తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన షికాగో రేడియో స్పీకర్స్‌

Azadi Ka Amrit Mahotsav షికాగో అనగానే భారతీయులకు స్వామి వివేకానంద విఖ్యాత ప్రసంగ వేదిక గుర్తుకొస్తుంది. కానీ షికాగో పేరుకు భారత స్వాతంత్య్రోద్యమానికీ విడదీయరాని అనుబంధముంది. దఫదఫాలుగా గుంపుల వద్దకు వెళ్లి చెప్పిందే చెబుతున్న గాంధీజీ పీలగొంతు కష్టాన్ని చూసి గెయిన్‌చంద్‌ మోత్వానే మదిలో పుట్టిందే షికాగో రేడియో స్పీకర్స్‌. స్వాతంత్య్రోద్యమంలో నాయకుల గళాలను సామాన్య ప్రజలకు చేరువ చేయటమేగాకుండా బ్రిటిష్‌పై పోరాటానికి ప్రజల్ని సమాయత్తం చేయటంలో తరంగమై నిలిచిందిది.

CHICAGO RADIO SPEAKERS
CHICAGO RADIO SPEAKERS

By

Published : Aug 13, 2022, 4:26 PM IST

Azadi Ka Amrit Mahotsav: నాయకులను చూడాలని.. చెప్పేది వినాలని వారు ఎక్కడికెళ్లినా అశేష జనవాహిని వచ్చేది. కానీ అప్పట్లో ఇప్పటిలా ప్రత్యక్ష ప్రసారాల్లేవు. స్క్రీన్‌లు లేవు. అంతెందుకు లౌడ్‌స్పీకర్లే లేవు. ఫలితంగా.. ఒకేసభలో వివిధ వేదికల వద్దకు వెళ్లి చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పాల్సి వచ్చేది. ప్రజల్ని పదేపదే మౌనంగా ఉండాలని కోరుతూ.. తాము చెప్పేది వినిపించేలా నాయకులు కష్టపడాల్సి వచ్చేది. తన సన్నటి గొంతుతో ప్రజల్ని చేరటానికి గాంధీజీ పడుతున్న కష్టాన్ని.. కాంగ్రెస్‌ కార్యకర్తగా ఓసారి ప్రత్యక్షంగా చూసిన గెయిన్‌చంద్‌ మోత్వానే.. వేలమందికి సులువుగా ఆ గొంతు చేరేలా చేయాలనుకున్నారు. ఫలితమే.. షికాగో టెలిఫోన్‌, రేడియో కంపెనీ (ప్రస్తుతం మోత్వానే ప్రైవేట్‌ లిమిటెడ్‌)! అదే గాంధీ, నెహ్రూ, పటేల్‌ తదితర నాయకుల గొంతులనూ, స్వాతంత్య్ర నినాదాలనూ.. యావత్‌ భారతీయుల చెవుల్లో మార్మోగేలా చేసింది.

గెయిన్‌చంద్‌ మోత్వానేది సింధ్‌ రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది). తండ్రి దీవాన్‌ చందుమల్‌ మోత్వానే ప్రముఖ న్యాయవాది. 1890లో.. గెయిన్‌చంద్‌కు 12 ఏళ్ల వయసులోనే చందుమల్‌ మరణించారు. తండ్రి పోయాక కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కుటుంబాన్ని నడుపుతూ.. బుక్‌బైండింగ్‌, రబ్బర్‌ స్టాంపులు, పతంగులు తయారు చేస్తూ రోజుకు రూ.2 సంపాదించేవారు గెయిన్‌చంద్‌. మెట్రిక్యులేషన్‌కు ముందే చదువు ఆపేసినా.. ఆయనలోని సాంకేతిక జిజ్ఞాస తగ్గలేదు. టెలిగ్రఫీ నేర్చుకోవటంతో రైల్వే సిగ్నల్‌ విభాగంలో కొలువు వచ్చింది. పనితీరు బాగుండటంతో తొందరలోనే.. వాయువ్య రైల్వే పోస్ట్స్‌-టెలిగ్రాఫ్స్‌లో టెలిగ్రాఫ్‌ మాస్టర్‌గా పదోన్నతి లభించింది. నిరంతర పరిశోధనలు ఆయన్ను నిలవనివ్వలేదు.

