేసుకుంటారు.. కనీసం రాజభోగాలైనా మిగలనివ్వండి అంటూ తెలివిగా రాయబారాలు ప్రారంభించారు. మరికొందరేమో రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల అధికారాలనే కేంద్రానికి దఖలు పరుస్తామన్నారు.

వారి మనోగతాన్ని గ్రహించిన భారత నాయకత్వం విలీన ప్రక్రియ శాంతియుతంగా, సాఫీగా సాగడానికి వీలుగా.. వారికి ఏటా కొంత సొమ్మును ఖర్చుల కింద ఇవ్వటానికి అంగీకరించింది. ఇదే రాజభరణం (ప్రీవీ పర్స్‌)! సంస్థానాధీశులు తమ సార్వభౌమత్వాన్ని మన దేశానికి దఖలు పరిచినందుకు ఈ రాజభరణం ఇచ్చారు. రాజ్యాంగంలోని 291, 362 అధికరణాల కింద దీనికి రక్షణ కల్పించారు. సంఘటిత నిధి(కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) నుంచి ఈ మొత్తాన్ని చెల్లించారు. ఇందులో భాగంగానే 34 రకాల అధికారాలను సైతం వారికి ఇచ్చారు. పూర్వ మహారాజులకు ప్రజాదర్బార్ల నిర్వహణకు అనుమతి లభించింది. సంస్థానాధీశుల సోదరులకు కూడా మనదేశ చట్టాల నుంచి మినహాయింపులు లభించాయి. ఈ భరణం కనిష్ఠంగా ఏటా రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఉంది. అయితే.. హైదరాబాద్‌, మైసూరు లాంటి సంస్థానాలతో ఉదారంగా వ్యవహరించారు. మైసూరు మహారాజుకు రాజభరణం కింద అత్యధికంగా రూ.26 లక్షలు చెల్లించారు. తొలుత హైదరాబాద్‌ నవాబు రూ. 42,85,714 పొందారు. అత్యల్పంగా రాజస్థాన్‌లో కొటోడియా పూర్వపాలకునికి రూ.192 మాత్రమే అందించారు.

ఇందిర హయాంలో రద్దు:
1949 అక్టోబరు 12న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో కాంగ్రెస్‌ సభ్యులు అనేకమంది రాజభరణాలను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ సమైక్యతను కాపాడటానికి ఈ చిన్న మొత్తాన్ని వారికివ్వలేమా? అని సర్దార్‌ పటేల్‌ వారిని ఒప్పించారు. కానీ.. ఇది సుదీర్ఘకాలం నిలబడలేదు. ఏటికేడు ఆర్థికభారం పెరిగిపోవడంతో 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 26వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేసింది.

ఇవీ చదవండి:పటేల్​ను ఉక్కుమనిషిని చేసిన మేనన్.. డిగ్రీలు లేకున్నా దేశాన్ని ఏకం చేసి..

లార్డ్ మౌంట్​బాటెన్.. వలస పాలన ముగించిన వీరుడా?.. అగ్గిరాజేసిన విలనా?

ABOUT THE AUTHOR

...view details