తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2020, 6:51 AM IST

ETV Bharat / opinion

అసోం అభివృద్ధికి మార్గదర్శి.. తరుణ్​ గొగొయ్

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నారు. తీవ్రవాద కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని పురోగతి బాట పట్టించిన దార్శనిక నేతగా గుర్తింపు పొందారు. మూడుసార్లు సీఎం పీఠాన్ని అధిష్ఠించి.. అత్యధిక కాలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు తరుణ్​. తన పాలనా కాలంలో రాష్ట్రంలో తిరుగుబాటును అణచివేసేందుకు ఎంతగానో కృషి చేశారాయన. దేశంలో మారుమూలన ఈశాన్య ప్రాంతం నుంచి బలమైన నేతగా తరుణ్‌ గొగొయ్‌ సాగించిన ప్రస్థానం ప్రస్తుత తరానికి స్ఫూర్తిదాయకం.

ASSAM FORMER CM TARUN GOGOI
అసోం అభివృద్ధికి మార్గదర్శి.. దార్శనిక నేత

ముఖంపై చెరగని చిరునవ్వుతో కనిపించే తరుణ్‌ గొగొయ్‌ రాజకీయ యవనికపై అందరికీ సుపరిచితులు. అసోం రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గొగొయ్‌ది ఈశాన్య భారత్‌లో ప్రత్యేక ప్రస్థానం. తీవ్రవాదం కోరల్లో మగ్గిన రాష్ట్రాన్ని చీకటి రోజుల నుంచి పురోగతి దిశగా విజయవంతంగా నడిపిన ఘనత ఆయన సొంతం. ఆయన సంస్కరణల కారణంగా అందివచ్చిన ఆర్థిక అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆయన గాంధీజీ తాత్వికతను విశ్వసించే నికార్సైన కాంగ్రెస్‌వాది. క్లిష్టపరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకొని ఒంటిచేత్తో విజయాల్ని సాధించిపెట్టారు.

తరుణ్​ గొగొయి

రాజకీయ జీవితం

1968లో అసోమ్‌లోని జోర్హాట్‌ పురపాలక సంఘంలో గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. గువాహతి విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టాపుచ్చుకొని కెరీర్‌ ప్రారంభించారు. 1971లో జోర్హాట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1976లో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తరవాత రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1985లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎదిగారు. పార్లమెంటులో చక్కని వాగ్ధాటి ప్రదర్శించేవారు. గాంధీల కుటుంబానికి సన్నిహితులుగా పేరొందారు. ఆయన దార్శనికతను మెచ్చి ఏఐసీసీలో పలు బాధ్యతలను అప్పగించారు. అసోం ప్రాంతీయ నేత నుంచి జాతీయ స్థాయి నేతగా కీర్తి గడించారు. 1991లో నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆహార, ఆహారశుద్ధి పరిశ్రమల సహాయ మంత్రిగా పనిచేశారు. కోకాకోలా, పెప్సీ కంపెనీలను భారత్‌లోకి అనుమతించడంలో కీలకపాత్ర పోషించారు.

అసోం అభివృద్ధికి మార్గదర్శి

అసోమ్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి, పంపించి వెయ్యాలని ఆరేళ్లపాటు చేపట్టిన ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన అసోం గణ పరిషత్‌ (ఏజీపీ) వంటి ప్రాంతీయ రాజకీయ శక్తి కారణంగా కాంగ్రెస్‌ ప్రాభవం క్షీణించిన కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అధినాయకత్వం గొగొయ్‌పై ఉంచింది. అంచనాలకు తగినట్లుగా గొగొయ్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చెయ్యడమే కాకుండా, 2001 నుంచి 2016 దాకా మూడుసార్లు వరసగా పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. 2001లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత గొగొయ్‌ ఎంతో పరిణతి చూపి శాంతిభద్రతల స్థాపనకు ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో తీవ్రవాదం కారణంగా దెబ్బతిన్న శాంతిని పునరుద్ధరించి, అభివృద్ధి వాతావరణాన్ని నెలకొల్పారు. ఒకటిన్నర దశాబ్దాలపాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించి, అసోమ్‌లోని అన్ని తీవ్రవాద సంస్థలను చర్చలకు ఒప్పించిన ఘనత ఆయన ప్రత్యేకత.

మచ్చలేని నాయకుడు

అస్సామీయుల అభీష్టం మేరకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ)ను నవీకరించే ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఇతరుల పేర్లను తొలగించే ప్రక్రియను 2005 నుంచి సాగించారు. న్యాయస్థానంలో కేసుల కారణంగా అది నిలిచిపోయినా, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 2013 నుంచి నవీకరణ పనులు కొనసాగుతున్నాయి. 2016 వరకు పార్టీని ఏకతాటిపై నడిపారు. మూడేళ్లు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న గొగొయ్‌ తన ముక్కుసూటితనంతో అసోమ్‌లోని అన్ని వర్గాల నుంచి ఆదరణ పొందారు. గొగొయ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా వెలువడలేదు. ఇది ఆయనను ఇతర నేతల నుంచి సమున్నతంగా నిలిపింది. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ ప్రాంత ప్రయోజనాల కోసం బలమైన గళాన్ని వినిపించేవారు. 2019లో తన వయసు, అనారోగ్యం సహకరించకపోయినా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాదిగా సుప్రీంకోర్టు తలుపుతట్టారు. గత ఏడాది డిసెంబర్‌ 18న తన అప్పీలుపై వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

ప్రస్తుత తరానికి స్ఫూర్తిదాయకం

ఈ ఏడాది ఆగస్టు 25న గొగొయ్‌కి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకొని అక్టోబర్‌ 25న ఇంటికి చేరారు. శ్వాస ఇబ్బందితో మళ్లీ నవంబర్‌ రెండున ఆస్పత్రిలో చేర్చారు. 23వ తేదీ సోమవారం ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డాలీ గొగొయ్‌, కుమారుడు, లోక్‌సభ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌, కుమార్తె ఉన్నారు. తరుణ్‌ గొగొయ్‌కి ఒకప్పటి సన్నిహిత అనుచరుడు, ప్రస్తుత అసోం ఆరోగ్య, విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ... 'మహాదార్శనికత కలిగిన తరుణ్‌ గొగొయ్‌ ప్రజల మనిషి... అభివృద్ధిపైనే దృష్టిపెట్టేవారు, అందరి మద్దతునూ పొందారు. అసోమ్‌ను చీకటి కాలం నుంచి కాపాడి, పదిహేనేళ్లపాటు కొత్త అభివృద్ధి దశలో నడిపారు' అని కొనియాడారు. దేశంలో మారుమూలన ఈశాన్య ప్రాంతం నుంచి బలమైన నేతగా తరుణ్‌ గొగొయ్‌ సాగించిన ప్రస్థానం ప్రస్తుత తరానికి స్ఫూర్తిదాయకం.

- అనూప్‌ శర్మ, రచయిత

ఇదీ చదవండి:అసోం మాజీ సీఎం గొగొయి కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details