CHICAGO RADIO SPEAKERS

Azadi Ka Amrit Mahotsav
1909లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. రూ.300లతో ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఆరంభించారు. జర్మనీ నుంచి ఫ్లాష్‌లైట్లను తెప్పించి అమ్మేవారు. కార్యాలయంలో క్లర్క్‌, టైపిస్ట్‌, ఇంజినీర్‌ పనులతోపాటు వస్తువులను మూటగట్టి పంపించే పని కూడా తానే చేసేవారు గెయిన్‌చంద్‌. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా జర్మనీ నుంచి దిగుమతులు ఆగిపోయాయి. అమెరికా, గ్రేట్‌ బ్రిటన్‌ల వైపు దారులు తెరచి.. 1919లో కంపెనీని బొంబాయికి మార్చారు. షికాగో టెలిఫోన్‌ సప్లయ్‌ కంపెనీని కొత్తగా మొదలెట్టారు. అమెరికాలోని షికాగో కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా.. వారి అనుమతితో అదే పేరు వాడుకున్నారు గెయిన్‌చంద్‌. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో... సొంతగా రేడియో ట్రాన్స్‌మిటర్‌ తయారు చేసి.. బొంబాయి ప్రెసిడెన్సీ రేడియోక్లబ్‌ లిమిటెడ్‌ ద్వారా బ్రాడ్‌కాస్టింగ్‌ కూడా ఆరంభించారు.

వ్యాపారం కొనసాగిస్తూనే.. జాతీయోద్యమంలో కాంగ్రెస్‌ కార్యకర్తగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న గెయిన్‌చంద్‌కు.. 1929లో జరిగిన ఓ సభలో గాంధీజీ తన ప్రసంగాన్ని ప్రజలకు చేరవేయటానికి పడుతున్న కష్టాన్ని చూశాక.. లౌడ్‌స్పీకర్ల ఆలోచనలు బుర్రలో తట్టాయి. వెంటనే.. తన షికాగో కంపెనీ పేరుతో లౌడ్‌స్పీకర్లను కాంగ్రెస్‌ సభల్లో అమర్చటం ఆరంభించారు. 1931 కరాచీ కాంగ్రెస్‌ సదస్సులో తొలిసారి షికాగోకు పరీక్ష ఎదురైంది. పూర్ణ స్వరాజ్యం నుంచి మొదలెడితే.. ప్రాథమిక హక్కుల్లాంటి ముఖ్యమైన తీర్మానాలు ప్రవేశపెట్టిన ఆ సదస్సులో.. షికాగో ప్రత్యేక ఆకర్షణైంది. నాయకులందరి ప్రసంగాలను తొలిసారిగా ప్రజలు.. స్పష్టంగా వినగలిగారు.

'కొన్ని కీలకమైన అంశాలను నేను ప్రస్తావించినప్పుడు.. ప్రజలు చప్పట్లతో స్పందించారంటే వారు నా ప్రసంగాన్ని స్పష్టంగా, ఏకాగ్రతతో విన్నారనే అర్థం. ఇదంతా.. షికాగో రేడియో లౌడ్‌స్పీకర్ల వల్లే సాధ్యమైంది' అని గాంధీజీ కితాబిచ్చారు. 1937లో.. గెయిన్‌చంద్‌ కుమారులు నానిక్‌, విశ్రామ్‌లు కంపెనీలో భాగస్వాములుగా చేరి తండ్రికి చేదోడుగా నిలవటమేగాకుండా.. స్వాతంత్య్ర సమరంలోనూ భాగమయ్యారు. అది మొదలుగా.. ఎక్కడ కాంగ్రెస్‌ సభలు జరిగినా నేతలతో పాటు 'షికాగో' తప్పనిసరైంది. నాయకుల ప్రసంగాలను చెవులకు చేర్చింది.. వారిని ప్రజలకు చేరువ చేసింది. 1943 జూన్‌ 16న గెయిన్‌చంద్‌ కన్నుమూసినా.. తనయులు తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ తొలి ప్రసంగమూ.. షికాగో రేడియో లౌడ్‌స్పీకర్లలో వినిపించిందే!

ABOUT THE AUTHOR

...view details